Feb 22,2023 07:38

       నేను ఆలీ సాయిబు చారు దుకాణానికి వెళ్ళేసరికే అక్కడ కచేరీ మొదలైపోయింది. మా సుబ్బన్న మావ అప్పటికే కథ మొదలుపెట్టేశాడు. ''ఆ షావుకారు ఇద్దరు కుర్రాళ్ళని పిలిచి ఒకడి చేతిలో చేగోడీల డబ్బా, రెండోవాడి చేతిలో జంతికల డబ్బా పెట్టేడు. ఒక్కో చేగోడీని పావలాకి అమ్మాలని చెప్పేడు. అలాగే ఒక్కో జంతికను కూడా పావలాకే అమ్మాలని చెప్పేడు. సాయంకాలానికల్లా వాటన్నింటినీ అమ్ముకుని రావాలని చెప్పేడు. ఇద్దరికీ చెరో పావలా చేతుల్లో పెట్టి 'ఇది మీ కూలీ' అని చెప్పేడు.
      సాయంత్రం అయ్యింది. ఆ ఇద్దరు కుర్రాళ్ళూ ఖాళీ డబ్బాలు ఊపుకుంటూ వచ్చేశారు. 'భేష్‌! అన్నీ అమ్మేశారన్నమాట. మరి అమ్మితే వచ్చిన డబ్బులేవి?' అనడిగేడు.
వాళ్ళిద్దరూ షావుకారు చేతిలో చెరో పావలా పెట్టేరు.
తెల్లబోయిన షావుకారు ఇదేమిటని నిలదీసేడు.
          వాళ్ళు చెప్పినదేమంటే, చేగోడీలవాడు జంతికలవాడికి ఓ పావలా ఇచ్చి ఒక జంతిక తిన్నాడు. జంతికలవాడు కూడా అదే విధంగా పావలా ఇచ్చి చేగోడీ తిన్నాడు. అలా ఆ రెండు పావలాలే ఇద్దరి చేతులూ మారుతూ వచ్చేయి. చివరికి రెండు డబ్బాలూ ఖాళీ అయిపోయేయి. వాళ్ళ లెక్క ప్రకారం సరుకు అమ్ముడుపోయింది. అమ్మితే వచ్చిన సొమ్ము జమ చేసేశారు.
         ఇదీ కథ. అని ముగించేడు సుబ్బన్న మావ. నాకైతే ఏమీ అర్ధం కాలేదన్నాను, అసలీ కథ ఎందుకు చెప్పావో బోధపడడం లేదన్నాను.
అప్పుడు సుబ్బన్నమావ ఇలా వివరించేడు:
          ''ఆ కుర్రాళ్ళిద్దరూ అదానీ గ్రూపుకి సంబంధించిన డొల్ల కంపెనీలు. ఆ చేగోడీలు, జంతికలు అదానీ గ్రూపుకి బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఇంకా ఇతర మదుపుదారులూ ఇచ్చిన రుణాలు. ప్రజాధనం ఆ చేగోడీలూ, జంతికల మాదిరిగానే స్వాహా అయిపోయింది. ఆ కుర్రాళ్ళిద్దరూ తిరిగి జమ చేసిన ఆ రెండు పావలాలే మిగిలేయి.
        ఆ కుర్రాళ్ళిద్దరూ నిబంధనలను అనుసరించి నడుచుకున్నారా లేదా అన్నది ప్రశ్న. ఆ సంగతి ఎప్పటికి తేలుతుందన్నది ఇంకా పెద్ద ప్రశ్న. మాయం అయిపోయిన ప్రజా ధనం తిరిగి వెనక్కి రాదన్నది స్పష్టం. అది ఎప్పుడో అరిగిపోయింది. అదన్నమాట అదానీ వ్యవహారం.''
''మరి కథలోని షావుకారు ఎవడు?'' ఉండబట్టలేక అడిగేను.
''ఇంకెవరు? మన మోడీగారే.'' అన్నాడు సుబ్బన్న మావ.
''మరి ఇప్పుడా షావుకారు ఏం చేస్తాడు?'' అనడిగేడు ఆలీ సాయిబు.
''ఇంకేం చేస్తాడయ్యా? మళ్ళా మరో రెండు డబ్బాలతో మరో రెండు తినుబండారాలు ప్రజాధనంతో తయారుచేసి అదానీ డొల్ల కంపెనీలకు సమర్పించుకుంటాడు.''
మరి మనం ఏం చేయాలి? అని అడిగేరు ముక్త కంఠంతో శ్రోతలంతా.
''ఇంకేం చేస్తారయ్యా? దుకాణంలోని సరుకుని దోచిపెట్టే షావుకారుని తప్పించి సజావుగా వ్యాపారం చేసేవాడిని అక్కడ కూచోబెట్టాలి. అంతే. ఇది కూడా నన్నడగాలా?'' అని సుబ్బన్న మావ లేచేడు.
- సుబ్రమణ్యం