Jun 11,2023 06:51
  • 12న జెట్టి శేషారెడ్డి వర్థంతి

           జె.ఎస్‌ అనే రెండక్షరాలు ఎంత మరిచిపోదామనుకున్నా సాధ్యంగాని అక్షరాలు. ఆయన మనల్ని విడిచిపోయి 13 ఏళ్లు గడుస్తున్నా నిరంతరం వెంటాడుతూనే వున్న అక్షరాలు. మనకెందరో జీవితంలో తారస పడుతుంటారు. వారిలో కొందరు మనల్ని ఉత్తేజితుల్ని చేసిన వాళ్లు కావచ్చు. కొందరు మనలో భావోద్వేగాల్ని రగిలించి వుండొచ్చు. కొందరు మనల్ని చెయ్యిబట్టి నడిపించి ఉండొచ్చు. కొందరి మాటలు నిరంతరం మనల్ని మనం శోధించుకునేవీ, ప్రశ్నించుకునేవీ కావచ్చు. కొందరితో కాలక్షేపం సైతం కొండంత తృప్తిని ఇవ్వొచ్చు. కొందరి నుంచి ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది మిగిలే వుండిపోవచ్చు. ఇవన్నీ ఒకే దగ్గరికి చేరిస్తే ఆయన జె.ఎస్‌ (జెట్టి శేషారెడ్డి) అవుతాడు.
             ఎప్పుడు మాట్లాడినా మళ్ళీ మళ్ళీ ఆయనతో మాట్లాడాలని పించడమే ఆయన గొప్పదనాల్లో కల్లా గొప్పదనం. ఎక్కడా భేషజం వుండదు. ఎన్నడూ రాజీ ఉండదు. ఎప్పుడూ పాతదే కనపడదు. ఆత్మీయతతో కట్టిపడేస్తూ అంతర్మధనానికి నెట్టేవి ఆయన మాటలు. ఆయనతో విభేదించినా, వాదించినా చివరికి ఓడిపో యినా ఒకే తృప్తి, ఆనందం కలిగేవి. ఇలా ఎంతైనా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుకోవచ్చు. కానీ మనం ఉద్యమాల్లో వున్న వాళ్ళం. ఏదో ఒక వసంత కాల సుప్రభాతం వస్తుందనీ, మనం వెదజల్లిన విత్తనాలు మొలకెత్తి, మహావృక్షాలై పుష్పించి, మరో ప్రపంచపు సుగంధాలు విరజిమ్ముతాయని నమ్ముతున్న వాళ్ళం. దీనికి సిద్ధాంతం, నిర్మాణం ప్రాణమని విశ్వసిస్తున్నవాళ్ళం. ఇలాంటి మనకు ఆయన ఏమిచ్చి వెళ్లారు అనేది సూటిగా మాట్లాడుకోవాల్సిన తరుణమిది.
 

                                                                   చివరి దాకా ప్రజలతో మమేకం

ఒకసారి బొలీవియా గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆదిమ తెగల లాంటి అట్టడుగు స్థానిక తెగలకు భూమి పంచడాన్ని గురించి జె.ఎస్‌ ప్రస్తావిస్తున్నారు. ఆ ప్రజల కష్టాల్ని, వారి పోరాటాలని వివరిస్తున్నారు. అంతే ఆయన కళ్ళలో తళుక్కున నీళ్లు తొణికాయి. వాటిని కనిపెట్టీ పెట్టకముందే దాచేసుకుని చెప్పాల్సింది చెబుతూ పోతున్నారు. ఎక్కడి బొలీవియా?ఎక్కడి స్థానిక తెగలు? వారికి భూములు ఇస్తే జె.ఎస్‌ కు ఎందుకింత ఆనందం? వారి కష్టాలు చెబుతుంటే ఆయనకెందుకంత భావోద్వేగం? పేదల పట్ల ఈ ఆర్ద్రతే ఆయన్ను జీవితాంతం నడిపించి వుంటుందనుకుంటాను. ప్రజా వైద్యవృత్తికి అంకితం చేసి వుంటుందనుకుంటాను. పేదల్ని ప్రేమించడం, వాళ్ళ కడగండ్లకు చలించిపోవడం, వాళ్లకే చిన్న మంచి జరిగినా మురిసిపోవడం ప్రతి ఉద్యమకారుడికి వుండాల్సిన ప్రాథమిక లక్షణాలన్పిస్తుంది.
              జె.ఎస్‌ నిరంతర పాఠకుడు. జ్ఞాన పిపాసి. మేధావి. ఇంకా ఇంకా ఆయన ఎన్నైనా కావచ్చు. కానీ ప్రజలతో మమైకత్వం మాత్రం ఆయన చివరి క్షణాల దాకా వదులుకోలేదు. ప్రజా వైద్యుడిగా ఆయనకా అవకాశం చిక్కింది. ఎదురుగా కూర్చున్న పేద రోగి నాడి పట్టుకొని ఆయన ప్రజల నాడిని తెలుసుకొన ేవాడు. వైద్యాన్ని దీనికి ఒక అవకాశంగా మలుచుకునేవాడు. వాళ్ళ మనిషిగా వాళ్ళ భాషలో మాట్లాడేవాడు. వాళ్ళ నుంచి వినేవాడు. వాళ్లతో అనుబంధాన్ని పెంచుకునే వాడు. ఎప్పుడూ సాధారణ జనానికి దూరం గాకుండా జాగ్రత్తపడేవాడు. మనం టీబికి మందులిస్తాం, ఆహారం ఎవరు పెడతారు? అని అనుభవం నుంచే సిద్ధాంతాన్ని అన్వయించుకునేవాడు. జె.ఎస్‌ సిద్ధాంత నిబద్ధత లోని అసలు రహస్యం ఇదే !
 

                                                                           అపార జ్ఞాన తృష్ణ

తన అనుభవాల్ని ఆయన సమకాలీన ప్రపంచానుభవాలతో నిరంతరం సరిచూచుకునేవాడు. అందుకోసం ఎక్కడెక్కడివో చదివేవాడు. అందరితోనూ సంబంధాలు పెట్టుకొని వారి నుంచి తెలుసుకొనేవాడు. ఎక్కడా వెనకబడేవాడు కాదు. అందుకోసం ఆధునిక సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని ఒడిసి పట్టుకొనేవాడు. అప్పుడాయనకు వయస్సేమీ అడ్డం రాలేదు. వేకువనే లేచి, ఇంటర్నెట్లో ప్రపంచమంతా గాలించి, మంచిని వేరుచేసి, దుర్మార్గాలని దూరం చేసి, పది మందికి మెయిల్‌ చేసి వైద్యానికి ఉదయం 6 గంటలకల్లా సిద్ధమయ్యేవాడు. అంతటి జ్ఞాన తృష్ణ ఆయనది. అయితేనేం? ఆయనెప్పుడూ నాదే చివరి మాట అనే వాడు కాదు. ఎన్నో వాదాలు ఆయనతో చేసే అవకాశం నాకు వచ్చింది. ఓపిగ్గా వింటాడు. అంతే ఓపిగ్గా తన వాదన కూడా వినిపిస్తాడు. ఎదుటివారి వాదనను కూడా వాదంగా స్వీకరిస్తాడు. అలా వాదించే హక్కును గౌరవిస్తాడు. సమావేశాల్లో చర్చల్లో ఈ ప్రజాస్వామిక లక్షణం చాలా కష్టమైన పని. మేధావులకు, నాయకులకు మరీ కష్టమైన పని. అందుకే జె.ఎస్‌ తో పోట్లాడితే చిరాకు వేసేది కాదు. ముచ్చట వేసేది. కొంతకాలం గడిచాక సిగ్గేసేది. ఒడిలో పడుకొన్న బిడ్డ కాళ్లు చేతులతో తన్నుతుంటే, లాలిస్తూ ముచ్చట పడే తల్లి ప్రతిరూపం శేషారెడ్డిలో కనిపించేది.
 

                                                                      పదునెక్కిన కత్తి వాదర !

జె.ఎస్‌ చాలా మృదుస్వభావి. ఎప్పుడూ నవ్వుతూ కనపడేవాడు. ఆయన కనిపిస్తే, పలికితే, చెయ్యి పట్టుకుంటే తీయగా ఉండేది. కానీ ఆయన అత్యంత కఠినుడు కూడా. ఎప్పుడూ ఎంత సరళంగా ఉంటారో పాలసీల దగ్గరకొచ్చేటప్పటికి ఆయనంత కరుగ్గా మారి పోయేవాడు. ఇక రాజీ పడే ప్రశ్నే లేదు. ఎవరినీ లెక్క చేయడు. ఏ ములాజా పెట్టుకోడు. తాను ఎంత ఒంటరి అయినా కూడా పట్టించుకోడు. 'కత్తి వాదర పదునుగా ఉంటేనే పనికొస్తుంది. లేకుంటే తుప్పుపట్టి పోతుంది' అనిపించేది జె.ఎస్‌ ని అలాంటి సందర్భాల్లో చూసినప్పుడు. ఎక్కడో ఒకచోట రాజీపడడం, విసిగిపోవడం, నిరాశపడడం, తటస్థతతో సరిపెట్టుకోవడం, మౌన ధారణ చేయడం జె.ఎస్‌ నిఘంటువులో లేని మాటలు. అదే సందర్భంలో మెజారిటీ అభిప్రాయానికి ఆయన అంతే వినయంగా ఒదిగిపోయేవాడు. ఒక్క అడుగు అటూ ఇటూ వేసే వాడు కాదు.
            జె.ఎస్‌ ఓ స్పష్టమైన ప్రాపంచిక దృక్పథానికి, సిద్ధాంతానికి ఈ రెంటినీ అంగీకరించే, నిర్మాణానికి జీవితాంతం కట్టుబడ్డ వ్యక్తి. జీవితంలోని ప్రతి అణువు దీనికి అంకితం చేసిన వ్యక్తి. అట్లని ఆయన ప్రపంచం చాలా చిన్నదనుకుంటే పొరపాటు. సాహిత్యవేత్తల నుంచి, సామాజిక వర్గాల నాయకుల దాకా...సాంకేతిక నిపుణుల నుంచి సంప్రదాయ పండితుల దాకా ఆయనకుండే సంబంధాలు కోకోల్లలు. తద్వారా ఆయన నమ్మిన సిద్ధాంతానికి ఓ ఆమోదం లభింపచేయగలిగాడు. ఎదుటివారిని అంగీకరించడం, గౌరవించడం పది మంది మనిషిగా చలామణి కావడం చాలా కొద్ది మంది ఉద్యమకారులకే సాధ్యం. వారిలో జె.ఎస్‌ ముందుండే వాడు.
 

                                                                   జన విజ్ఞాన వేదికకు దిక్సూచి

అలాగే ఎన్ని సంస్థలతో, ఉద్యమాలతో ఆయనకు అనుబంధ బాంధవ్యాలు ఉండేవో చెప్పలేము. ప్రతి సంస్థలోను ఏదో ఆదర్శాన్ని ఆయన వెతుక్కునేవారు. ఆశించేవారు. అది రెడ్‌ క్రాస్‌ కావచ్చు, యు.టి.ఎఫ్‌ కావచ్చు, సైన్స్‌ ఉద్యమం కావచ్చు. యు.టి.ఎఫ్‌ నుంచి ఆయన చాలా ఆశించాడు. గ్రామాల్లో ఉంటారని, పాఠాలు చెప్పే వారిని, ఆలోచనాపరులని, సంఘటిత పడ్డవారని, లోకానికి ఇంతకంటే పనికొచ్చే వాళ్ళు ఎవరుంటారని ఆయన టీచర్లను, వారి ఉద్యమాన్ని ఎంతో ప్రేమించాడు, గౌరవించాడు. ఇక జన విజ్ఞాన వేదిక ఆయన చేతుల్లో పుట్టింది, ఎదిగింది. అక్షర దీపం మేము చేపట్టినప్పుడు, అది సారా వ్యతిరేక ఉద్యమంగా ప్రభంజనమైనప్పుడు జె.ఎస్‌ ఎంత ఆనందించాడో, ఎంత ప్రోత్సహించాడో చెప్పలేను. 'న్యూ ఎకనామిక్‌ పోలసీ, ఇట్స్‌ ఇంపాక్ట్‌ అండ్‌ ఇంప్లికేషన్‌' మీద 'జాతీయ సదస్సును మేము 1993 డిసెంబర్‌లో జరిపినప్పుడు 'హిందూ' సంపాదకులు ఎన్‌.రామ్‌ హాజరయ్యారు. ముగ్ధులయ్యారు. 'జెవివి ని చూచి నేర్చుకోండి' అని తమిళనాడు సైన్స్‌ ఫోరంకు సలహా ఇచ్చారు. నిజానికి ఈ ఆలోచన, ప్రాణాళిక, వనరుల సేకరణ, వక్తల గుర్తిం పు ప్రతి ఒక్కటీ జె.ఎస్‌ దే. ముప్పై ఏళ్ల ఆనాటి వక్తల మాటలన్నీ నేడు అక్షర సత్యాలయ్యాయి. జె.ఎస్‌ ది అంత దూరదృష్టి .
               చివరిగా ఒక మాట. మనకంటే చిన్నవాళ్లతో, సమానమైన వాళ్ళతో సాన్నిహిత్యం నెరపడం చాలా సులభం. అందులో మన ఆధిపత్యాన్ని వీలున్నప్పుడల్లా ప్రదర్శించుకునే వీలుంటుంది. కానీ మనకంటే పెద్దవాళ్లతో, గొప్ప వాళ్ళతో సాన్నిహిత్యమే మనమెంత అల్పులమో అడుగడుగునా అంచనా వేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మధ్యతరగతి బుద్ధిజీవులకు ఎప్పటికప్పుడు తమ 'ప్రతిభా పాటవాల' పరిమితుల్ని గుర్తు చేసే ఒక వ్యవస్థ తప్పనిసరి అవసరమనిపిస్తుంది. జె.ఎస్‌ రూపంలో మాకు ఆ అవకాశం దక్కింది ఒళ్ళు దగ్గర పెట్టుకునేలా చేసింది !
 

/ వ్యాసకర్త మాజీ ఎమ్మెల్సీ /

వి. బాలసుబ్రమణ్యం