Feb 26,2023 09:19

కోడి కూర అంటే అందరికీ చికెన్‌ ఫ్రై, చికెన్‌ కూర మాత్రమే తెలుసు. మహా అయితే గోంగూర చికెన్‌, చికెన్‌ 65 వెరైటీలేగా అనొచ్చు. కానీ సామాన్య ప్రజలు కోడిలోని కొన్ని ప్రత్యేకమైన వాటితో వెరైటీస్‌ చేసుకుని తింటారు. వాటి రుచిని తిని, ఆస్వాదించాల్సిందే. అవే కోడి కాళ్లు, కందనకాయ, తోళ్లు, తలతో చేసే వెరైటీలు. అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

  • కాళ్ళు..
1

కావలసినవి : చికెన్‌ కాళ్ళు - 6, పెరుగు - కప్పు, కారం - 2 స్పూన్లు, ఉప్పు - 2 స్పూన్లు, పసుపు - 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు, ధనియాల పొడి -2 స్పూన్లు, జీలకర్ర పొడి - 2 స్పూన్లు, పచ్చిమిర్చి - 4, నిమ్మరసం - 2 స్పూన్లు, నూనె - 100 గ్రా., యాలుకలు - 3, లవంగాయలు - 5, దాల్చినచెక్క - 2అంగుళాలు, ఉల్లిపాయలు - 2, టమోటాలు - 2, నీరు - కప్పు
తయారి : ముందుగా శుభ్రం చేసిన కోడికాళ్ళను వెడల్పు గిన్నెలోకి తీసుకొని, చాకు లేదా ఫోర్క్‌తో గాట్లుపెట్టాలి. పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, నిమ్మరసం అన్నింటినీ బాగా కలిపి వాటికి పట్టించి, గంటసేపు పక్కనుంచుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి షాజీర, లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క రెండు నిమిషాలు వేయించాలి. దానిలో ఉల్లితరుగు, టమోటా ముక్కలను ఉడికించాలి. ఆయిల్‌ కూరలకు అంచుల వెంబడి వచ్చిన తర్వాత మాగెట్‌ చేసిన కాళ్లను వేసి, బాగా కలిపి మూతపెట్టి పావుగంట సేపు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి. తరువాత నీళ్ళు చేర్చి, కూర గుజ్జుగా అయ్యేంత వరకూ ఉడికించాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు చల్లి, మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించి, కూరను దింపేయాలి. అంతే ఘుమ ఘుమలాడే చికెన్‌ లెగ్‌ పీసెస్‌ కూర రెడీ.

  • స్కిన్‌తో..
skin

కావలసినవి : స్కిన్‌ - 1/2 కేజీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి - 3, వేయించిన ధనియాల పొడి - స్పూను, జీలకర్ర పొడి - 1/2 స్పూను, గరం మసాలా - స్పూను, పసుపు - 1/2 స్పూను, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, నూనె - 100 గ్రా., కొత్తిమీర తరుగు
తయారి : ముందుగా శుభ్రం చేసిన చికెన్‌ స్కిన్‌ను ముక్కలుగా కోసుకోవాలి. వీటికి ఉప్పు, పసుపు, కారం బాగా పట్టించాలి. బాండీలో నూనె వేడిచేసి జీలకర్ర, ఎండుమిర్చి తాలింపుపెట్టి దానిలో ఉల్లితరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి, రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత స్కిన్‌ముక్కలు వేసి తిప్పుతూ వేయించాలి. కూర అంచుల వెంబడి నూనె కనిపించినప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు చల్లి కొద్దిసేపు కలుపుతూ వేయించాలి. అంతే చికెన్‌ స్కిన్‌ ఫ్రై రెడీ.

  • కందనకాయలతో..
kodi


కావలసినవి : కందనకాయలు - 1/2 కేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 3, మెంతికూర - కట్ట, ఎండుకొబ్బరి పొడి - స్పూను, వేయించిన ధనియాల పొడి - 2 స్పూన్లు, జీలకర్ర పొడి - 1స్పూను, గరం మసాలా - స్పూను, పసుపు - 1/2 స్పూను, ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, నూనె - 100 గ్రా., కొత్తిమీర తరుగు
తయారి : ముందుగా కందనకాయలు (లివర్‌), మెంతికూరలను శుభ్రం చేసి పక్కన ఉంచాలి. బాండీలో నూనె వేడి చేసి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు, మెంతి ఆకు వేసి, తిప్పుతూ, మూడు నిమిషాలు వేయించాలి. దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. తర్వాత కందనకాయలు, పసుపు, ఉప్పు, కారం వేసి ఒకసారి మిశ్రమం అంతటినీ కలిపి, మూతపెట్టి ఉడికించాలి. కూరలో నీరు ఇగిరిపోయిన తర్వాత ఎండుకొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర పొడులు, గరం మసాలా, కొత్తిమీర తరుగు చల్లి, కూరను తిప్పాలి. ఇలా రెండు నిమిషాలు వేయించాలి. అంతే కందనకాయల ఫ్రై రెడీ.

  • తలలతో..
head

కావలసినవి : చికెన్‌ హెడ్స్‌-1/2 కేజీ, ఉల్లిపాయలు - 1/4 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - స్పూన్‌, మిర్చి - 3, లవంగాలు - 4, మిరియాలు - 10, ఏలకులు -5, దాల్చిన చెక్క - 2 అంగుళాలు, బే ఆకు, ధనియాల పొడి - స్పూన్‌, పసుపు - 1/2 స్పూను, జీలకర్ర పొడి -1/2 స్పూను, కారం - స్పూను, ఉప్పు - తగినంత, గరం మసాలా - స్పూను, ఆవాల నూనె - 100 గ్రా., కొత్తిమీర తరుగు
తయారి : ముందుగా శుభ్రం చేసిన చికెన్‌ తల ముక్కలకు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా ముక్కకు పట్టించాలి. బాండీలో నూనె వేడిచేసి లవంగాలు, మిరియాలు, ఏలకలు, దాల్చిన చెక్క, బే ఆకు వేసి, తిప్పుతూ వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి, మరో మూడు నిమిషాలు వేయించాలి. గార్నిష్‌ చేసిన తల ముక్కలు, కారం వేసి మూతపెట్టి, మధ్యలో తిప్పుతూ ఉడికించాలి. నూనె కూర అంచుల వెంబడి తేలినప్పుడు నీటిని చేర్చి ఉడికించాలి. కూర దగ్గరకు వచ్చిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి, మరో రెండు నిమిషాలు ఉడికించాలి. అంతే చికెన్‌ తలల కూర రెడీ.