Sep 25,2022 07:53

మనిషికున్న జిహ్వ చాపల్యమో, చింతలో ఉన్న యాసిడ్‌ లక్షణమోగానీ చింతకాయలు అనగానే ఆబాల గోపాలానికి నోరూరుతుంది. ఒకవ్యక్తిని కాస్త పౌరుషం తగ్గించుకోవచ్చు కదా అనే అర్థంలో మాట్లాడేటప్పుడు 'చింత చచ్చినా పులుపు చావదు' అంటారు. దీని శాస్త్రీయ నామం టామరిండస్‌ ఇండికా. చింతకాయ గుజ్జులో టార్టారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. అదే ఈ పుల్లని రుచికి కారణం. దీనిలో ఔషధ గుణాలూ మెండు. పూర్వకాలం నుంచి ఆహారపదార్థంగా రకరకాల రూపాల్లో మనం చింతను చింతలేకుండా వాడుతున్నాం. మరి ఆ రూపాల్లో కొన్నింటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..
తుమ్మికూరతో కలిపి పచ్చడి

CHETNY


కావలసిన పదార్థాలు: లేత చింతకాయలు - 7,8, తుమ్మికూర - 3 కట్టలు, పచ్చిమిర్చి -100గ్రా, నీరు - పావు కప్పు, ఉప్పు - తగినంత, వెల్లుల్లి - 7,8 రెబ్బలు, జీర- 1/2 స్పూన్‌, ఉప్పు - తగినంత, 
పోపు: నూనె - 2 స్పూన్లు, ఆవాలు, జీర - కొద్దిగా, దంచిన వెల్లుల్లి - 2 రెబ్బలు, పసుపు - 1/4 స్పూన్‌.
తయారీ: చింతకాయలు, తుమ్మికూర, పచ్చిమిర్చి, పావు కప్పు నీరు వేసి మూడింటిని మగ్గించి, ఆరనివ్వాలి. మిక్సీ జార్‌లో లేదా రోట్లో వెల్లుల్లి రెబ్బలు, జీర, ఉప్పు, చింతకాయల మిశ్రమం వేసి, మెత్తగా నూరుకోవాలి. ఆ తరువాత తాలింపు పెట్టుకుంటే చింతకాయ తుమ్మికూర పచ్చడి రెడీ. వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.
పచ్చిరొయ్యల కూర 

ROYYA


కావలసిన పదార్థాలు: లేత చింతకాయలు - 8, రొయ్యలు - అర కేజీ, నూనె - 1/4 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ - 2 (ముక్కలు చేసుకోవాలి), నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి - 4, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - స్పూన్‌, ఉప్పు, కారం - తగినంత, పసుపు - 1/4 స్పూన్‌, కొత్తిమీర తరుగు - పావు కప్పు.
తయారీ : చింతకాయలు చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి కచాపచాగా దంచుకోవాలి. స్టౌపై బాండీలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలను వేసి, దోరగా వేయించుకోవాలి. శుభ్రంగా కడిగిన రొయ్యలను వేసుకొని, ఒకసారి కలియపెట్టి మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం పాటు ఉంచి ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి బాగా కలిపి, మూతపెట్టుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఐదు నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, దంచిన చింతకాయగుజ్జు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గాక ఉప్పు, కారం, కప్పు నీరు పోసి, నూనె పైకి తేలేవరకూ ఉడికించాలి. చివరిగా కొత్తిమీర తరుగు చల్లి, కూరంతా ఒకసారి తిప్పి, దింపేయాలి.
చికెన్‌

CHEKEN


కావలసిన పదార్థాలు: చింతకాయలు - 100 గ్రా , చికెన్‌ - పావు కేజీ, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 4, పోపు దినుసులు - స్పూన్‌, కారం, ఉప్పు, పసుపు - 1/4 స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - స్పూన్‌, ధనియాల పొడి - స్పూన్‌, జీరాపొడి - స్పూన్‌, గరం మసాలా - స్పూన్‌, కొత్తిమీర - కొద్దిగా, నూనె - 3 స్పూన్‌లు.
తయారీ: ముందుగా చింతకాయల్ని ఒక గిన్నెలో వేసి, రెండు గ్లాసుల నీరు పోసి, మెత్తగా ఉడికించి రసం తీయాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడిచేసి జీర, ఆవాలు, ఉల్లి తరుగు, కొంచెం ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, నిమిషం పాటు వేపాలి. తర్వాత పచ్చిమిర్చి, పసుపు, కారం ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా ఒకదాని తర్వాత ఒకటి వేసి, కలియబెట్టాలి. కొద్దిసేపు మగ్గాక, చికెన్‌ వేసి తిప్పాలి. ఇందులో నీరంతా ఇగిరే వరకూ ఉంచి, తర్వాత చిన్న గ్లాసు నీళ్లు పోయాలి. ఇలా మూడు నిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. తర్వాత తీసిపెట్టుకున్న చింతకాయల రసం పోసి, ఒకసారి తిప్పాలి. చికెన్‌ ఉడికి, నూనె పైకి తేలే వరకూ ఉంచాలి. చివరిలో కొత్తిమీర వేసి, కూర దింపేసుకోవాలి.
చిత్రాన్నం

RICE


కావలసిన పదార్థాలు: లేత చింతకాయలు - పావు కేజీ, ఎండుమిర్చి - 8, నూనె, తాలింపు దినుసులు - (ఆవాలు, చాయ మినప్పప్పు, పచ్చి శనగపప్పు, కరివేపాకు) సరిపడా, వేరుశనగ పప్పులు - 1/2 కప్పు, పసుపు, ఇంగువ - తగినంత, 1/4 కేజీ బియ్యంతో పొడిపొడిగా ఉడికించిన అన్నం.
తయారీ : చింతకాయలు, ఎండుమిర్చి కచాపచాగా దంచాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడిచేసి, వేరుశనగ గుళ్ళు, తాలింపు దినుసులు వేసి, వేపాలి. అవి చిటపటలాడు తుంటే కరివేపాకు, పసుపు, ఇంగువ వేయాలి. తర్వాత దంచిన చింతకాయలు, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేయాలి. ఇలా నిమిషం పాటు తిప్పుతూ వేపాలి. మంచి వాసన వచ్చేటప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి, దానికి పొడిగా వండిన అన్నం చేర్చాలి. గరిటెతో బాగా కలిసేలా కలియబెట్టాలి. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లి, కలిపి, నిమిషంపాటు మూత పెట్టి ఉంచాలి. ఇది భలే రుచిగా ఉంటుంది.