Mar 12,2023 07:55

జియో పాలిటిక్స్‌లో చైనా పాత్ర పెరుగుతుండడం, ఆయిల్‌ రంగంలో అమెరికా ఆశలకు గండిపడడంతో పాటుగా ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గితే అమెరికా ఆయుధ వ్యాపారానికి కూడా ఆటంకం అవుతుంది. ముఖ్యంగా సౌదీ-ఇరాన్‌ ఒప్పందం కారణంగా సిరియా, లెబనాన్‌ సంక్షోభాలకు తెరపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి అనేక చిక్కుముడులు వున్నప్పటికీ తాజా పరిణామం కీలక అడుగులకు దారితీస్తుంది. అదే జరిగితే గల్ఫ్‌లో శాంతి ఏర్పడుతుంది. ఇజ్రాయిల్‌ దూకుడుకు ఇతర అరబ్‌ దేశాల మధ్య ఏర్పడే సఖ్యత సమాధానం అవుతుంది.

ప్రపంచ పరిణామాల్లో అమెరికా ఆధిపత్యానికి చెక్‌ పెట్టే పరిణామాలు జరుగుతున్నాయి. మధ్య ఆసియాలో రెండు శిబిరాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ ఒకే గూటికి చేరడం దానికి ఓ ఉదాహరణ. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన చర్చల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగింది. దౌత్య సంబంధాల పునరుద్ధరణ, ఇరు దేశాల్లోనూ రాయబార కేంద్రాలు ప్రారంభించడానికి ఇరువురూ అంగీకరించారు.
 

                                                                             దశాబ్దాల వైరం

ప్రపంచంలోనే ఆయిల్‌ ఉత్పత్తిలో సౌదీ అరేబియాది కీలక స్థానం. రెండవ ప్రపంచ యుద్ధం నాటి నుంచి అమెరికాతో సన్నిహితంగా ఉంటోంది. ఏడు దశాబ్దాలుగా అమెరికాకు ఆయిల్‌ అందిస్తోంది. అందుకు గాను అమెరికా నుంచి ఆయుధాలు అందుకుంటోంది. గల్ఫ్‌ దేశాల మధ్య అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. అమెరికా విరోధులందరితో కయ్యానికి దిగడం గానీ, అమెరికాకు వంత పాడడం గానీ చేస్తోంది.
ఆ క్రమంలోనే ఇరాక్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన సౌదీ అరేబియా 1980ల నుంచి ఇరాన్‌తో వైరం కొనసాగిస్తోంది. సిరియా, లెబనాన్‌ వంటి దేశాల్లో అమెరికా దురాక్రమణలకు అండగా నిలిచింది. ఆయా దేశాల్లో అమెరికా దళాలకు అవసరమైన అన్ని రకాల సహాయం సౌదీ నుంచి అందుతోంది. ఇరాన్‌ కూడా జోక్యం చేసుకోవడంతో సౌదీ, ఇరాన్‌ మద్దతుదారులు అక్కడ పోరు సాగిస్తున్నారు. అంతేగాకుండా ఇరాన్‌ నుంచి పలుమార్లు క్షిపణి దాడులు కూడా సౌదీ ఎదుర్కొంది. ఇరు దేశాల్లోనూ రాయబార కార్యాలయాలను ముట్టించే స్థితి వరకూ సాగింది. దాంతో 2016లో ఇరువురూ రాయబార కార్యాలయాలను మూసుకున్నారు. సంబంధాలు పూర్తిగా తెంచుకున్నారు.
 

                                                                              చైనా చొరవతో...

మధ్య ఆసియాలో పెత్తనం కోసం రెండు శిబిరాలుగా ఉన్న సౌదీ, ఇరాన్‌ మధ్య పెత్తనం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది అమెరికాకు అలుసుగా మారింది. ఇజ్రాయిల్‌ సహాయంతో ఇప్పటికే పాలస్తీనా మీద నిత్యం దాడులు సాగిస్తోంది. సిరియాను సైతం వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఇరాన్‌ మీద కూడా దాడులకు పూనుకుంది. అమెరికా చేతిలో పావుగా ఉన్న ఇజ్రాయిల్‌లో పూర్తి మితవాద నెతన్యాహూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులు ఇంటా, బయటా పెరిగాయి.
         అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆయిల్‌ ధరల విషయంలో సౌదీ అరేబియాకి అమెరికాతో వివాదం ఏర్పడింది. ఆయిల్‌ ధరలు పెరగకుండా అమెరికా అడ్డుకుంటోంది. దాన్ని సౌదీ నిరసిస్తోంది. ఈ పరిణామాలతో చైనా రంగంలో దిగింది. చైనాకి చాలాకాలంగా ఇరాన్‌ తో సన్నిహిత సంబంధాలున్నాయి. సౌదీతో ఇటీవల దౌత్యపరంగా దగ్గరయ్యింది. చైనా అధ్యక్షుడు సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ బృందం చైనా వెళ్లింది. ఆయిల్‌ ధరలపై ఆమెరికా పెత్తనంతో రగిలిపోతున్న సౌదీ అరేబియా నేరుగా చైనా, రష్యాలకు చేరువయ్యింది.
          ఇరాన్‌, సౌదీ అరేబియా మధ్య వివాదం ఉంటేనే అమెరికా ఆటలు సాగుతాయి. చమురు ఉత్పత్తిలో పెద్ద దేశాలను విభజించి పాలించేలా అమెరికా సాగుతోంది. చైనా మాత్రం దానికి భిన్నంగా సౌదీ, ఇరాన్‌ మధ్య స్నేహం చిగురించేందుకు చొరవ చూపింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య మార్చి 10న బీజింగ్‌లో జరిగిన ఒప్పందం గల్ఫ్‌ దేశాల మధ్య కొత్త సమీకరణాలకు తోడ్పడతాయి. అంతేగాకుండా ప్రపంచ రాజకీయాలను మరో దిశకు మళ్లిస్తాయి.
 

                                                                చమురుతో అమెరికాకి చెక్‌

ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యానికి చమురు అత్యంత కీలకం. తాజా పరిణామాలతో ఆయిల్‌ ఫీల్డ్‌లో ఆధిపత్యం కలిగిన రష్యా, ఇరాన్‌తో పాటుగా సౌదీ అరేబియా కూడా అమెరికాకి దూరంగా జరగడం గమనార్హం. చైనాలో ఒప్పందం చేసుకోవడానికి ముందురోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి రష్యా వెళ్లి అక్కడి ప్రభుత్వ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. దాంతో మూడు పెద్ద దేశాలు ఐక్యం అయితే ముడి చమురు వ్యవహారాల్లో అమెరికా ఆధిపత్యానికి చెక్‌ పడుతుంది.
          దశాబ్దాల పాటు చమురుబావులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రపంచ రాజకీయాలను శాసించిన అమెరికాకు ఇప్పుడు అక్కడే సవాళ్లు అనివార్యం అవుతాయి. లాటిన్‌ అమెరికా లోని వెనిజులా వంటి ఆయిల్‌ నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు ఇప్పటికే అమెరికాకి కొరుకుడు పడడం లేదు. ఇప్పుడు సౌదీతో ఇరాన్‌ చేతులు కలపడం వైట్‌ హౌస్‌కి మరింత కలవరపరిచే అంశం. బీజింగ్‌లో జరిగిన ఒప్పందంతో అవాక్కయిన అమెరికా వెంటనే స్పందించడానికి కూడా సిద్ధపడలేదంటే ఎంతటి షాక్‌ తిన్నదో అర్థం చేసుకోవచ్చు.
 

                                                             బీజింగ్‌ వైపు ప్రపంచం చూపు

ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని అత్యధిక దేశాలతో చైనా వ్యాపార సంబంధాలను దౌత్యబంధంగా మార్చుకుంది. మూడొంతుల దేశాల్లో చైనా కార్యకలాపాలకు అడ్డంకి లేకుండా సాగుతోంది. లాటిన్‌ అమెరికాలో సైతం బ్రెజిల్‌, అర్జెంటీనా సహా అన్ని దేశాలకు చైనా సన్నిహితంగా మారుతోంది. ఇప్పుడు గల్ఫ్‌లో కూడా చైనా ప్రభావం పెరగబోతోంది. రెండు కీలక శిబిరాలకు నాయకత్వం వహించే ఇరాన్‌, సౌదీలను ఒక్కటి చేయడంలో చైనా రాయబారం నెరపడంతో పెద్దన్న పాత్ర బీజింగ్‌ వైపు మళ్లుతుందా అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తోంది.
          అనేక దేశాల రాయబార వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, తన ప్రయోజనాకలు అనుగుణంగా మలచుకున్న అమెరికాకి భిన్నంగా, గల్ఫ్‌లో ఐక్యత పెంచి, ముస్లిం దేశాల మధ్య సానుకూలతను పాదుకోల్పడంలో చైనా వ్యవహరించిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా షియా, సున్నీ జాతులకు ప్రాతినిధ్యం వహించే దేశాలను సైతం సన్నిహితంగా మలచడంలో సక్సెస్‌ కావడం ద్వారా చైనా పట్టు పెరుగుతుందనడంలో సందేహం లేదు.
 

                                                             ఉద్రిక్తతలు తొలగితే అమెరికాకు దెబ్బే

జియో పాలిటిక్స్‌లో చైనా పాత్ర పెరుగుతుండడం, ఆయిల్‌ రంగంలో అమెరికా ఆశలకు గండిపడడంతో పాటుగా ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గితే అమెరికా ఆయుధ వ్యాపారానికి కూడా ఆటంకం అవుతుంది. ముఖ్యంగా సౌదీ-ఇరాన్‌ ఒప్పందం కారణంగా సిరియా, లెబనాన్‌ సంక్షోభాలకు తెరపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి అనేక చిక్కుముడులు వున్నప్పటికీ తాజా పరిణామం కీలక అడుగులకు దారితీస్తుంది. అదే జరిగితే గల్ఫ్‌లో శాంతి ఏర్పడుతుంది. ఇజ్రాయిల్‌ దూకుడుకు ఇతర అరబ్‌ దేశాల మధ్య ఏర్పడే సఖ్యత సమాధానం అవుతుంది.
         అదే సమయంలో సౌదీ నుంచి ఆయిల్‌ కొనుగోలు చేసే చైనా తన దేశం నుంచి వివిధ రకాల వస్తువులతో పాటుగా ఆయుధాలను కూడా ఎగుమతి చేయడం ఖాయం. ఇరాన్‌ నుంచి కూడా సౌదీ అరేబియా కి ఆయుధాల సరఫరా జరుగుతుంది. ముఖ్యంగా న్యూక్లియర్‌ విషయంలో ఇరాన్‌ ద్వారా సౌదీకి మేలు జరుగుతుందనే అంచనాలున్నాయి. అది అమెరికాకి అత్యంత పెద్ద సమస్య అవుతుంది. అన్ని వైపులా ఆధిపత్యానికి గండి కొడుతుంది. చివరకు తన దేశ ఆర్థిక రంగానికే ఛాలెంజ్‌ గా పరిణమిస్తుంది. దాంతో ఈ ఒప్పందాన్ని అమెరికా జీర్ణం చేసుకోలేని స్థితి ఏర్పడుతోంది. అందుకే ఎలాంటి ఎత్తులతో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే యత్నం చేస్తుంది, దానికోసం ఎంతకైనా తెగించే అమెరికన్‌ సామాజ్యవాద ధోరణి ఎలాంటి ఎత్తులు వేస్తుందన్నది చూడాలి.

అమన్‌