బుర్రలో కరుడుగట్టుకున్న బూజు ఉన్నంత కాలం
ఎన్ని గంగా స్నానాలు చేసినా ఫలితం లేదు
ఖరీదైన విజ్ఞాన ఫలం ఆరగిస్తున్నప్పటికీ
రసజ్ఞత లేని ఆలోచనలు ఎన్ని కురిపిస్తే ఏమి లాభం..
నోటితో శంఖము ఊది విజయభేరి మోగిస్తే
రక్తము తడిసిన నేలపై శాంతి ఫలం పండుతుందా
మండే గుండెపై ఎర్రటి మట్టి కనిపిస్తుంటే
నీడనిచ్చే అనురాగపు వృక్షం అందులో ఎదుగుతుందా...
యజ్ఞములో బలి పశువు సామాన్యుడవుతుంటే
అన్నపు పాత్రలో రుధిరపు ముద్దలు కనిపిస్తే
పుట్టుకకు అంటిన వర్ణము సమాధానం చెప్పలేక కుంగితే
మెడ దగ్గర చేరిన కత్తి భేతాళ ప్రశ్నలు వేస్తుంది...
ఎండమావుల ఆశల్లో నిరాశ రహదారిపై పాకితే
బాల సూర్యుడు నెత్తిన ఉదయిస్తూ ఉంటే
కిరణాల గొడుగు కింద కష్టాల బురద ఆరడం లేదు
రెండు కాళ్ళకు అంటిన దరిద్రం వేధిస్తూనే ఉంది...
జనారణ్యపు చీకటిలో కండ్లు నడుస్తూనే ఉన్నాయి
మూలుగుతున్న శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి
వెన్నెల రాత్రి సుఖాలు అడివి మాదిరి తయారయ్యే
అమావాస్య రోజు కన్నీళ్ల జపం మొదలయ్యే..
మూగవేదనలో తనువు గాయమై ఆలాపించే
కామాంధుని చెయ్యి ఇనుప చువ్వలా కాల్చే
ఆకలి కడుపు వేదనను కప్పిపుచ్చి నవ్వుతుంది
గిరాకీ కుదిరినా గుండె మంట దహించి వేస్తుంది..
కొప్పుల ప్రసాద్
98850 66235