Oct 01,2023 13:12

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఓపెన్‌ ఏఐ చాట్‌ టూల్‌ 'చాట్‌ జిపిటీ' వినియోగదారులను ఆనందంలో ముంచెత్తే శుభవార్త ఇది. ఇప్పుడు చాట్‌ జీపిటీ ద్వారా చూడొచ్చు, చదవొచ్చు, మాట్లాడొచ్చు. ఇప్పటివరకూ చాట్‌ జీపిటీలో మనం అడిగే ప్రశ్నలకు టెక్ట్స్‌ ద్వారా మాత్రమే సమాధానాలు వచ్చేవి. కానీ, ఇప్పుడు మీరు ఫొటోలు, మాటలు (వాయిస్‌ కమాండ్‌) ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. తాజాగా విడుదలైన ఈ చాట్‌ జీపిటీ కొత్త అప్‌డేట్‌ విడుదల చేశారు. అయితే, ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు. త్వరలో దీనికి సంబంధించిన సరికొత్త నవీకరణ పొందే సమయం దగ్గరలోనే ఉంది.
 

                                                                            వాయిస్‌ ఆదేశాలు..

తాజా అప్‌డేట్‌ చేసిన ఈ ఫీచర్‌ ద్వారా మాట్లాడుతూ.. ఏదైనా అడగొచ్చు. దీనికోసం, ల్యాప్‌టాప్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ మైక్రోఫోన్‌కు చాట్‌ జీపిటీ యాక్సెస్‌ ఇవ్వాలి. వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ రావడంతో చాట్‌ జీపిటీ వినియోగం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. వాయిస్‌ కమాండ్‌ల కోసం హోమ్‌ స్క్రీన్‌లో లభ్యమయ్యే ఐదు ఆప్షన్స్‌లో అవసరమైనదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
 

                                                                                ఇమేజ్‌ సపోర్ట్‌ ..

కొత్త అప్‌డేట్‌తో వచ్చిన చాట్‌ జీపిటీకి.. ఇమేజ్‌ సపోర్ట్‌ కూడా జత కలవడంతో ఇది సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. ఫొటోల సహాయంతో సెర్చ్‌ చేయడం, మీ ప్రశ్నలకు సమాధానాలు పొందడం చాలా సులభమవుతుంది. మీరు అప్‌లోడ్‌ చేసిన ఫొటోనూ ఇది విశ్లేషిస్తుంది. ఆ విశ్లేషణ ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ ఏదైనా పజిల్‌ని పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. ఇమేజ్‌ సెర్చ్‌ కోసం వినియోగదారుల సౌకర్యం కోసం కొత్త ట్యాబ్‌ కూడా పొందుతారు. ఈ ట్యాబ్‌ నుంచి ఫొటోలను అప్‌లోడ్‌ చేయడం, ఫోటోలను క్లిక్‌ చేయడం వంటి రెండు ఆప్షన్స్‌ను పొందుతారు.
          రాబోయే రెండు వారాల్లో ప్లస్‌, ఎంటర్‌ప్రైజ్‌ వినియోగదారులకు ఈ ఫీచర్స్‌ అందుబాటులోకి వస్తాయి. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో వాయిస్‌ సామర్థ్యం అందుబాటులో వుంటుంది. అలాగే ఇమేజ్‌ సపోర్ట్‌ కూడా అన్ని ప్లాట్‌ఫారమ్స్‌లో అందుబాటులో వుంటుంది. వినియోగదారులు చేయాల్సిందల్లా.. అందుకు అవసరమైన సెట్టింగ్స్‌ చేసుకోవడమే.