Sep 07,2022 06:52

      రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు నగరం వరదల బారిన పడిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. ఐ.టి పరిశ్రమలు కేంద్రీకరించి ఉండే అవుటర్‌ రింగ్‌రోడ్డుతో పాటు గార్డెన్‌ సిటీలోని అనేక కీలక ప్రాంతాలు నీటమునిగాయి. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విల్లాలు నీట మునగడంతో వాటి యజమానులు పడవలు, ట్రాక్టర్లు సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇక సామాన్యుల కష్టాలను ఊహించుకోవాల్సిందే ! నగరానికి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన వనరులు వరద బారిన పడటంతో మంచినీటికి కటకట ఏర్పడింది. మరో రెండు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తవుతాయని, అప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మై చెప్పారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 42 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైందని, ఈ నెల ఒకటి నుండి ఐదవ తేదీ మధ్య కురిసే సాధారణ వర్షపాతం కంటే 150 శాతం అదనపు వర్షం రాజధాని లోని అనేక ప్రాంతాల్లో గడిచిన రెండు రోజుల్లో పడిందని ఆయన వివరించారు. ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులకు మాత్రం గత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కారణంగా చూపే ప్రయత్నం ఆయన చేశారు. ఈ రాజకీయ ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ, అతి తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం కురవడం అన్నది కొన్ని సంవత్సరాలుగా సాధారణ విషయంగా మారింది. 2017లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇటువంటి ఉపద్రవాన్నే బెంగళూరు నగరం చవిచూసింది. 127 ఏళ్లలో కనివినీ ఎరుగని వర్షమని అప్పట్లో చెప్పారు. 2014, 2016 సంవత్సరాల్లోనూ ఇటువంటి దుస్థితినే అక్కడి ప్రజలు ఎదుర్కున్నారు. వరుసగా సంభవిస్తున్న ఈ ఉత్పాతాల నుండి పాలకులు ఏమైనా నేర్చుకున్నారా? వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే దుష్పరిణామాలను తట్టుకోవడంతోపాటు, పర్యావరణ రక్షణకు దోహద పడే విధంగా నగర ప్రణాళికలను రూపొందించలేమా? అన్నవి కీలక ప్రశ్నలు.
       ఆ మాటకొస్తే బెంగళూరే కాదు. హైదరాబాద్‌, చెన్నై, ముంబాయి, గురుగ్రామ్‌ ఇలా అనేక నగరాలది ఇటువంటి దుస్థితే. ప్రభుత్వాలు అట్టహాసంగా చెప్పుకునే పట్టణ ప్రణాళికలు, స్మార్ట్‌సిటీలు ఈ తరహా విపత్తుల నుండి ప్రజలకు ఏమాత్రం రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా కార్పొరేట్‌, పొలిటీషియన్‌, బ్యూరోక్రాట్‌ కూటమి ప్రకృతి వనరులను కొల్లగొడుతోంది. హైదరాబాద్‌ నుండి తాజాగా విపత్తుకు గురైన బెంగళూరు వరకు అన్ని నగరాల్లోని ప్రధాన చెరువుల్లో అత్యధిక భాగం ఆక్రమణలకు గురికావడం ఒక విషాదకరమైన వాస్తవం! 2016లో కర్నాటక శాసనసభ కమిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం బెంగళూరు నగర చుట్టుపక్కల 23,300 హెక్టార్ల చెరువుల భూమి ఆక్రమణలకు గురైంది. ఇలా ఆక్రమణలు చేసిన వారిలో అత్యధికులు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన బడా వ్యాపారులే! 19 శాతం చెరువులు మాత్రమే పూర్తి స్థాయిలో మిగిలాయని, వాటిని కాపాడుకోవాలని కమిటీ సూచించింది. అయితే, ఆ తరువాత కూడా ఆక్రమణల పర్వం కొనసాగింది. అదే సమయంలో మురుగునీటి పారుదలకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. బెంగళూరు అవుటర్‌ రింగ్‌రోడ్డులో మురుగునీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థే అరకొర కాగా, దానిలో 50 శాతానికి పైగా వివిధ సంస్థలు ఆక్రమించినట్లు తాజా అధ్యయనం! ఇక వర్షపు నీరు బయటకు పోవడానికి మార్గమెక్కడీ అన్ని మెట్రోపాలిటన్‌ సిటీలదీ ఇటువంటి దుస్థితే !
       చెన్నై నగరాన్ని ముంచెత్తిన 2015 వరదల తరువాత ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ భవిష్యత్తులో తీసుకోవాల్సిన అనేక చర్యలను సిఫార్సు చేసింది. ఆక్రమణల తొలగింపు, జలవనరుల పరిరక్షణ, మురుగునీటి పారుదల వ్యవస్థ, పట్టణ ప్రణాళికలు ఉండవలసిన తీరు తదితర అంశాలను వీటిలో పేర్కొంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవలే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలు వాటి సిఫార్సులు ఎలా ఉన్నప్పటికీ వాతావరణ మార్పులకనుగుణంగా పట్టణ ప్రణాళికలను రూపొందించాలి. జలవనరుల ఆక్రమణలను పూర్తిగా నిరోధించాలి. మురుగునీటి పారుదల, స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజి వ్యవస్థలతో పాటు అన్ని సౌకర్యాలతో కూడిన పర్యావరణ హిత నగరాలను ఏర్పాటు చేయడానికి ప్రాధ్యానత ఇవ్వాలి. అప్పుడే నగరవాసుల బతుకులకు భద్రత లభిస్తుంది.