Oct 16,2022 21:40

న్యూఢిల్లీ : భారత్‌లో చైనా రాయబారిగా బ్యాధతలు నిర్వహిస్తున్న సన్‌ వీడాంగ్‌ ఇటీవల భూటన్‌లో మూడు రోజలు పాటు పర్యటించడం ప్రాధన్యతను సంతరించుకుంది. సన్‌ వీడాంగ్‌ తన పర్యటనలో భూటాన్‌ నాయకులతో సమావేశమయ్యారు. భూటాన్‌తో సంబంధాలకు చైనా ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, భూటాన్‌ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతోపాటు భూటాన్‌ ఎంచుకున్న అభివృద్ధి మార్గాన్ని గౌరవిస్తామని తెలిపారు. ఈ నెల 10 నంచి 13 వరకూ భూటాన్‌లో సన్‌ పర్యటన సాగింది. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యెల్‌ వాంగ్‌చుక్‌, ప్రధానమంత్రి లోటై త్సహెరింగ్‌, విదేశాంగ మంత్రి తండి డోర్జి, ఇతర నేతలతో సమావేశమయ్యారు. చైనా నాయకుల నుంచి భూటాన్‌ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. వన్‌ చైనా సూత్రానికి కట్టుబడి ఉన్నందుకు భూటాన్‌ను అభినందించారు. స్నేహపూర్వక ఇరుగుపొరుగు దేశాలుగా చైనా, భూటాన్‌ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయని, కొవిడ్‌-19 మహమ్మారి సవాళ్లను కలిసిఎదుర్కొన్నాయని సన్‌ పేర్కొన్నారు. ఇరు దేశాలు, ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం కలిగించేవిధంగా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతికి ప్రోత్సాహం ఇస్తామని, మార్పిడి, సహకారాలను విస్తరించడం, సరిహద్దు చర్చలను ముందుకు తీసుకెళ్లడంల్లో ఉమ్మడి ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని సన్‌ చెప్పారు. అలాగే, వన్‌ చైనా సూత్రానికి కట్టుబడి ఉన్నాయని, చైనాతో ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి, సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సన్‌కు భూటాన్‌ నాయకులు తెలిపారు.