ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వేణు మహాల్ రోడ్డు, మల్లెల గ్రౌండ్స్‌లోని పలు వీధుల్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రజల ద్వారా స్థానిక సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారానికి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల నిర్వహణలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఆటంకాలను సృష్టించినా ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోతున్నారని అన్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, సామాజిక పెన్షన్లు వంటి కార్యక్రమాల అమలుకు ఆటంకాలు రాకుండా క్యాలెండర్ ప్రకారం వాటిని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలు కొనసాగాలన్నా, ఆశించిన మేరకు రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా 2024 ఎన్నికల్లో మనం తిరిగి వైసిపిని గెలిపించుకోవాలని, జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీలేరు మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథ్ రెడ్డి, సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాష, వైసిపి యువ నాయకులు జివి రాకేష్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి హుమయూన్, వైస్ ఎంపీపీలు హరితా వెంకటరమణ, నెల్లూరు వెంకటాచలపతి, మండల కో ఆప్షన్ సభ్యుడు రెడ్డి బాష, ఉదరు, అతిక షఫీ, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










