Oct 06,2023 16:42

తెలుగులో 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' చిత్రాలతో ప్రముఖ నటుడు సిద్దార్థ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్దార్థ్‌ తాజాగా 'చిన్నా' చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు ముందుకొచ్చారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్‌ 6వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందామా..?!

కథ
ఈశ్వర్‌ (సిద్ధార్థ్‌) మున్సిపాలిటీలో ఓ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. తన అన్నయ్య అకస్మాత్తుగా మరణించడంతో.. వదిన, అన్న కూతురు సుందరి అలియాస్‌ చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. తండ్రిలోటు తెలియకూడదని ఈశ్వర్‌ చిట్టిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. చిట్టీకి కూడా చిన్నాన్న అంటే ఎంతో ఇష్టం. చిట్టీ ప్రేమగా చిన్నానన్నని చిన్నా అని పిలుస్తుంది. మరోవైపు రోడ్డుపై చెత్త ఊడ్చే శక్తి (నిమిషా సజయన్‌), ఈశ్వర్‌లు ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో ఓ చిన్నారిని అత్యాచారం చేశాడని చిన్నాపై నింద పడుతుంది. దీనికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా లీక్‌ అవుతుంది. ఇక అదే సమయంలో చిట్టీ మాయమవుతుంది. అసలు చిట్టీని ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? టార్గెట్‌గా ఈశ్వర్‌పైనే అత్యాచార నేరారోపణలు ఎందుకు మోపారు? చివరికి చిట్టీ చిన్నాకి కనిపించిందా? ఆ వీడియోను ఎవరు లీక్‌ చేశారు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

chinna


విశ్లేషణ
ఈ చిత్రం తమిళంలో 'చిత్త'గా విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో 'చిన్నా'గా విడుదలైంది. చిన్నారులపై జరిగే లైంగిక దాడులకు సంబంధించిన కథాంశాన్నే డైరెక్టర్‌ ఎస్‌. యు. అరుణ్‌కుమార్‌ తెరకెక్కించారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్‌లో హీరో సిద్ధార్థ్‌ ఓ మధ్యతరగతి వ్యక్తిలా సాదాసీదాగానే తెరపై కనిపించారు. చిట్టీ.. చిన్నాల మధ్య ఉన్న అనుబంధాన్ని డైరెక్టర్‌ ఎంతో చక్కగా చూపించారు. మరోవైపు హీరోయిన్‌ శక్తి ఈశ్వర్‌ల ప్రేమ కూడా అంతే సహజంగా చూపించారు. చిట్టీ, శక్తిల ప్రేమతో సాఫీగా సాగిపోతున్న ఈశ్వర్‌ జీవితంలో అనుకోకుండా.. చిట్టీ స్నేహితురాలు మున్నీని చిన్నానే అత్యాచారం చేశాడని ఆరోపణలు, వాటికి ఆధారాలుగా వీడియోలు లీక్‌ అవవడం, అదే సమయంలో చిట్టీ కనిపించకుండా పోవడం సినిమాలో ట్విస్ట్‌. ఇక సెకండాఫ్‌లో చిట్టీని ఎవరు కిడ్నాప్‌ చేశారు? నిందితులను కనిపెట్టడంపైనే సాగుతుంది. నిందితుడిని వెతికే క్రమంలో ఓ పదకొండేళ్ల బాలిక శవాన్ని చూపించి.. చిట్టీ చనిపోయిందని పోలీసులు చెబుతారు. అయితే పోలీసుల చెప్పినదాన్ని చిన్నా నమ్మడు. తన చిట్టీ బతికే ఉంటుందని బలంగా నమ్ముతాడు. చివరి క్లైమాక్స్‌ ప్రేక్షకులు ఊహించిందే. ఈ చిత్రంలో దర్శకుడు చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను ఎంతో హృద్యంగా తెరపై చూపించారు. కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా.. దర్శకుడు మనసుకి హత్తుకునేలా చిత్రీకరించారు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాలో అన్యాయంగా నిందలు  మోసే వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి? ఆ బాలిక కుటుంబం ఎలాంటి నరకం అనుభవిస్తోందో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఓవరాల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల మదిని మెలిపెడుతుంది. ఇందులో సిద్ధార్థ్‌ నటన అద్భుతంగా ఉంది. హీరోయిన్‌ నిమిషా నటన హైలెట్‌. ఈ చిత్రంలోని మిగతా నటీటనులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

chinna 3