Oct 08,2023 14:44

ప్రజాశక్తి-పెనుకొండ(శ్రీ సత్యసాయి జిల్లా) : పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్‌ నారాయణ కాన్వారుపై పేలుడు పదార్థంతో దాడికి యత్నించారు. గోరంట్ల మండలంలోని ఒక గ్రామానికి వెళుతుండగా కాన్వారుపై అగంతకుడు పేలుడు పదార్థాన్ని విసిరాడు. అయితే అది పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై గోరంట్ల సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్‌ నారాయణపై ఎలక్ట్రికల్‌ డిటోనేటర్‌ విసిరినట్లు = ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పవర్‌ సప్లై లేకపోవడం వల్ల అది పేలలేదని తెలిపారు. మద్యం మత్తులో డిటోనేటర్‌ విసిరినట్లు భావిస్తున్నామని.. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చేందిన గణేష్‌గా గుర్తించామని.. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామన్నారు.

కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలి : ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ

నాపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ అన్నారు. కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలని డిమాండ్‌ చేశారు. దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. డిటోనేటర్‌ పేలి ఉంటే ఘెర ప్రమాదం జరిగి ఉండేదన్నారు.