తెల్లవారుతోంది. గూళ్ల నుండి, పక్షులు కిలకిలమంటూ ఆకాశంలోకి ఎగరసాగాయి. అలాగే మల్బరీ తోటలోకి ఓ చిలుక వచ్చి వాలింది. ఓ చెట్టు మీద దాని చూపులు పడ్డాయి. ఆ చెట్టు ఆకులన్నీ ఎవరో కొరికేసినట్టుగా అనిపిస్తోంది! ఆశ్చర్యంగా చూస్తుండిపోయిన ఆ చిలుకకు ఆకులను తింటున్న గొంగళి పురుగు కనిపించింది.
వెంటనే గొంగళి పురుగును 'హలో! నీవు ఏమి చేస్తున్నావ్? ఏమిటా పని?' అని హెచ్చరికలా అడిగింది చిలుక.
'నాకు ఆకలి వేస్తుంది. అందుకే ఆకులు తింటున్నాను' అంది గొంగళి పురుగు ఆకులు నములుతూ.
'ఆ చెట్టు నీకు ఆశ్రయమిస్తే దానికి హాని తలపెడుతున్నావ్. నీ అవసరాలకు, నీ ఆనందాలకు ప్రకృతికి హాని చేయడం మంచిది కాదు. ఓ నేస్తమా! ఇక మానుకో... అని బుజ్జగిస్తూ చెప్పింది చిలుక.
'సరే, ఇక ఏ చెట్టుకూ హాని చేయనే చేయను. ప్రతి చెట్టు, ప్రతి పువ్వు నన్ను ఇష్టపడేలా మారతాను. తప్పకుండా మారతాను' అని ఆవలిస్తూ గొంగళి పురుగు అనడంతో అక్కడినుండి చిలుక ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయింది.
'గొంగళి పురుగు శరీరంలో నెమ్మది, నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. అందమైన రూపం, ఆ రూపానికి హాయిగా ఎగరడానికి రెక్కలు, ఆ రెక్కల మీద ఎంచక్క బోల్డని రంగుల చుక్కలు, సున్నాలు వచ్చాయి.
'భలే భలే చిత్రంగా, విచిత్రంగా ఉంది' అని గొంగళి పురుగు అనుకుంటుండగానే తన చుట్టూ ఉన్న గూడు 'టఫ్' మని పగిలిపోయింది.
తను ఇప్పుడు గొంగళి పురుగు కాదు. రంగురంగుల సీతాకోకచిలుకగా మారిపోయింది! ఆనందంతో గాలిలోకి ఎగిరిపోయింది. ఆనాటి నుండి ఆ సీతాకోకచిలుక పూలలోని పుప్పొడిని ఒడిసిపట్టి, ఓ పువ్వు నుండి మరో పువ్వుకి మారుస్తూ పూలు.. కాయలుగా మారడానికి సాయపడుతుంది.
'చెట్లకు ఎంతో కొంత నా వంతుగా సహాయం చేయగలుగుతున్నాను. నాకు ఇప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంద'ని తనలో తను అనుకుంటుండగానే తన అందమైన రెక్కలను ఎవరో తాకినట్లు అనిపించడంతో ఉలిక్కిపడి చూసింది సీతాకోక చిలుక. బడి నుండి ఇంటికి వస్తున్న బంటి తన రెక్కలను పట్టి తనను ఆటపట్టిస్తుంటే పాపం గిలగిలా కొట్టుకో సాగింది సీతాకోక చిలుక.
అప్పుడే పచ్చని చెట్టు మీద వాలిన చిలక టప టపా రెక్కలు ఆడిస్తూ ఓ బంటీ! మానాలి నువ్వు ఆ అల్లరి మా మంచి బంటీ! మానాలి. మంచి బాలుడుగా నువ్వు మారాలి. అంత అందమైన సీతాకోక చిలుక ఎలా పుట్టిందో, ఎన్ని మార్పులు జరిగితే రంగు రంగులుగా వచ్చిందో నీ పాఠాలలో తెలుసుకో' అంటూ టప టపా రెక్కలు కొట్టుకుంటూ రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది చిలుక.
అంతే.. వెంటనే బంటి సీతాకోక చిలకను వదిలేశాడు. పరుగు పరుగున ఇంటికి వెళ్ళి పుస్తకం తీసి పాఠం చదవటం ప్రారంభించాడు. హమ్మయ్య! అనుకుంటూ రివ్వున ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది సీతాకోక చిలుక.
- అమ్మిన వెంకట అమ్మిరాజు
94407 08656