Dec 25,2022 08:30

క్రిస్మస్‌ సందర్భంగా కేక్‌ కట్‌ చేసే ఆచారం మొదట్లో లేదు. ఇది 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. అంతకుముందు క్రిస్మస్‌ సందర్భంగా కేక్‌ కట్‌ చేయలేదు. అప్పట్టో రొట్టె, కూరగాయలను కలపడం ద్వారా ఒక వంటకం తయారుచేసేవారు. దీనిని ప్లం పుడ్డింగ్‌ విధానం అని పిలుస్తారు. 16వ శతాబ్దంలో పుడ్డింగ్‌కు బదులుగా గోధుమపిండిని ఉపయోగించారు. గుడ్డు, వెన్న జోడించారు. ఈ వంటకాన్ని ఓవెన్‌లో ఉంచి వండుతారు. క్రమంగా ఈ వంటకం కేక్‌ రూపాన్ని సంతరించుకుంది. క్రిస్మస్‌ సందర్భంగా కేక్‌ను నెల ముందుగానే తయారుచేయడం ప్రారంభిస్తారు. ఎందుకంటే క్రిస్మస్‌ సందర్భంగా కేకులకు అత్యధిక డిమాండ్‌ ఉంటుంది. వీటిలో ఫ్రూట్‌ కేక్‌కు అత్యధిక డిమాండ్‌ ఉంటుంది. ఈ కేక్‌లో డ్రై ఫ్రూట్స్‌ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. తర్వాతర్వాత కేక్‌తో పాటు, పలు రకాల స్వీట్స్‌ కూడా తయారుచేస్తున్నారు. వాటిల్లో కొన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

  • మావా కోకొనట్‌ రోల్‌
sweet


కావలసినవి: కోవా - కేజీ, పంచదార - 300గ్రా, కుంకుమపువ్వు - గ్రాము, కొబ్బరిపొడి - 100 గ్రాములు.
తయారీ: స్టవ్‌పై పాన్‌పెట్టి కోవా, పంచదార వేసి వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకూ ఉంచాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత స్టవ్‌పై నుంచి దింపి చల్లారబెట్టుకోవాలి. తర్వాత రెండు భాగాలుగా కట్‌ చేసుకోవాలి. ఒక భాగం తీసుకుని, కర్రతో చపాతీలా వెడల్పుగా చేసుకోవాలి. మరో భాగంలో కుంకుమపువ్వు కలిపి, చపాతీలా వెడల్పుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగంపై మరొక భాగం పెట్టి రోల్‌ చేయాలి. కొబ్బరిపొడి అద్ది, గుండ్రంగా చిన్న చిన్న భాగాలుగా కట్‌ చేసి, సర్వ్‌ చేసుకోవాలి.

 

  • ప్లమ్‌ కేక్‌
cake

కావాల్సినవి: వెన్న - కప్పు, చక్కెర - ఒకటిన్నర కప్పులు, గుడ్లు - 6, బాదం ముక్కలు - 125 గ్రాములు, వెనీలా ఎసెన్స్‌ - 2 టేబుల్‌ స్పూన్స్‌,
డ్రై ఫ్రూట్‌ మిక్స్‌ (ఎండుద్రాక్ష, క్యాండిడ్‌ పీల్‌, చెర్రీ) -2 1/2 స్పూన్స్‌, మైదా పిండి -2 కప్పులు,
తయారీ : ఇందుకోసం పండ్లు, బాదం ముక్కలని రెండు టేబుల్‌స్పూన్ల పిండితో మిక్స్‌ చేసి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెన్న, పంచదార, గుడ్లు, వెనీలాను బాగా కలపాలి. తర్వాత మైదాపిండిలో వేసి, ఆ తర్వాత ఫ్రూట్‌ మిక్సర్‌ను మిక్స్‌ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ టిన్‌లో వేసి, అరగంటపైనే ప్రీ హీట్‌ ఓవెన్‌లో బేక్‌ చేయాలి. అంతే ప్లమ్‌ కేక్‌ మీ కోసం సిద్ధం.

  • కాజూ బర్ఫీ
sweet

కావలసినవి: జీడిపప్పు - కప్పు, పంచదార - సగం కప్పు, నీళ్లు - ఐదు స్పూన్లు, నెయ్యి - స్పూను
తయారీ: ముందుగా మిక్సీలో జీడిపప్పు వేసి, మెత్తగా పొడిలా చేసుకోవాలి. పేస్టుగా కానీ జారుగా కానీ ఉండకుండా జాగ్రత్తపడాలి. ఓ మందపాటి కడాయిలో పంచదార, నీళ్లు వేసి వేడిచేయాలి. పంచదార కరగగానే జీడిపప్పు పొడి వేసి, కలుపుతూ ఉండాలి. చిక్కబడ్డాక నెయ్యి కూడా వేసి కలపాలి. మొత్తం కలిసిపోయి దగ్గరవుతుంది. నెయ్యి రాసిన ఓ ప్లేట్‌లో మిశ్రమాన్ని వెయ్యాలి. దాని మీద ఓ బటర్‌ పేపర్‌ పెట్టి పూరీలా వత్తాలి. కాస్త చల్లారిన తరవాత చాకుతో ముక్కలుగా కోస్తే బర్ఫీ రెడీ.

  • బీట్‌రూట్‌ కప్‌ కేక్‌
cake

కావలసినవి: బీట్‌రూట్‌ ముక్కలు - కప్పు, తాజా పెరుగు - అర కప్పు, మైదాపిండి - కప్పు, చక్కెర - అర కప్పు, వెనిలా ఎసెన్స్‌ - నాలుగు చుక్కలు, నూనె - అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - పావు టీస్పూన్‌, ఉప్పు - చిటికెడు.
తయారీ : మిక్సీజార్‌లో బీట్‌రూట్‌ ముక్కలు, పెరుగు వేసి, మెత్తగా గ్రైండ్‌ చెయ్యాలి. ఒక గిన్నెలో మైదా, చక్కెర, వెనిలా ఎసెన్స్‌, నూనె, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు, బీట్‌రూట్‌ మిశ్రమం వేసి బాగా కలపాలి. మొత్తం మిశ్రమాన్ని కేక్‌ కప్పుల్లో వేసి, ప్రీ హీట్‌ చేసిన ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్‌ చేయాలి. అంతే నోరూరించే బీట్‌రూట్‌ కప్‌ కేక్స్‌ సిద్ధం. ఇష్టపడేవాళ్లు పైన క్రీమ్‌ జత చేసుకోవచ్చు.