బీజింగ్ : పిల్లలు స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడంపై కాలపరిమితిని విధించాలని, వారు చూసే అంశాలను ఎంపిక చేసి అందించాలని చైనా భావిస్తోంది. ఇందుకు గానూ ఫోన్లలో 'మైనర్ మోడ్' సెట్టింగ్‌ను పెట్టడానికి, అలాగే యాప్‌లతో సింక్ అయ్యేలా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ముసాయిదా మార్గదర్శకాలను ప్రచురించింది. మూడేళ్ళ లోపు చిన్నారులకు, మూడు నుండి 8ఏళ్ళలోపు వారికి, 8-12, 12-18, 16-18 ఏళ్ళ వయస్సుల వారీగా మార్గదర్శకాలను రూపొందించింది.
ఇదిలా వుండగా ఈ వార్త వెలువడిన వెంటనే డిజిటల్ కంపెనీల షేర్లు పడిపోయాయి. ప్రతి గ్రూపునకు వారి వయస్సుకు సముచితంగా లేని సమాచారాన్ని ఫోన్లలో నిషేధించాల్సి వుంటుంది. ఆత్మహత్యలు, అశ్లీలత, అస్తవ్యవ్థమైన ఆహారపు అలవాట్లు వంటి పలు అంశాలు ఈ నిషేధిత గ్రూపులో వుంటాయి. మూఢ నమ్మకాలను కూడా చేర్చే విషయాన్ని పరిశీ లించారు. అలాగే ఫోన్ల విని యోగంపై కాల పరిమితిని కూడా విధించారు. 8ఏళ్ళలోపు వారు కేవలం 40నిముషాలు మాత్రమే ఫోన్‌చూడాలి. 16-18 ఏళ్ళ వారు కేవలం రెండు గంటలు మాత్రమే ఆన్‌లైన్‌లో వుండాలి. అలాగే రాత్రి 10గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు స్టార్ట్ ఫోన్లలో సేవలు నిలిపివేయాలని భావిస్తున్నారు. అయితే ఫోన్ కాల్స్ వంటి నిర్దిష్ట సేవలు కొనసాగుతాయి. యువతలో ఇంటర్‌నెట్ పట్ల వ్యామోహాన్ని తగ్గించేందుకు గతంలో కొన్ని చర్యలు తీసుకున్నామని, అవి సానుకూల ప్రభావాన్ని చూపాయని సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. కాగా వీటిపై ప్రతిస్పందించేందుకు ప్రజలకు సెప్టెంబరు 2 వరకు గడువు ఇచ్చారు.