
బాల్యమంటే ఒక నవ్వుల దొంతర. ఆటపాటల పరంపర. ఆడినా, పాడినా, నడిచినా, పరుగెత్తినా ప్రవహించే ఓ తుళ్లింతల వరద. ఆశల మిలమిలలూ, జిజ్ఞాసల తళతళలూ మేళవించిన ఒక ఉత్సాహపు జాతర. మరి అందరి బాల్యం అలాగే ఉందా? .. లేదు. ఇప్పటికీ- చాలా కుటుంబాల్లో సహజమైన బాల్యాన్ని, ఆ బాల్యపు వికాస క్రమాన్నీ బతుకు తెరువే ఓ బండ బరువై .. నిర్దాక్షిణ్యంగా బందీ చేస్తోంది. వికసించి ప్రకాశించాల్సిన బాల్యాన్ని బలవంతంగా బండబారుస్తోంది. బడికి వెళ్లాల్సిన బాలలు కష్టతరమైన పనుల్లో కునారిల్లడం సమాజాభివృద్ధికి ఆటంకం. అసమానతలు పెచ్చు పెరిగే అన్యాయపు కాలానికి అది ప్రోద్బల కారకం. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల మందైతే .. అందులోని ప్రతి ముగ్గురిలో ఒకరు మనదేశంలోనే ఉన్నారు. కుటుంబాలతో కలిసి లేదా విడిగా వారు కష్టతరమైన పనుల్లో నిమగమై ఉన్నారు. 'పిల్లలు పుట్టడమే పని కోసం ..' అన్న మధ్యయుగాల నాటి బతుకు తెరువు వ్యాపకం వారిని నేటికీ వెన్నాడుతోంది. ఆధునిక కాలానికి ఇది తీవ్రమైన తలవొంపు. సమాజం మొత్తం పూనుకొని దీనిని సరిచేయాలి. ఈ బాల కార్మికుల గురించే ఈ ప్రత్యేక కథనం..

చిత్తశుద్ధి కరువు
ఒక నిర్దేశిత లక్ష్యం చేరటానికి ప్రణాళికలు, చట్టాలు, యంత్రాంగాలూ చాలా అవసరం. అయితే, వీటన్నింటికీ మించి చిత్తశుద్ధీ, కచ్చితమైన కార్యాచరణా మరింత అవసరం. మన పాలకుల దగ్గర అదే తీవ్రంగా లోపిస్తోంది. ఆ కారణం చేతనే పథకాలూ, చట్టాలూ కాగితాల్లో ఉన్నా- బాల కార్మికవ్యవస్థ యథాతథంగా కొనసాగుతోంది. పైగా కొన్ని కారణాల వల్ల చదువు మానేస్తున్న బాలల సంఖ్య పెరుగుతోంది కూడా! మన ప్రభుత్వాలు చాలా లక్ష్యాలను ప్రచారార్బాట ప్రహసనాలే. లక్ష్యాన్ని కేవలం ఒకటీ రెండుసార్లు ప్రదర్శిస్తే, గట్టిగా నినదిస్తే సమస్యలు పరిష్కారమైపోవు! నిరంతర కార్యాచరణ ఉండాలి. నిర్విరామ కృషి ఉండాలి. బాల కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా పరిశ్రమల మీద ఒక్కోసారి దాడులు జరుగుతాయి. పిల్లలు చదువుకోవాలనే ప్రసంగాలతో సభలూ, సమావేశాలూ ముగుస్తాయి. కానీ, ఆ పిల్లలు చదువుకునేది ఎలా? వారి 'పని'కి కారణమైన ఆర్థిక పరిస్థితిలో మార్పు ఎలా? వీటికి సంబంధించిన పరిశీలనా, పర్యవేక్షణా ఇక్కడ కీలక పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం ఆ పని చేస్తుందా? చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. చేయకుంటే లక్ష్యం ప్రసంగాలకే పరిమితమవుతుంది. అనేకమంది విద్యావేత్తలు, సామాజిక వేత్తలు ఇచ్చిన నివేదికల సారాంశం ఇదే! బాలల స్థితిగతులు ఏ దేశంలో ఎలా ఉన్నాయో ఐక్యరాజ్య సమితికి ఓ విభాగంగా ఉన్న యునిసెఫ్ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి సర్వే నిర్వహిస్తోంది. బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు ఆ సంస్థ కొన్ని మార్గనిర్దేశాలను నిర్ణయించి, పర్యవేక్షిస్తోంది. ఆ సంస్థ గణాంకాల ప్రకారం.. గత ఇరవై ఏళ్లలో తొలిసారిగా బాల కార్మికవ్యవస్థ నిర్మూలన లక్ష్యానికి 2020లో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటిదాకా తగ్గుతూ వస్తున్న బాల కార్మికుల సంఖ్య- 2020లో తగ్గకపోగా.. 90 లక్షలు పెరిగింది. దీనికి కారణం కోవిడ్ 19 సృష్టించిన ఉత్పాతంగా యునిసెఫ్ పేర్కొంది. నిజానికి అదొక్కటే కారణం కాదు; ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభమూ అనేక కుటుంబాల ఆర్థిక స్థితిని దెబ్బతీసింది. ఈ రెండింటి కారణంగా 'ఒక నిరంతర కృషికి' ఆటంకం ఏర్పడింది. ఎన్నో కుటుంబాలు ఆదాయాలను కోల్పోయాయి. కుటుంబంలో ఒకరిద్దరికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం మూసుకుపోయి.. ఎక్కువమంది తక్కువ ఆదాయం పొందే ఉపాధి వైపు మళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ పరిస్థితి పిల్లలను చదువు బాట నుంచి పనిపాటుల వైపు మళ్లించింది. ఈ పరిణామాలను ప్రభుత్వాలు గుర్తించి, తగు చర్యలు చేపట్టకుంటే- 2022 చివరి నాటికి అదనంగా మరో కోటిమంది బాల కార్మికులు తయారవుతారని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బాల కార్మికులు అంటే ఎవరు ?
పిల్లలు పనిచేయటం తప్పా? అంటే కాదు అంటోంది యునిసెఫ్. పిల్లల ఎదుగుదలలో, వికాస క్రమంలో పనిచేయడమూ ఒక మెట్టు. వయసు, అవగాహనను బట్టి అమ్మానాన్నల రోజువారీ పనుల్లో పిల్లలు సహకరించవచ్చు. జీవన, వృత్తి నైపుణ్యాలను అలవర్చుకోవొచ్చు. 14 - 17 ఏళ్ల పిల్లలైతే తమ పాకెట్ మనీ కోసం పనిచేయొచ్చు. అయితే, అది 4.30 గంటల సమయాన్ని మించకూడదు. కానీ, ఇదంతా పాఠశాల విద్యను వదిలేసి కాదు. బడి వయసు పిల్లలు కచ్చితంగా బడిలోనే ఉండాలి. కేవలం బతకటం కోసం పనుల్లో నిమగం కాకూడదు. పిల్లల చేత బలవంతంగా పనిచేయించకూడదు. మానసికంగా, శారీరకంగా, నైతికంగా పిల్లలను ఇబ్బందులకు గురి చేసే పనుల్లో పెడితే- అది నేరమవుతుంది. ప్రమాదకర పరిశ్రమల్లో, శరీర కష్టం ఎక్కువగా ఉండే చోట పిల్లల చేత పనిచేయించకూడదు. ఇలాంటి వాటిని నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి చట్టాలెన్నో ఉన్నాయి. 5 - 14 ఏళ్ల బాలలకు మన దేశంలో నిర్బంధ ఉచిత విద్య అమల్లో ఉంది. మరి ఇవన్నీ ఉన్నా బాల కార్మికవ్యవస్థ ఎందుకు కొనసాగుతోంది? బడి బయట పిల్లలు ఎందుకు ఉంటున్నారు ?

పాలకుల విధానాలే కారకం..
తొంభైయ్యో దశకంలో ఉధృతంగా సాగిన అక్షరాస్యత ఉద్యమం ఊరూరా చదువు ప్రాధాన్యాన్ని, అవసరాన్నీ గుర్తించటంలో కీలకమైన పాత్ర పోషించింది. ఎన్నో కుటుంబాల్లో వారి పిల్లలు తొలిసారి పాఠశాల గడప తొక్కిన సంఘటనలు నమోదయ్యాయి. చదువు కొనసాగించిన పిల్లలు వాటి ఫలితాలనూ అందుకుంటున్నారు. కళ్ల ముందు చదువు సాధించిన ప్రగతి కనపడుతున్నప్పుడు- ప్రతి అమ్మానాన్నా తమ పిల్లలను బడికి పంపటానికే ప్రాధాన్యం ఇస్తారు. చాలా గ్రామాల్లో ఆ పరిస్థితినీ మనం చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్నం పథకం ఎందరో పేద పిల్లలు బడికి రావటానికి ఆసరానిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో గొప్ప విజయాలను నమోదు చేస్తున్నాయి. ప్రభుత్వం ఆసరా, అవకాశం కల్పిస్తే పిల్లలు బడికి వస్తారని చెప్పటానికి ఇవన్నీ ఉదాహరణలు.
కానీ, అదే సమయంలో విద్య కార్పొరేటీకరణ చదువు 'కొనటాన్ని' చాలా వ్యయంతో కూడిన పనిగా మార్చేసింది. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ పర్యవసానం చాలా కుటుంబాల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. కోవిడ్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా 46.3 కోట్ల మంది పిల్లలకు ఆన్‌లైన్ విద్య అందకుండా పోయింది. 'నేర్చుకోవటం' అనే ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మన రాష్ట్రంలోని పదో తరగతి ఫలితాల్లోనూ ఇది ప్రతిఫలించింది. 20 ఏళ్ల తరువాత మన ఉత్తీర్ణతాశాతం తగ్గింది. పరీక్షల నిర్వహణలో, పరీక్షాపత్రం తీరులో వచ్చిన మార్పులు దీనికి కారణమనే వాదన ఉన్నప్పటికీ- కోవిడ్ వల్ల కలిగిన అంతరాయాన్ని ఏమాత్రం విస్మరించలేం. పరీక్షల్లో ఫెయిలైతే- సంభవించే పరిణామాలు పేద కుటుంబాలపైనా, ఆడపిల్లల పైనా ఎక్కువగా ఉంటాయి. చదువుకు స్వస్తి చెప్పే సందర్భంగా దానిని పెద్దలు భావిస్తారు. మగపిల్లలను పనుల్లోకి మరల్చటానికి, ఆడపిల్లలకు పెళ్లి కుదర్చటానికి దానిని అవకాశంగా తీసుకుంటారు. ఇలాంటి కారణాలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాల కార్మికవ్యవస్థ పెరగటానికి దోహదపడుతున్నాయి. నూతన విద్యావిధానంలో పాఠశాలల విలీనం, భాషా విధానం, రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం వంటివీ రానున్న కాలంలో బాలలు మధ్యలో బడి మానేయటానికి కారణమవుతాయని విద్యారంగ పరిశీలకుల అభిప్రాయం.

20 కోట్ల మంది బాల కార్మికులు
ప్రపంచ వ్యాప్తంగా నేడు 20 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారన్నది ఒక లెక్క. యునిసెఫ్ గణాంకాల ప్రకారం.. ఇరవై ఏళ్లుగా వివిధ దేశాలు చేపడుతున్న ప్రణాళికలు, సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా బాల కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2000లో ప్రపంచంలో 24.55 కోట్ల మంది బాల కార్మికులు ఉంటే- 2004 నాటికి ఆ సంఖ్య 22.23 కోట్లకు తగ్గింది. 2008 నాటికి 21.52 కోట్లకు, 2012 నాటికి 16.80 కోట్లకు, 2016 నాటికి 15.16 కోట్లకు తగ్గుతూ వచ్చింది. ఇదే క్రమం కొనసాగితే- 2020 నాటికి 14 కోట్లకు ఈ సంఖ్య తగ్గాలి. కానీ, అలా తగ్గకపోగా - 16 కోట్లకు పెరిగింది. 2022 చివరి నాటికి ఇంకో కోటి మంది బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని యునిసెఫ్ అంచనా. నిజానికి వాస్తవిక సంఖ్యలు అన్ని సందర్భాల్లోనూ ఇంతకు రెట్టింపే ఉంటాయన్నది పరిశీలకుల అవగాహన.
బాల కార్మికులు ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో కనిపించటం సమాజంలోని ఆర్థిక అసమానతలకు ఒక బలమైన సూచిక. పిల్లలను సమాజ సంపదగా చూసినప్పుడే, వారిదైన భవిష్యత్తులో మనం ఇప్పుడు బతకుతున్నామనే స్ప ృహతో పౌర సమాజం ఉన్నప్పుడే - సంపూర్ణంగా బాల కార్మికవ్యవస్థను నిర్మూలించటం సాధ్యం. సోషలిస్టు విధానాలను అనుసరించే దేశాలు పిల్లలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాయి. వారి శారీరక, మానసిక, దైనందిన ప్రపంచాన్ని ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా తీర్చిదిద్దుతాయి. ఆటపాటలు, విద్యా వికాసాలూ బాలల హక్కుగా భావిస్తాయి. ఆ హక్కుకు విలువనిచ్చి, అక్షరాలా పాటిస్తాయి. ఒకప్పటి సోవియట్ రష్యా, ఇప్పటి క్యూబా, చైనా; సోషలిస్టు వ్యవస్థలు లేకున్నా ఆ విధానాల ప్రభావాన్ని ప్రదర్శించే యూరప్ దేశాలూ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపటం మనం గమనించవొచ్చు. కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చటం, పిల్లలకు విద్యావికాసాలను, ఆరోగ్య ఆనందాలను ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉచితంగా అందించటం ప్రభుత్వాలు తమ బాధ్యతగా నిర్వర్తించాలి. అప్పుడు బాల కార్మికవ్యవస్థ లేని గొప్ప సమాజం సాకారం అవుతుంది.
సమాన అవకాశాలతోనే సాధ్యం..
సమాజ నిర్మాణంలో ఏ వ్యక్తి ఎలా రూపొందినా దానికి తొలి బీజాలు బాల్యంలోనే పడతాయి. నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటకి అర్థం అదే! అందుకనే - రేపటి సమాజం పట్ల స్పష్టమైన దృష్టి, ఆలోచన ఉన్న వారు నేటి బాలల వికాసం పట్ల తగిన శ్రద్ధ చూపాలి. చట్ట వ్యతిరేకమైన, సమాజానికి హానికరమైన కార్యకలాపాల్లో బాలలను పావులుగా ఉపయోగిస్తున్న వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు. భద్రత, భరోసా లేని పరిస్థితుల్లో పెరిగిన పిల్లలు సులభంగానే వారి యుక్తులకు లొంగిపోతారు. మరో ప్రపంచం తెలియని మాయాజాలంలో ప్రమాదకర దుస్సాహసాలతోనే ప్రయాణం చేస్తారు. పాలకులు పనిగట్టుకొని మరీ అలాంటి వారిని చదువు, ఉపాధి దారుల్లో పెట్టాలి. విద్య అందించే విలువని, గౌరవాన్ని, హుందాతనాన్ని చవి చూపించాలి. మనదేశంలో ముందుకు వెళుతున్నట్టే వెళ్లి- మళ్లీ చీకట్లోకి నడిచినట్టు ఇటీవలి పరిణామాలు కనిపిస్తున్నాయి. కులాలు ఉండాలి, కులవృత్తులు కొనసాగాలి, రిజర్వేషన్లను తీసేయాలి అన్న ధోరణులు గట్టిగా ప్రబలుతున్నాయి. ఇవి సమాజం మరింత వెనక్కిపోవటానికి, ఆర్థిక సామాజిక అంతరాలు మరింతగా ప్రబలి, బాల కార్మికులు ఇంకా ఎక్కువగా పెరగటానికి కారణమవుతాయి. అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు అలాంటి భావాలను, ప్రచారాలను గట్టిగా ఎదుర్కోవాలి.

సామాజిక, ఆర్థిక అంతరాలు పోవాలి..
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ఒక దీర్ఘకాలిక, బహుముఖ ప్రణాళిక. పేదరికానికి, బాల కార్మికవ్యవస్థకు సంబంధం ఉందన్న సంగతిని తొలుత గుర్తించాలి. మనదేశంలో అయితే- సామాజిక అంతరాలూ, దానికి సంబంధించి ప్రచారంలో ఉన్న అభిప్రాయాలు కూడా కారణం. ఏ కుటుంబానికి అయినా తమ సంతానాన్ని బాల్యదశ దాటేదాకా పోషించటానికి ఆర్థిక శక్తి అందుబాట్లో ఉండాలి. భూమి, ఉపాధి, ఉద్యోగం.. ఇలా ఏ రూపంలోనైనా వారికి ఆ శక్తి ఒనగూడాలి. విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలు అందరికీ భౌతికంగానూ, ఆర్థికంగానూ అందిపుచ్చుకునేవిగా ఉండాలి. మనదేశంలో ముఖ్యమైన మరొక అంశం.. సామాజిక అంతరం. ఫలానా కులం వాళ్లు చదువుకు, ఉద్యోగాలకు అర్హులు కారనే అనధికారిక భావజాలానికి స్వస్తి పలకాలి. ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తరచూ ఇలాంటి వివక్ష ప్రదర్శిత సంఘటనలు జరుగుతున్నాయి. మంచిగా బట్టలు వేసుకోవటం, చెప్పులు తొడుక్కోవడం, గుర్రం ఎక్కడం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండడం వంటి సర్వ సాధారణ విషయాలు తీవ్ర నేరాలుగా చూడబడుతున్నాయి. భారత రాజ్యాంగం పక్కకుపోయి మనువాద భావజాలం, భూస్వామ్య వాదం పేట్రేగుతున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ దుర్మార్గం మరింతగా ప్రబలుతోంది. కులాధిపత్య భావజాలానికి అధికార సహకారం బాహాటంగానే తోడవుతోంది. ఈ ధోరణులకు ఆధునిక సమాజం చరమగీతం పాడాలి. రాజ్యాంగ విరుద్ధమైన ప్రతి ఆధిపత్యం మీదా, అహంకార భావజాలంపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఫలానా వారు పనివాళ్లుగానే ఉండాలనే పాత రోత భావాలకు అడ్డుకట్ట పడుతుంది. చదువు వయసు ఉన్న ప్రతి బాలుడూ బాలికా పాఠశాల ప్రాంగణంలోకి చేరతారు. పలకాబలపం పట్టి రేపటి చక్కటి సమాజానికి అక్షరాలు

నిర్మూలనకు సార్వత్రిక సంఘీభావం కావాలి !
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) 2002లో ఈ అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినాన్ని ప్రకటించింది. ప్రతి ఏటా జూన్ 12న దీనిని పాటించాలని సూచించింది. 2003 నుంచి ఈ పిలుపు అమలవుతోంది. ఆ సంవత్సరాన్ని బాలల అక్రమ రవాణా నివారణా సంవత్సరంగా ప్రకటించారు. ఇలా ప్రతి ఏడాది ఒక అంశాన్ని ప్రచారంలో పెడుతోంది ఐఎల్‌ఒ. 2022 సంవత్సరం ప్రచారాంశం : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సార్వత్రిక సంఘీభావం.

నిరంతర కార్యాచరణతోనే నిర్మూలన
బాల కార్మికవ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్మూలించాలి తప్ప - ఏకపక్షంగా, బలవంతంగా కాదు. బాల కార్మికుడిని పని మాన్పించి, బడిలో చేర్పించటం సులభంగా అనిపించొచ్చు. కానీ, అది పూర్తి ఫలితాలను ఇవ్వదని గతంలో కొన్ని అనుభవాలు రుజువు చేశాయి.
బంగ్లాదేశ్‌లో 1993లో లక్షలాది పిల్లలు వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారని ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. దీనికి అంతర్జాతీయంగా గొప్ప స్పందన వచ్చింది. ఆ వస్త్ర పరిశ్రమతో సంబంధం ఉన్న అంతర్జాతీయ కొనుగోలు సంస్థలు- పిల్లలు పనిచేసే పరిశ్రమల నుంచి దుస్తులు తీసుకోబోమని ప్రకటించాయి. దీంతో పరిశ్రమ నుంచి బాలలను తొలగించారు. వారు రోడ్డున పడ్డారు. కొందరు అంతకన్నా ప్రమాదకర పరిశ్రమల్లో, అంతకన్నా తక్కువ జీతాలకు పనికి చేరారు. ఆడపిల్లలు బలవంతంగా వ్యభిచార వృత్తిలో చేర్చబడ్డారు. దీంతో, సమస్య మరింత పెరిగింది. బాల కార్మికులను పనిప్రదేశం నుంచి మార్చటం ఒక్కటే కాదు; వారి వెనుక ఉన్న పరిస్థితులనూ ప్రభుత్వాలు మార్చాలి. చదువు మాకెందుకనే భావమూ చాలామందిలో ఉంటుంది. తమ ఇష్టంతోనే పనిలో ఉన్నామనే భావన, ఇది బాగానే ఉందనే సమర్థింపూ కొన్నిసార్లు బాల కార్మికుల నుంచీ రావొచ్చు. కానీ, ప్రభుత్వం వారిని అన్నివిధాలా మార్చే బాధ్యతను తీసుకోవాలి.
మనదేశంలో బాలలను ప్రమాదకర వృత్తుల్లో పనిచేయించటాన్ని నిషేధిస్తూ 1986లో భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం.. 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. అందులో మందుగుండు సామగ్రి తయారీ, గాజులు, అద్దాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కానీ, ఇప్పటికీ శివకాశీ టపాసుల తయారీలో బాలలు పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారనే పరిశీలన ఉంది. చట్టాలు చేసినా, చిత్తశుద్ధి లేకపోతే- పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది !
మన ప్రభుత్వం 2016 సెప్టెంబరు 1న బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు మరొక ప్రత్యేక చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. 14 ఏళ్ల లోపు పిల్లలు ఎవరూ, ఎక్కడా పనిచేయటానికి వీల్లేదు. ఈ చట్టంపై చర్చ జరుగుతున్నప్పుడే మన రాష్ట్రంలో చాలా పెద్ద హడావిడి జరిగింది. ఇటుకల తయారీ, వస్త్ర పరిశ్రమలపైనా, సెలబ్రిటీల ఇళ్లపైనా దాడులు జరిగాయి. యజమానులకు జరిమానాలు విధించారు. టీవీ ఛానెళ్లు భారీగా ప్రచారం చేశాయి. ఆ తరువాత మళ్లీ అలాంటి ప్రచారమూ లేదు, పర్యవేక్షణా లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ఒక తతంగంలా కాదు; ఒక నిరంతర కార్యాచరణగా ఉండాలి.
సత్యాజీ
9490099167