Nov 19,2022 07:16

దేశానికైనా బాలలే తరగని సంపద. అందుకే వారి రక్షణ, సంరక్షణ ఆయా ప్రభుత్వాల బాధ్యత, కర్తవ్యం కూడా. వారు బాల్యం నుంచే సంపూర్ణంగా ఎదగాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలి. ఆ విధంగా ఉండేలా మన రాజ్యాంగంలో అనేక చట్టాలు రూపొందించారు. హక్కులు పెద్దవారికే కాదు. బాలలకు కూడా వర్తిస్తాయి. బాలల సంపూర్ణ వికాసానికి, అభివృద్ధికి అండగా నిలబడతామని, బాలల హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడతామని 'అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక' (యుఎన్‌సిఆర్‌సి) పేర్కొంది. దీని ప్రకారం గర్భస్థ శిశువు నుంచి 18 ఏళ్ల లోపు వారందరూ బాలలే అని తీర్మానించింది. ఆ విధంగా 1959లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కులను ప్రకటించింది. 1989 నవంబరు 20న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 'బాలల హక్కుల ఒడంబడిక'పై అప్పట్లో 180 దేశాలు సంతకం చేశాయి. నవంబరు 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవా'న్ని నిర్వహిస్తారు. ఆ విధంగా యుఎన్‌సిఆర్‌సి కి నేటితో 33 ఏళ్ళు నిండాయి. ప్రపంచ బాలల జీవితాలను మార్చడానికి, వారి అభ్యున్నతికి ఇన్నేళ్ళలో 'యుఎన్‌సిఆర్‌సి' చేసిన కృషి మరువలేనిది. అన్ని దేశాల ఆమోదం పొందిన ఏకైక తీర్మానం 'యుఎన్‌సిఆర్‌సి' అని చెప్పవచ్చు.
          బాలల హక్కులను నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. అవి...జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చేందే హక్కు, భాగస్వామ్యపు హక్కు. అయితే ఈ 33 ఏళ్ళలో అవగాహన, ప్రచార లోపం వల్ల పలు చోట్ల నేటికీ బాలల హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 33 ఏళ్ళ ఒడంబడికను సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఒడంబడికలో పేర్కొన్న అంశాల్లో ఇప్పటి వరకు మార్పేమీ లేదు. అలాగే ఫలాన తేదీ లోగా ఒడంబడిక అంశాలను అమలు చేయాలని నిబంధన కూడా లేదు. ఇది నిరంతర ప్రక్రియగా పేర్కొనాలి. కాని 33 ఏళ్ళ తరువాత ప్రపంచ బాలల స్థితిగతులలో, వారి ఆలోచనల్లో అనేక కొత్త మార్పులు, కొత్త సమస్యలు వచ్చి చేరాయి. వాతావరణంలో మార్పులు, పరిసరాలలో మార్పులు, వలసలు, సంఘర్షణలు, నిరాదరణ- అన్యాయాలు, కుటుంబ కలహాలు, పేద-గొప్ప తారతమ్యాలు, సోషల్‌ మీడియా ప్రభావం వంటి అనేక సమస్యలతో ప్రపంచ బాలలు సతమతమవుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కొనడంలోను, పరిష్కారం పొందడంలోను సరైన మార్గదర్శనం అవసరం. కొత్త కొత్త సమస్యలతో బాలల హక్కులకు విఘాతం ఏర్పడుతున్నది. హక్కుల పరిరక్షణకు కొత్త మార్గాలను అన్వేషించాలి. ఉపశమనం పొందే విధంగా ప్రభుత్వంతో పాటు సమాజం బాధ్యత వహించాలి. స్నేహపూర్వక సమాజంలో మాత్రమే ఇది సాధ్యం. జాతి, జాతీయత, వర్ణ, మత, భాష, స్త్రీ, పురుష, సాంస్కృతిక భేదం లేకుండా ప్రపంచ చిన్నారులందరికి ఈ హక్కులు చెందాలన్నది బాలల హక్కుల అంతర్జాతీయ మహాసభ ఉద్దేశం. 'నేటి బాలలే నేటి పౌరులు' కాబట్టి ఆ దిశగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- నరవ ప్రకాశరావు,
బాలల హక్కుల కార్యకర్త,
సెల్‌: 9032477463