Nov 13,2022 08:13

అన్నీ మాకు తెలుసంటూ.. ఎన్నో మేం చేయగలమంటూ.. తమ చిట్టి చిట్టి చేతులతో చిరు వంటలు చేస్తే.. ఉదయాన్నే పిల్లలకు బాక్సులు పెట్టడానికి ఆతృత, ఆరాటపడే అమ్మ ఎలా ఫీలవుతుంది..? ఆ అమ్మ వదనంలో ఎంత ఆనందం.. మరెంత ఆప్యాయత..! అలాంటి రుచులే మనకు చూపించాలనుకుంటుంది గీతిక బాలల దినోత్సవం సందర్భంగా. రండి.. రండి.. మరి అవేంటో తెలుసుకుందాం.. ఆలస్యం లేకుండా చేసేద్దాం..! మన అమ్మనీ నాన్ననీ మెప్పిద్దాం..

గ్లాస్‌ ఫ్రూట్‌ కేక్‌..

cake


కావలసిన పదార్థాలు: అరటి, యాపిల్‌, కమలా, ద్రాక్ష, బొప్పాయి, దానిమ్మ, ఖర్జూర పండ్ల ముక్కలు ఒక్కొక్క రకం - 1/2 కప్పు చొప్పున, నీరు 750 గ్రా., పంచదార - 200గ్రా., చైనా గ్రాస్‌ - 15 గ్రా.
తయారీ: ఒక గిన్నెలో నీరు పోసి గ్రైండ్‌ చేసిన చైనాగ్రాస్‌, పంచదార యాడ్‌ చేయాలి. స్టౌపై మీడియం ఫ్లేం మీద (5ని.) చైనాగ్రాస్‌ కరిగేంత వరకూ తిప్పుతూ ఉడికించాలి. తరువాత స్టౌ ఆఫ్‌ చేసి వెడల్పుగా ఉన్న వేరే గిన్నెలో ఈ మిశ్రమాన్ని రెండు గరిటెలు వేసి, ఆపై పండ్ల ముక్కలు సర్ది మిగిలిన మిశ్రమాన్ని పండ్ల ముక్కలు మునిగేవరకూ పోయాలి. గిన్నెను కింద రెండు సార్లు తట్టి, పూర్తిగా ఆరిన తరువాత మూతపెట్టి డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి. మూడు గంటల తర్వాత బయటికి తీయాలి. దీన్ని వేరే ప్లేట్‌లోకి మార్చుకుంటే అందమైన గ్లాస్‌ ఫ్రూట్‌ కేక్‌ రెడీ.
జున్ను..

junnu


కావలసిన పదార్థాలు: వెన్న తీయని పాలు - 1/2 లీ., బెల్లం - 150 గ్రా., జున్ను పౌడర్‌ - 100 గ్రా., యాలకుల పొడి - 1/2 స్పూను, మిరియాల పొడి - 1/2 స్పూను.
తయారీ: ఒక పెద్ద గిన్నెలో పాలు, బెల్లం, జున్ను పౌడర్‌, యాలకుల పొడి, మిరియాల పొడి అన్నింటినీ బాగా కలిపి, మూత పెట్టాలి. ఇడ్లీ పాత్రలో చిన్న గ్లాసు నీరు పోసి గిన్నెను దానిలో ఉంచి, మూత పెట్టి స్టౌ మీద అరగంట పాటు మీడియం ఫ్లేం మీద ఉండికించాలి. అరగంట తరువాత స్టౌ ఆఫ్‌ చేయాలి. ఇప్పుడు పాత్ర మూత తీసి, చాకును జున్ను లోపలికి గుచ్చి చూడాలి. దానికి ఏమీ అంటనట్లైతే జున్ను రెడీ అయినట్లే. గిన్నెను బయటికి తీసి ఐదు నిమిషాల తరువాత జున్ను అంచుల వెంబడి చాకుతో గిన్నె నుంచి వేరుచేయాలి. వేరే ప్లేటులోకి మార్చుకుని ముక్కలుగా కట్‌ చేసి, సర్వ్‌ చేసుకోవడమే. (చల్లగా తినాలనుకుంటే జున్ను ఆరిన తరువాత గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు)
బ్రెడ్‌ ఆమ్లెట్‌..

amalate


కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లైసెస్‌ - 4, గుడ్లు - 6, ఉల్లితరుగు - 1/2 కప్పు, కొత్తిమీర తరుగు - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 1/2 స్పూను, ధనియాల పొడి - స్పూను, జీరాపొడి - 1/2 స్పూను, నెయ్యి - స్పూను
తయారీ: ఒక గిన్నెలో గుడ్లసొనను నురుగు వచ్చే వరకూ బీట్‌ చేసుకోవాలి. దానిలో ఉల్లితరుగు, మిగిలిన పదార్థాలన్నీ బాగా కలిసేలా కలపాలి.
ఒక పాన్‌లో నెయ్యివేసి బ్రెడ్‌ పీసెస్‌ను రెండువైపులా వేయించుకోవాలి. అదే పాన్‌లో స్పూను నూనె వేసి గుడ్డు సొన వేసి వెంటనే బ్రెడ్‌ స్లైస్‌ను దానిపై పెట్టాలి. నిమిషం తరువాత బ్రెడ్‌ పైభాగాన మరల సొన వేయాలి. చుట్టూ ఉన్న ఆమ్లెట్‌ అంచులను బ్రెడ్‌ పైకి మడిచి, మరోవైపుకు తిప్పి వేపాలి. మిగిలిన బ్రెడ్‌ స్లైసెస్‌ అన్నీ ఇలాగే వేయించుకుంటే నోరూరించే బ్రెడ్‌ ఆమ్లెట్‌ రెడీ.
మసాలా స్వీట్‌ కార్న్‌..

corn


కావలసిన పదార్థాలు: ఉడికించిన స్వీట్‌కార్న్‌ గింజలు - కప్పు, వెన్న - 100 గ్రా, ఉప్పు - తగినంత, కారం - స్పూను, వేయించుకున్న జీరా పొడి - స్పూను, చాట్‌ మసాలా - స్పూను
తయారీ: స్టౌ మీద బాండీ పెట్టి, దానిలో వెన్న కరిగించి స్వీట్‌కార్న్‌ వేసి ఐదు నిమిషాలు వేయించాలి. తరువాత ఉప్పు, జీరాపొడి, చాట్‌ మసాలా, కారం అన్నీ చల్లినట్లు వేసి బాగా కలపాలి. యమ్మీ యమ్మీ స్వీట్‌ కార్న్‌ రెడీ. స్టౌ ఆఫ్‌ చేసి బౌల్స్‌లోకి సర్వ్‌ చేసుకోవడమే.