
ఊరికి దూరాన ఉన్న చిట్టడవిలో ఓ లేడి వుంది. దానికి చుట్టాలు, స్నేహితులు ఎవ్వరూ లేరు. ఒంటరిగా తిరుగుతూ లేత చిగుళ్లు తింటూ.. పక్కనే వున్న సరస్సులో నీరు తాగుతూ జీవనం సాగిస్తూ వుంది. ఓ రోజు లేడి ఆకులు తింటూ వుండగా ఒక కాకి అక్కడకి వచ్చింది. తనను తాను పరిచయం చేసికుంటూ 'నా పేరు కనకం.. సుదూర ప్రాంతం నుండి ఇక్కడకు వచ్చాను. నాకు ఈ అడివి కొత్త. కనుక నీతో స్నేహం చేయాలని వుంది' అంది లేడీతో.
'కాకితో నాకు స్నేహం ఏంట? నీవు పక్షి జాతి, నేను జంతు జాతి. మనకిద్దరికీ స్నేహం కుదురుతుందా?' అంది లేడి.
'స్నేహానికి జాతులేమిటి..? ఎవరు ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు. సరదాగా మాట్లాడుకోవచ్చు.. సంగతులు చెప్పుకోవచ్చు. అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయమూ చేసుకోవచ్చు' అంది కనకం.
'సరే సరే.. ఇక నుంచి మనం స్నేహితులం' అంది లేడి. ఆ రోజు నుండి అ రెండూ స్నేహితులయ్యాయి. ప్రతిరోజూ కాకి లేడికి శుభోదయం చెప్పి, ఆహారానికి బయలుదేరి వెళ్లేది. తిరిగి వచ్చకా అక్కడి సంగతులు లేడికి చెప్పేది. లేడి కూడా.. ఇక్కడ జరిగిన సంగతులు కాకి తిరిగి వచ్చకా చెప్పేది. అలా ఆ రెంటినీ చూసిన ఒక చీమ..
'మీ స్నేహం చూస్తుంటే ముచ్చటగా వుంది. నా పేరు చిన్నారి, మీతో స్నేహం చేయాలని వుంది' అంది రెంటితో.
'నీతో స్నేహమా..?' అంటూ నవ్వింది లేడి.
'నాకు ఇక్కడ స్నేహితులు లేరు. అందుకే మీతో స్నేహం చేయాలని కోరుతున్నా..' అంది చీమ.
'సరే ఈ రోజు నుండి మనం ముగ్గురం స్నేహితులం'' అంది కాకి.
''మొదట మనం ఇద్దరం స్నేహితులం అన్నావు, ఇప్పుడు ఈ చిన్న చీమతో స్నేహం అంటున్నావు ఏమిటిది?'' అంది లేడి.
''స్నేహానికి చిన్న పెద్ద భేదం లేదు మిత్రమా.. అంది కనకం.
'సరే..' అంది లేడి అన్యమనస్కంగా. ఆ రోజు నుండి అవి మూడూ స్నేహంగా వుండేవి. కనకం బాగా మాట్లాడినా.. లేడి మాత్రం చీమతో ఎక్కువ మాట్లాడేది కాదు. ఒకరోజు కనకం ఉదయాన్నే ఆహారానికి బయలుదేరింది.
'శుభోదయం.. మిత్రమా!' అంది చీమ. 'శుభోదయం.. నేను ఆహారానికి వెడుతున్నా.. జాగ్రత్త!' అంది కనకం. అలాగే అంది చీమ.
కొద్ది దూరంలో కనకానికి ఓ వేటగాడు కనిపించాడు. భుజాన విల్లు, బాణంతో నడుస్తున్నాడు. వాడు తమ నివాసం వైపు కాకుండా మరొకవైపుకు నడవడంతో తన స్నేహితుడు లేడికి వచ్చిన ఆపదేమీ లేదులే అనుకుంటూ ముందుకు వెళ్లింది కనకం. దానికి కొంతదూరంలో ఒక ఎండిన చేప కనిపించింది. దాన్ని ముక్కన కరచుకుని, ఇంటికి బయలు దేరింది. అది ఇంటికి చేరేసరికి తను చూసిన వేటగాడు దూరంగా లేత పచ్చిక తింటూ పరిసరాలను మరచిపోయిన లేడికి బాణం గురిపెట్టాడు. తిండి సంగతి మరచి 'కావు..కావు' మంటూ అరిచింది కనకం. అయినా ఆ కేకలు పట్టించుకునే స్థితిలో లేదు లేడి.
తన మానాన తాను తింటోంది. అది చెట్టుమీదున్న చీమ చూసింది. వెంటనే ఒక్క ఉరుకున లేడిపై దూకి, దాని ముక్కు మీద కుట్టింది. దాని గట్టి కుట్టుకి చెంగున గెంతింది లేడి. వేటగాడి బాణం గురి తప్పింది.
సర్రున బాణం తన మెడ మీదుగా పక్కనున్న చెట్టులో దిగడం చూసిన లేడి వెంటనే గుబురు పొదలోకి పరుగు తీసింది. చీమ లేడిని వదిలి, కిందపడి చెట్టు చేరింది. కాకి హాయిగా ఊపిరి పీల్చుకుంది. నిరాశగా వెనుతిరిగాడు వేటగాడు.
కొద్ది సేపటికి.. 'ఏం.. చీమా స్నేహం అంటే ఇదేనా.. నన్నే కూడతావా?' అంది లేడి..
'కుట్టక ముద్దెట్టుకో మంటావా..? పరిసరాలు మరచిపోయి పచ్చిక తింటున్నావు. నేను అరిచినా వినిపించుకోవాయే.. చీమ నిన్ను కుట్టకపోతే వేటగాడి బాణం నీ గుండెల్లో దిగేది..!' అంది కనకం. 'నిజమే.. జరిగింది గ్రహించలేకపోయాను. చిన్నదానివి అయినా తెలివిగా నన్ను వేటగాడి బారి నుండి కాపాడావు. అహంకారంతో ఇంతకాలం నీతో స్నేహం సరిగా చేయలేకపోయాను.. నన్ను క్షమించు' అంది లేడి. అప్పటి నుండి మూడూ స్నేహంగా వుండసాగాయి.
కూచిమంచి నాగేంద్ర
91821 27880.