Apr 28,2023 07:42

        రష్యా సైనిక చర్యతో సంక్షోభం ప్రారంభమైన 427 రోజుల తరువాత తొలిసారిగా చైనా అధినేత సీ జిన్‌పింగ్‌ బుధవారం నాడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌ ద్వారా సంభాషించి సంక్షోభ పరిష్కారానికి చొరవ చూపటం హర్షణీయం. ఇది ముందుకు పోతే ఐరోపాకు తక్షణం, ప్రపంచమంతటికీ ఎంతో ఉపశమనం కలుగుతుంది. రాజకీయ పరిష్కారానికి వచ్చేందుకు ఇది పుతిన్‌-జెలెన్‌స్కీలకు ఒక మంచి అవకాశం. లోపల ఎవరి భయాలు, ఎవరి పట్టుదలలు వారికి ఉన్నప్పటికీ రెండు దేశాల తొలి స్పందన సానుకూలంగానే ఉంది. ఇరు పక్షాల మీద రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోంది, దీని అర్ధం వెంటనే ఏదో జరిగిపోతుందని కాదు. ''ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సృష్టించటంలో గానీ లేదా దానిలో ఒక పక్షంగా చైనా లేదు. ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యదేశం, ఒక బాధ్యత కలిగిన శక్తిగా ఊరికే చూస్తూ ఉండలేము, రాజుకున్న అగ్నికి ఆజ్యం పోయం, అన్నింటికీ మించి దీని వలన తమకు ఎలాంటి లబ్ధి కలగదని'' జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. తొలి నుంచీ చైనా తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. తెరవెనుక ఉంచి అసలు ఈ చిచ్చు రేపిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలను తోసిపుచ్చి రష్యా నుంచి చమురు, ఇతర వస్తువుల దిగుమతి, ఎగుమతులు వేరు. ఆ మాటకు వస్తే మన దేశం కూడా తటస్థంగా ఉండి అదే చేస్తున్నది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తందారీ తనం, కుట్రలను ఎదుర్కొనే క్రమంలో పరస్పరం సహకరించుకో వాలన్న చైనా-రష్యా బంధం పటిష్టం చేసుకోవాలని కూడా నిర్ణయించినప్పటికీ ఉక్రెయిన్‌ అంశంలో చైనా తటస్థంగానే ఉంది.
      భద్రతా మండలిలోని శాశ్వత దేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఈ సంక్షోభంలో ఉక్రెయిన్‌ కొమ్ముకాచి అన్ని రకాల సాయం అందిస్తూ ప్రపంచాన్ని మొత్తంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జెలెన్‌్‌స్కీ సేనలకు అస్త్ర శస్త్రాలను అందిస్తూ ఈ వివాదాన్ని మరింతగా పెంచి కొనసా గించేందుకు, తద్వారా తమ భౌగోళిక రాజకీయ లక్ష్యాలను సాధించుకొనేందుకు ఉక్రెయిన్‌ను బలి చేస్తూ పౌరులను నానా అగచాట్లకు గురిచేస్తున్నాయి. ఈ పూర్వ రంగంలో సీ జిన్‌పింగ్‌ చొరవ ఏ మేరకు ఫలిస్తుందన్నది ప్రశ్నార్ధకమే కావచ్చుగానీ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయరాదు. బీజింగ్‌లో రెండు సంవత్సరాలుగా లేని ఉక్రెయిన్‌ రాయబారిని ఫోన్‌ సంభాషణ జరిగిన వెంటనే జెలెన్‌స్కీ నియమించటం ఒక ముందడుగు, సానుకూల అంశం. జెలెన్‌స్కీతో సహా పశ్చిమ దేశాల నేతల మీద ఒత్తిడి పెంచుతుంది.
      చైనాను రెచ్చగొడుతూ, దాని మీద తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రచారదాడిలో భాగంగా రష్యాకు ఆయుధాలను అందించేందుకు పూనుకున్నట్లు కథనాలను వండివారుస్తున్న సంగతి తెలిసిందే. తామే తుమ్మి తామే తధాస్తు అనుకున్నట్లుగా వాటికి తెరదించేందుకు ఇప్పుడు సీ జిన్‌పింగ్‌ మాట్లాడినట్లు, నేరుగా ఆయుధాలు అందివ్వకపోవచ్చు అని శకుని పాచిక విసిరారు. అంటే వేరే దారిలో ఇవ్వనుందని చెప్పటమే. కొద్ది వారాల క్రితం మాస్కో పర్యటనలోనే తమ ప్రతిపాదనలను జెలెన్‌స్కీకి కూడా అందిస్తామని సీ జిన్‌పింగ్‌ ప్రకటించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియాల మధ్య చైనా కుదిర్చిన సయోధ్య నెల రోజుల్లోనే సానుకూలంగా ముందుకు పోవటం వంటి పరిణామాలను చూసిన తరువాత ప్రపంచంలో చైనా పలుకుబడి కంటే దాని మీద విశ్వసనీయత పెరిగిందని చెప్పవచ్చు. తమ భౌగోళిక సమగ్రత అంటే 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో సహా 1991 నాటి పరిస్థితి పునరుద్ధరణ జరగాలని ఉక్రెయిన్‌ చెబుతున్నది. సంక్షోభ ప్రారంభంలోనే రెండు దేశాల మధ్య శాంతి, సయోధ్య కుదిర్చేందుకు నాటోలో భాగమైన తుర్కియె ప్రయత్నించిన సంగతి, నాలుగు దఫాల చర్చల తరువాత నిలిచిన అంశం తెలిసిందే. ఆక్రమాన్ని ముందుకు పోకుండా చేసింది కూడా అదే నాటో దేశాలన్న సంగతీ ఎరిగిందే. తమ సార్వభౌమత్వాన్ని ఉక్రెయిన్‌ గుర్తించి, నాటోలో చేరకుండా ఉండేందుకు అంగీకరిస్తే, తమ భద్రతకు హామీ ఇస్తే మిగతా అంశాలపై చర్చలకు సిద్ధమే అని గతంలో పుతిన్‌ సర్కార్‌ ప్రకటించింది. ఉభయ పక్షాలు రాజకీయ ఒప్పందానికి అంగీకరిస్తే తక్షణం ఐరోపాలో శాంతి ఏర్పడుతుంది. పరాయి దేశాల్లో కాందిశీకులుగా, స్వదేశంలో నెలవులు తప్పిన మిలియన్ల మంది ఉక్రేనియన్ల ఇబ్బందులూ తొలుగుతాయి.
          రష్యా భద్రతకు హామీనిస్తూ దాని ముంగిటకు నాటోను విస్తరించకూడదని అమెరికా తలచుకొన్న మరుక్షణమే సంక్షోభానికి తెరపడుతుంది. కానీ దానికి ఏమాత్రం తావివ్వకుండా జెలెన్‌స్కీని తమ వ్యూహంలో ఒక బందీగా మార్చిన నాటో కూటమి పరిష్కారానికి దోహదం చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. రష్యా గనుక పోరు నిలిపివేస్తే వెంటనే యుద్ధం ముగుస్తుంది, కానీ ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌ పోరును ముగిస్తే ఆ దేశమే అంతం అవుతుందని అమెరికా భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ...చైనా శాంతి చొరవ మీద చేసిన వ్యాఖ్య ఉక్రెయిన్‌ను మరింత రెచ్చగొట్టటం, మరింత ఆజ్యం పోయటం గాక మరేమిటి ?
 

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌