Nov 14,2022 11:23

పసితనంలో పిల్లలు పువ్వులంత సుకుమారంగా ఉంటారు. మనమూ వారిని అలానే చూడాలి. అలా పెంచితేనే ఆరోగ్యకరమైన వికాసం వారి సొంతమౌతుంది. ప్రతిదీ వారికి వింతగా కొత్తగానే ఉంటుంది. నెలల వయసునుంచే శబ్దాలను అనుకరించే ప్రయత్నం చేస్తారు. క్రమేపీ పెద్దవాళ్ళను అనుసరిస్తారు. వారి ఆచరణే పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే తల్లి దండ్రులే పిల్లలకు ప్రథమ గురువులు. దశాబ్ద కాలంగా సామాజికంగా వచ్చిన మార్పుల నేపథ్యం పిల్లలపైనా ప్రభావం తీవ్రంగానే ఉందని చెప్పవచ్చు. పిల్లలు ఆ కుటుంబానికే పరిమితం కాదు. సామాజిక సంపద. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే సమాజం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అందుకే పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి? కౌమార్యంలో వారిలో ఎలాంటి మార్పులు వస్తాయి? పెద్దలు వారితో ఎలా ప్రవర్తించాలి? ఫోను, ఇంటర్నెట్‌ ప్రభావాలు వారిపై ఎలా ఉంటాయి? సింగిల్‌ పేరెంట్స్‌, సింగిల్స్‌ చైల్డ్‌గా ఉన్నప్పుడు ఉండే పరిస్థితులు ఏమిటి? వీటన్నింటి గురించే ఈ ప్రత్యేక కథనం...

పిల్లల వికాస దశల్లో చూపించాల్సిన శ్రద్ధ వివిధ స్థాయిల్లో ఉంటుంది. మరీ పసితనంలో నిరంతర శ్రద్ధ అవసరమవుతుంది. వయసు పెరిగే కొద్దీ పిల్లలను ప్రత్యేకంగానే పెంచాలి. పిల్లలు కష్టపడిపోతారని, తాము లేనిదే ఏమీ చేయలేరని వారి హోం వర్క్‌ దగ్గరనుంచి..పిల్లలు స్వయంగా చేసుకోవాల్సిన పనులు కూడా తల్లిదండ్రులే చేసేస్తారు. అది ఎంతమాత్రమూ మంచిది కాదు. అన్నీ వారే చేస్తుంటే మరి పిల్లలకు ఆలోచించే అవకాశం ఎక్కడుంటుంది? ఆలోచన, ఆచరణ లేకపోతే సామాజిక మనుగడ కొరవడుతుంది.

  • మనకే ఓపిక, శ్రద్ధ ఉండాలి..
childreen

నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని, నేర్చుకోవాలనే ఉత్సుకతతో ఉంటారు పిల్లలు. ఈ విషయంలో మాత్రం వయసును బట్టి వారికి సులభంగా అర్థమయ్యేలా, గ్రహించేలా చెప్పే ఓపిక, శ్రద్ధ మనకు ఉండాలి. అది లెర్నింగ్‌ స్టేజ్‌ కాబట్టి ఉచ్ఛారణ, నడవడిక తొందరగా అలవడతాయి. స్కూల్లో చేరక ముందు, చేరిన తర్వాత వారితో మనం మసలే తీరులో మనం తప్పకుండా వివేకం చూపించి తీరాలి. అంటే స్కూలుకు పంపించే సమయంలో మనం కంగారుపడి, వారిని తొందరపెట్టడం చేయకూడదు. స్కూలు నుంచి వచ్చిన తరువాత ఆడుకుంటే టైం వేస్ట్‌ అనీ, హోం వర్క్‌ చేయమనీ ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడేం చేయాలో వారికి తెలియచెప్పాలి. వారి చదువు అప్పుడప్పుడే మొదలుపెట్టి ఉంటారు కాబట్టి, చదువు అంటే ఏవగింపు పుట్టే విధంగా చేయకూడదు. అదేే ప్రణాళికాబద్ధమైన సమయపాలన అలవాటు చేసే మంచి తరుణం. అది వారి భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుంది.
అంతేకాదు మన సంస్కృతిలో భాగంగా నేర్పించాల్సిన మంచి-చెడు, డిస్క్రిమినేషన్‌ల గురించి వారికి ఎలా తెలుస్తుందని అనుకోకుండా.. చిన్న చిన్న విషయాల ద్వారా తెలియజెప్పాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం ముఖ్యంగా గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ అంటే ఏంటో వారికి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. ఎలాగంటే వారి వయసుకి తగ్గ కథల ద్వారా, చిన్న చిన్న ఉదాహరణల ద్వారా వారు అర్థం చేసుకోగలిగే స్థాయిలోనే చెప్పాలి. సెకండరీ స్కూల్‌, హైస్కూల్‌కి వచ్చే సమయానికి రకరకాల యాక్టివిటీస్‌ పెరిగేలా చేయాలి. తోటి పిల్లలతో కలిసిమెలిసి ఆడుకునేలా, సందర్భోచితంగా వ్యవహరించేలా తల్లిదండ్రులే సునిశితంగా వారికి నేర్పాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరమైన పెరుగుదల ఉండాలి. అప్పుడే వారిలో సామాజిక వికాసం కలుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. వారి అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. మనం వారిని ఉక్కిరిబిక్కిరి చేయకుండా.. ఎవరితోనూ మాట్లాడనీయకుండా.. ఫోన్లో మాట్లాడినా, ఫ్రెండ్స్‌తో మాట్లాడినా, టైం వేస్టు చేస్తున్నావని విపరీతంగా విమర్శించకూడదు. ఇలా కఠినంగా ప్రవర్తించినట్లయితే వారి సామాజిక వికాసం, వ్యక్తిత్వ వికాసం మీద మనమే దెబ్బకొట్టినట్లవుతుంది.

  • వారి మనసుకు దగ్గరగా..

తల్లిదండ్రులు సహజంగా వారి వయసు దృక్పథంతో కాకుండా పిల్లలస్థాయికి వెళ్లి ఆలోచించగలగాలి. ఒక పిల్లవాడు ఏదైనా వస్తువు కింద విసిరేసినా, అబద్ధాలు చెప్పినా లేదా తల్లిదండ్రులకు తెలియకుండా ఏమైనా చేయాలని చూసినా వీటన్నింటికీ కారణాలు ఏమై ఉండి ఉండొచ్చు. వాడు ముందు తప్పు చేశాడని శిక్షించే ముందు, అసలు మనం పిల్లలకు సరైన శిక్షణ ఇస్తున్నామా? మనం స్నేహ పూర్వకంగా వారితో వ్యవహరిస్తున్నామా? పిల్లల మనసుకు దగ్గరగా వెళ్లి, వారి మనసులో ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నామా? ఇలా తల్లిదండ్రులు తమకి తాము ఆత్మావలోకనం చేసుకోవాలి.

  • టీచర్ల ప్రభావమే ఎక్కువ..
school

పిల్లలు ఒక్కోసారి తల్లిదండ్రుల్ని కూడా నమ్మనంతగా టీచర్లను నమ్ముతారు. ఉదాహరణకు పాప లేదా బాబుకు ఏదైనా విషయంలో ఇలా చేయాలి, అలా చేయాలి అని మనం చెప్పాం అనుకోండి.. లేదమ్మా మా టీచర్‌ అలానే చెప్పారు.. ఇదే కరెక్ట్‌ అంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు టీచర్లు అంటే చాలా విలువ ఉంటుంది. వారు ఇచ్చే విలువను టీచర్లు నిలుపుకోవాలి. అంటే పిల్లల ఆలోచనలకు దగ్గరగా వెళ్లి, పాఠాలు నేర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి పిల్లవాడి గురించి తల్లిదండ్రులకు తెలియని విషయాలు కూడా టీచర్లకు తెలుస్తాయి. ఎందుకంటే ఎక్కువ సమయం వారితో ఉంటారు గనుక, వారిని పరిశీలిస్తుంటారు కనుక. వారి మానసిక స్థాయిని ఎరిగి, వారికి అవసరమైన సహాయం చేయాల్సి ఉంటుంది. టీచర్ల రోల్‌ చాలా తక్కువ అనుకుంటారు కానీ, పిల్లలమీద వారి ప్రభావం చాలా ఉంటుంది. అందుకే ఉపాధ్యాయ వృత్తిని గౌరవనీయమైన వృత్తిగా అభివర్ణిస్తారు. ఎందుకంటే పిల్లల మానసిక వికాసానికి దోహదపడే వారిలో ముఖ్యపాత్ర టీచర్లదే కాబట్టి.

  • సింగిల్‌ చైల్డ్‌ సమస్య ఎలా పరిష్కరించాలి?
child


సింగిల్‌ చైల్డ్‌ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ లేదా ఒకరైనా పిల్లలమీద అతిగా శ్రద్ధ చూపిస్తారు. ఎందుకంటే ఓన్లీ చైల్డ్‌ కాబట్టి వాళ్లకి ఏమీ లోటు రాకూడదు.. మనకంటే బెటర్‌గా ఉండాలి అని. ఉన్నది ఒక్కడే కదా ఎవరికి పెడతాము అని అతిగా శ్రద్ధ చూపడం, గారాబం చూపడం వల్ల వారిని చెడగొట్టే పరిస్థితి ఉంటుంది. అతిగా శ్రద్ధ పెట్టి వారిని బూతద్దంలోంచి చూడటం, ప్రతి విషయం ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన చెందడం.. కాస్త తినకపోయినా.. టైంకి ఇంటికి రాకపోయినా విపరీతంగా ఆందోళన చెందడం, నా జీవితమంతా నువ్వే అన్నట్లుండడం వల్ల పిల్లలు ఒక్కోసారి ఉక్కిరి బిక్కిరి అవుతారు. అందుకే అలాంటి బౌండరీస్‌ను కొన్ని కొన్నిసార్లు దాటుతూ ఉంటారు. ఒక్కరే బిడ్డ వల్ల వాళ్లను బాగా చూసుకోగలిగినప్పటికీ.. అదే వారికి ఒక్కోసారి ఇబ్బందిగా తయారవుతుంది. ఇది పిల్లల సహజ వికాసానికి అడ్డంకి కాకుండా చూసుకోవాలి. ఇది తల్లిదండ్రుల వ్యవహారశైలిపైన ఆధారపడి ఉంటుంది. ఒక్కడే ఉన్నప్పుడు ఎన్ని అడ్వాంటేజస్‌ ఉంటాయో.. డిస్‌ అడ్వాంటేజస్‌ అంతే ఉంటాయి. తల్లిదండ్రులు చైతన్యవంతం అవ్వడంతోనే దీనికి పరిష్కారం లభిస్తుంది. అయితే సింగిల్‌ చైల్డ్‌ లోన్‌లీ ఫీల్‌ అవకుండా... సిబ్లింగ్స్‌ లేరని ఫీల్‌ అవకుండా.. గ్రాండ్‌ పేరెంట్స్‌తో ఉంచడం, ఎవరైతే వారి మనసుకు దగ్గరగా ఉంటారో వాళ్లకు దగ్గరగా, ఆత్మీయంగా మసలేట్టుగా చేయడంవల్ల వారిలో ఆ అభద్రతా భావాన్ని తొలగించొచ్చు.

  • సింగిల్‌ పేరెంట్‌..

ఇందులో వన్‌ ఆఫ్‌ది పేరెంట్‌ చనిపోవడం, విడాకులు తీసుకోవడం, లేదా ఇద్దరూ వేరువేరుగా ఉండటం.. అలాంటప్పుడు ఆ సింగిల్‌ పేరెంట్‌ తీవ్రమైన మనస్థాపానికి గురై ఉండి ఉండొచ్చు. వారిలోనే ఒక మానసిక డిస్టర్బెన్స్‌ ఉండొచ్చు. అలాంటి క్రమంలో అది తెలిసో.. తెలియకో.. పిల్లల మీద ప్రభావం చూపిస్తే, ఆ పిల్లల వికాసంలో తేడా రావచ్చు. కాబట్టి సింగిల్‌ పేరెంట్‌ ముందుగా వాళ్ల మనసును దృఢత్వం చేసుకోవాలి. ఇలా మాట్లాడటం వాళ్ల పట్ల అన్యాయంగా అనిపించవచ్చు. కానీ సింగిల్‌ పేరెంట్‌ అయినప్పుడు, తన బిడ్డను పెంచాల్సిన బాధ్యత తనదే అయినప్పుడు ముందు తన మనస్సు గట్టిపరుచుకోక తప్పదు. కారణం ఏదైనా కావచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటారో.. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు రోల్‌ మోడల్స్‌ అవుతారు.

  • మనమే అలవాటు చేసేది..
child

మనమే కదండీ ఇవన్నీ అలవాటు చేస్తున్నాం పిల్లలకు. ఎవరిది తప్పు, కళ్లు దెబ్బతింటారు వంటివి చెప్పాల్సిన అవసరం లేదు. 'ఫోన్‌కు ఎడిక్ట్‌ అవుతున్నారు పిల్లలు..ఏం చేయాలి?' అనే దాని మూలానికి పరిష్కారం అవసరం ఇప్పుడు.
పిల్లలకు సులభంగా తిండి పెట్టాలంటే, పనులకు అడ్డం రాకుండా ఉండాలంటే పసితనం నుండే ఫోన్స్‌లో, టీవీల్లో.. కార్టూన్స్‌, మరేదైనా చూపిస్తూ పెట్టడం ఒక అలవాటు అయిపోయిందివాళ. మరి అవి చూస్తున్నప్పుడు రంగు రంగు బొమ్మలు, అవి తొందర తొందరగా కదలటం, తనకు మాత్రమే స్వంతమైన ప్రపంచంగా ఉండటం.. ఆ వయసులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కదా మరి! నిజంగా కంటికి కనిపించేది వేరు, ఇలా చూసేది వేరుగా ఉంటుంది. ఈ రంగుల ప్రపంచం వారిని త్వరగా ఆకట్టుకుంటుంది. వాటితోపాటే వారూ కదిలే ప్రయత్నం చేస్తారు. వారి వేగంచూసి మనం అమితానందపడిపోతాం. ఆడుకునే వయసు నుండీ డస్ట్‌లోకి వెళతారని, వేరే పిల్లలతో ఆడి చెడిపోతారని, క్రమశిక్షణ అనీ రకరకాల కారణాలతో వారిని మనమే వీటికి అలవాటు చేస్తున్నాం. మళ్ళీ మనమే వారిని నిందిస్తున్నాం. ఎడిక్ట్‌ అయిన కొంతమంది పిల్లల మానసిక పరిస్థితి దయనీయంగా మారుతుంది. వారి భవిష్యజీవనంలో.. సామాజిక వికాసం.. శారీరక వికాసం.. మానసిక వికాసం.. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే శక్తి.. ప్రపంచ జ్ఞానం.. ఇవన్నీ కోల్పోతారని గ్రహించలేకపోతున్నాం. అందుకని ఈ విషయంలో మార్పు వారిలో కాదు, మనలోనే రావాలి.

  • మరేం చేయాలి..
child

బాల్యం నుండీ పెద్దవాళ్ళతో కలసి ఆరోగ్యకరమైన ప్రోగ్రామ్స్‌ చూడటం, కలసి ఆనందించడం అలవాటు చేయగలగాలి. అలాగే ఖాళీ సమయాల్లో గేమ్స్‌, మ్యూజిక్‌, డాన్సు, డ్రాయింగ్‌లాంటి యాక్టివిటీస్‌ను నేర్పించటం ద్వారా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించవచ్చు. సమాజంలో అనేక రకాల మనస్తత్వాలను వారు చూడాలి. అనేక పరిస్థితులను ఎదుర్కోవాలి. వాటన్నింటినీ సమన్వయం చేసుకునేలా వారిని నడిపించాలి. ఎవరైతే బాల్యంలో వికాసవంతమైన జీవితాన్ని గడుపుతారో వారే నిజమైన పౌరులౌతారు.

  • నిఘా కాదు.. పర్యవేక్షణ అవసరం..
chid

ఇకపోతే కౌమార్యంలో ఉన్నప్పుడు నా కనుసన్నల్లోనే ఉండాలనిగానీ, ప్రతి విషయం మీదా నిఘా ఉంచడంగానీ చేయకూడదు. వారిని ఇబ్బంది పెట్టని పర్యవేక్షణ మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు పర్యవేక్షణ బదులు నిఘా పెడతారో వాళ్ళకి పిల్లలు దూరం కావడం మొదలు పెడతారు. ఎందుకంటే.. ఆ వయసే అలాంటిది.. కౌమార్య దశనే ఐడెంటిటీ క్రైసిస్‌ అంటాం. ఈ పరిస్థితిని ఎదుర్కొనే దిశగా తమ ఉనికిని ఏర్పరుచుకునే ప్రయత్నంలో పిల్లలు ఒక్కొక్కసారి రెబలియస్‌గా తయారయ్యే అవకాశం ఉంది. వీరిలో ఎదురు తిరిగే ధోరణి పెరుగుతుంది. అలాంటప్పుడు వాళ్లతో పోట్లాటలు, తగాదాలు పెట్టుకుని వారిని విమర్శించడం సరికాదు. దీనివల్ల వాళ్లలో ప్రతికూల ఆలోచనలు రూపొంది, ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే 16 ఏళ్లు వచ్చేసరికి వారితో స్నేహితుల్లా మెలగాలని చెబుతాం. కౌమార్యం మొదలైనప్పటి నుంచి పిల్లల మనసులకు దగ్గరగా మసలుకోవాలి. వారి మనసులో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భార్య, భర్త ఇద్దరూ పిల్లల్లో జెండర్‌ డిస్క్రిమినేషన్‌ చూపించకూడదు. కాకపోతే ఆడపిల్లలకు, మగపిల్లలకు కొన్ని అంతర్గత విషయాలు వేరుగా ఉన్నప్పటికీ, వాళ్లు సంకోచం చెందే విధంగా కాకుండా అర్థమయ్యే రీతిలో ఎడ్యుకేట్‌ చేయాలి. ఇలాంటి డిస్కషన్‌ స్నేహపూర్వకంగా, శ్రద్ధగా ఉండాలి. వాళ్లు ఏవైనా సందేహాలు వస్తే నిస్సంకోచంగా తల్లిదండ్రులను అడగగలిగే వాతావరణం కల్పించాలి. 15 ఏళ్ల పిల్లల్ని కూడా పసిపిల్లల్లా చూస్తూ ఉంటే.. ఆ పిల్లలకు మానసిక వికాసం కంటే, లేనిపోని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఎలా అంటే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ దెబ్బతింటుంది. తన మీద తనకు అపనమ్మకం, అభద్రతా భావం పెరిగిపోతుంది. నేనేమీ చేయలేను అనే ధోరణితో.. ఎవరో ఏదో చేసిపెట్టాలనే భావనకు వస్తారు. అందుకే వయసుకి తగ్గట్టుగా వారిలో స్వతంత్రతని, స్వేచ్ఛని మనం ఎదగనివ్వాలి. ఆ ఎదుగుదలకు, వికాసానికి తల్లిదండ్రులు, కుటుంబం దోహదం చేయాలి.

padamja

 

 

 

 

 

 

డాక్టర్‌ జి. పద్మజ
సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సైకాలజీ హెడ్‌,
యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.