Feb 05,2023 08:34

చిక్కుడు అంటే ఇష్టపడని వారుండరు. దానిలో గింజలకు మరింత ప్రత్యేకత. రుచిలోనే కాక పోషకాలలోనూ ఘనమైన చోటు ఉంది చిక్కుడుకు. ఎక్కువగా చిక్కుడుతో టమోటా కలిపి చెయ్యటం అందరికీ సుపరిచితం. అయితే ఈ పోషకాల గనికి మరిన్ని ప్రోటీన్స్‌ సమకూరితే పౌష్టికాహారమౌతుంది కదా! అందుకే చిక్కుడును మాంసాహారంతో కలిపి వండుకునే రుచులూ రెడీ అయిపోయాయి. మరి చిక్కుడు - నాన్‌వెజ్‌ రుచులను తెలుసుకుందామా!

  • గుడ్డుతో ..
1

కావలసినవి : చిక్కుడు కాయలు - 1/2 కేజీ, గుడ్లు - 4, బంగాళా దుంపలు - 2, టమోటాలు - 2, ఉల్లిపాయలు - 2, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, పసుపు - 1/4 స్పూను, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 8 రెబ్బలు, పచ్చిమిర్చి - 6, కొత్తిమీర తరుగు - 1/4 కప్పు, కరివేపాకు - 2 రెబ్బలు, ధనియాల పొడి - 2 స్పూన్లు.
తయారీ : బాండీలో నూనె వేడిచేసి, పొట్టుతీసి సన్నగా తరిగిన బంగాళాదుంప ముక్కలను, శుభ్రం చేసిన చిక్కుడుకాయలను విడివిడిగా నూనెలో దోరగా వేయించి, రెండింటినీ పక్కనుంచుకోవాలి. అదే బాండీలో తాలింపుకోసం జీర, ఆవాలు, పసుపు, కరివేపాకు, ఉల్లి తరుగులో తగినంత ఉప్పువేసి, బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకూ వేయించాలి. దానికి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు కలిపి మిక్సీ పట్టిన ముద్ద వేసి, రెండు నిమిషాలు వేయించి, సన్నని టమోటా తరుగు, కారం, ధనియాల పొడి వేసి మూతపెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించాలి. నూనె పక్కలకు చేరిన వెంటనే ముందుగానే వేయించి పక్కనుంచుకున్న బంగాళాదుంప, చిక్కుడుముక్కలు వేసి తిప్పుతూ రెండు నిమిషాలు వేయించాలి. తరువాత గుడ్లసొన ఆ మిశ్రమానికి యాడ్‌ చేసి, మూతపెట్టి కదపకుండా ఉంచాలి. రెండు నిమిషాల తరువాత గరిటెతో అంతా కలిపి స్టౌ ఆఫ్‌ చేయాలి. అంతే కోడిగుడ్డు, చిక్కుడుకాయ పొరుటు రెడీ.

  • చికెన్‌తో ..
chikeen

కావలసినవి : చిక్కుడు కాయలు - 1/4 కేజీ, చికెన్‌ - 1/4 కేజీ, నూనె - 1/4 కప్పు, ఉల్లి తరుగు - 1/2 కప్పు, పచ్చిమిర్చి చీలికలు - 4, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, ధనియాల పొడి - స్పూను, గరంమసాలా - స్పూను
తయారీ : ముందుగా శుభ్రం చేసిన చిక్కుడు కాయలను ఉప్పువేసి ఉడికించి పక్కనుంచుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లి తరుగును దోరగా వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను పచ్చివాసన పోయేవరకూ వేయించి శుభ్రం చేసిన చికెన్‌ను యాడ్‌చేసి, పది నిమిషాలపాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత చిక్కుడు ముక్కలను యాడ్‌చేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కూరంతా కలిపి మూతపెట్టి ఉడికించాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి కూరను దింపేయాలి. ఘుమఘుమలాడే చికెన్‌ చిక్కుడు రెడీ.

  • మటన్‌తో..
matton

కావలసినవి : తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు - కప్పు, మటన్‌ - 1/4 కేజీ, నూనె - 1/4 కప్పు, ఉల్లి తరుగు - 1/2 కప్పు, పచ్చిమిర్చి చీలికలు - 4, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్‌ - 2 స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, ధనియాల పొడి - స్పూను, గరమ్‌ మసాలా - స్పూను
తయారీ : ముందుగా శుభ్రం చేసిన చిక్కుడు కాయలను ఉప్పువేసి, ఉడికించి పక్కనుంచుకోవాలి. మటన్‌ను కూడా కొంచెం ఉప్పు, పసుపు పట్టించి, కుక్కర్‌లో ఉడికించాలి. బాండీలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లి తరుగును దోరగా వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను పచ్చివాసన పోయేవరకూ వేయించి, ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్‌ను యాడ్‌చేసి పది నిమిషాలపాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత చిక్కుడు ముక్కలను వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కూరంతా కలిపి మూతపెట్టి ఉడికించాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి కూరను దింపేయాలి. నోరూరించే మటన్‌ చిక్కుడు రెడీ.

  • బిర్యానీ..
4

కావలసినవి : చిక్కుడు - 1/4 కేజీ, బియ్యం - 2 కప్పులు, నెయ్యి - 2 స్పూన్లు, నూనె - 2 స్పూన్లు, దాల్చిన చెక్క- అంగుళం ముక్క, యాలుకలు (4), లవంగములు (4), స్టార్‌ పువ్వు, షాజీర - స్పూను, బిర్యానీ ఆకులు (2), ఉల్లి తరుగు - 1/2 కప్పు, పచ్చిమిర్చి చీలికలు - 4, కారెట్‌ ముక్కలు - 1/4 కప్పు, బంగాళా దుంప ముక్కలు - 1/4 కప్పు, టమోటా తరుగు - 1/4 కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, ధనియాల పొడి - స్పూను, గరం మసాలా - స్పూను
తయారీ : బాండీలో నూనె, నెయ్యి వేడిచేసి దానిలో గరం మసాలా దినుసులు వేపి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు దోరగా వేయించాలి. క్యారెట్‌, బంగాళా దుంప, టమోటా తరుగువేసి బాగా ఉడకనివ్వాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్‌ పచ్చివాసన పోయే వరకూ వేపి, ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడు ముక్కలను అందులో వేయాలి. ఆ మిశ్రమాన్ని రెండు మూడు నిమిషాలపాటు ఉడికించి ధనియా పొడి, గరమ్‌ మసాలా, తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసి, రెండు మూడు నిమిషాలు వేయించాలి. తరువాత నీరు పోసి ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు చల్లుకుంటే కమ్మకమ్మని చిక్కుడు బిర్యానీ రెడీ.