Jun 16,2023 06:56

          భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడవలసిన బాలబాలికలు బడిలో చదువుకు నోచుకోకపోవడం బాధాకరం. దేశంలో ప్రాథమిక స్థాయిలో రెండు శాతం, పదవ తరగతి స్థాయిలో 13 శాతం మంది పిల్లలు డ్రాపవుట్స్‌గా ఉన్నారని సాక్షాత్తూ కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. దేశంలో ప్రాథమిక స్థాయిలో బడికి పోని పిల్లలు 9.3 లక్షల మంది కాగా అందులో కేవలం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే 3.96 లక్షల మంది ఉండడం గమనార్హం. అసలు బడికే పోనివారు లేదా బడికి వెళ్లి మధ్యలో మానేసినవారు (డ్రాపవుట్స్‌) 2021-22 గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌, కర్ణాటక వంటివి ముందు పీఠిన ఉన్నాయి. వీటిలో బీహార్‌ మినహా మిగిలినవన్నీ ఆ కాలంలో బిజెపి ఏలుబడిలో ఉన్నవే. అందులోనూ అభివృద్ధిలో శరవేగంగా ముందుకు పోతున్నదని ఊదరగొట్టిన గుజరాత్‌ ఉండడం కమలనాథుల మోసకారితనానికి, ప్రచారార్భాటానికి నిలువెత్తు నిదర్శనం. ఏది ఏమైనా పిల్లలు బడి బయట ఉండకుండా విద్యాబుద్ధులు నేర్చుకునేట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలి. భారత రాజ్యాంగం, విద్యాహక్కు చట్టం పేర్కొన్న స్ఫూర్తిని అమలు చేయాలి.
          సెకండరీ స్థాయిలో బడి మానేస్తున్న పిల్లల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. దేశంలోని స్కూలు డ్రాపవుట్స్‌లో 85 శాతం మంది కేవలం 11 రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. 2021-22లో జాతీయ సగటు 12.6% ఉండగా బీహార్‌ (20.4%), పంజాబ్‌ (21.7%), గుజరాత్‌ (20.3%), అసోం (17.8%), మేఘాలయ (17.2%), ఆంధ్రప్రదేశ్‌ (16.7%), కర్ణాటక (14.6%), తెలంగాణ (13.7%), రాష్ట్రాలు దానిని దాటేశాయి. సమగ్ర శిక్షా కార్యక్రమంపై చర్చించేందుకు కేంద్ర విద్యా శాఖ అందజేసిన వివరాలివి. వీటి ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలలో వార్షిక సగటు డ్రాపవుట్‌ రేటు చాలా అధికంగా ఉండగా రాజస్థాన్‌లో ఈ రేటు నిలకడగా తగ్గుతూ వస్తోంది. అయితే సెకండరీ స్థాయిలో ఎస్టీలు, ముస్లింలలో మాత్రం ఈ రేటు చాలా ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలవారీగా, ఆయా వెనుకబడిన ప్రాంతాలు మరియు సామాజిక తరగతులవారీగానూ విశ్లేషించారు. మొత్తంగా చూస్తే దళిత, గిరిజన, ఒబిసి, మైనార్టీల్లో డ్రాపవుట్స్‌ అధికంగా ఉన్నాయి. అంటే ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం విద్యావిషయకంగానూ కుంగదీస్తోంది. ఇదో విష వలయం.
         బాలికా విద్య గురించి ఆలోచిస్తేనే కడుపు తరుక్కుపోతుంది. దేశంలోని ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరు నెలసరి (పీరియడ్స్‌)కి సంబంధించిన పరిజ్ఞానం సరిగా లేక, శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో లేనందున చదువు మానుకుంటున్నారని ఒక అధ్యయనం ఇటీవల పేర్కొంది. గర్భస్త శిశువుగా ఉన్ననాటి నుండి వివక్షకు గురవుతున్న మహిళా లోకానికి చదువు విషయంలో పీరియడ్స్‌ సమస్య మరో కంటకం అయ్యింది. బడిలో చదువుకున్నపుడు కొందరు కీచక టీచర్లు లేదా బంధువులనే రాబందుల బారినుండి బయటపడి ఉన్నత చదువులకు వెళ్లాక ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌ వంటి వేధింపులు వారిని వెంటాడుతున్నాయి. 1951 జనాభా లెక్కల ప్రకారం కేవలం 8.86 శాతంగా ఉన్న మహిళా సాక్షరత 2011 నాటికి 65.46 శాతానికి పెరగడం మంచి విషయమే కాని పెరుగుదల ఇంకా చాలా తక్కువే! గ్రామీణ మహిళల అక్షరాస్యత కేరళలో 94 శాతం కాగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కనీసం 50 శాతం కూడా లేకపోవడం సిగ్గుచేటు.
            పిల్లలను పనికి పంపితే తప్ప కుటుంబం గడవని స్థితిలో కోట్లాదిమంది బాల కార్మికులుగా బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటర్‌ పరిధిలోనే ఉండాలని విద్యాహక్కు చట్టం పేర్కొన్నా గిరిజన, మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి లేదు. అలా ఉన్నవాటిని కూడా పాఠశాలల విలీనం పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిల్లలకు దూరం చేయడం దారుణం. ప్రజల ఆర్థిక సామాజిక కారణాలతోపాటు పాలకులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించనందునే చదువుకోవాల్సిన పిల్లలు బడి బయట ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి మారాలి.