Jul 30,2023 09:24

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్‌ తన లోగో మార్చింది. కొద్దిరోజులుగా లోగో మార్పు వుంటుందని, ట్విట్టర్‌లో భారీ మార్పులు వుంటాయని ఆ సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ ముందుగానే ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పటివరకూ ట్విట్టర్‌ లోగోగా వున్న పక్షి (బ్లూ బర్డ్‌) స్థానంలో అధికారికంగా 'ఎక్స్‌' గా మారింది. ట్విట్టర్‌ అనగానే గుర్తొచ్చే పక్షి బొమ్మ ఇప్పుడు మాయమైంది. ఎక్స్‌ హోల్డింగ్స్‌ కార్పొరేషన్‌ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్‌ ఓ కొత్త కంపెనీని స్థాపించారు. 'ఎక్స్‌' అనే దాన్ని కొన్నాళ్లుగా 'ఎవ్రిథింగ్‌ యాప్‌'గా ఆయన వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్‌ ప్లాట్‌ఫామ్‌ రంగు కూడా నీలం నుంచి నలుపు రంగుకు మారిపోయింది. ఆ పక్షి స్థానంలో 'ఎక్స్‌' గుర్తుతో వున్న లోగోను ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున శాన్‌ప్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయంలో మస్క్‌ ఆవిష్కరించారు. నలుపు రంగు బ్యాక్‌ గ్రౌండ్‌లో తెలుపు రంగులో వున్న కొత్త లోగో ఁశఁ ను ఇప్పటివరకూ వున్న ట్విట్టర్‌ వెబ్‌సైట్‌కు కూడా ఎక్స్‌.కామ్‌తో అనుసంధానం చేశారు. మస్క్‌ యాజమాన్యంలోని విస్తత రీబ్రాండింగ్‌ ప్రయత్నంలో భాగమే ఈ మార్పు అని ఆయన మీడియాకు వివరించారు. 24వ తేదీ నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా లైవ్‌లోకి వచ్చింది.

  • అన్నిటికీ 'ఎక్స్‌'..

ఎలన్‌ మస్క్‌కు ఎక్స్‌ అక్షరం అంటే విపరీతమైన ఇష్టం. అనేక కంపెనీల్లో ఎక్స్‌ అక్షరం వచ్చేలా రూపొందించుకున్నారు. ట్విట్టర్‌ సీఈవోగా లిండా యాకరినో బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా కంపెనీని 'ఎవ్రీ థింగ్‌ యాప్‌ ఎక్స్‌' గా మార్చడంలో ఆమె కీలకపాత్ర పోషిస్తుందని మస్క్‌ ట్వీట్‌ చేశాడు. 2002లో అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రారంభించిన సంస్థ స్పేస్‌ ఎక్స్‌, ఎలక్ట్రిక్‌ కారు మోడల్‌ ఎక్స్‌, చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరు (ఎక్స్‌ ఏఈ ఏ ఎక్స్‌ఐఐ) లోనూ ఎక్స్‌ అక్షరాన్ని వదల్లేదు. ఇక ఇటీవల 'ఎక్స్‌ఎఐ' పేరుతో కృత్రిమ మేధ సంస్థనూ స్థాపించారు. తాజాగా ట్విట్టర్‌ పేరెంట్‌ సంస్థ పేరునూ ఎక్స్‌ కార్పొరేషన్‌గా పేర్కొన్నారు. దీంతో ట్విట్టర్‌ లోగోతో పాటు ట్విట్టర్‌.కామ్‌ స్థానంలో ఎక్స్‌.కామ్‌ చేరిపోయింది. సోమవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్న మస్క్‌.. 'ఎక్స్‌' తో కూడిన ప్రధాన కార్యాలయ ఫొటోనూ షేర్‌ చేశారు.
ఇక ట్విట్టర్‌లోని అన్‌ వెరిఫైడ్‌ ఖాతాల నుంచి ప్రత్యక్ష సందేశాలు ఉంచడాన్ని పరిమితం చేస్తున్నట్లు ఆయన ఇంతకుముందే ప్రకటించారు. 'డైరెక్ట్‌ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అన్‌వెరిఫైడ్‌ ఖాతాల నుండి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డీఎం (డైరెక్ట్‌ మెసేజ్‌) లు చేయగలరు. సబ్‌స్క్రైబ్‌ చేసుకొని ఎక్కువ మెసేజ్‌లు పంపండి' అంటూ గతంలోనే ట్విట్టర్‌ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పక్షి లోగో స్థానంలో డాగ్‌ కాయిన్‌ను పోస్ట్‌ చేశారు. అయితే రెండు రోజులకే తిరిగి పక్షిలోగోను మారుస్తున్నట్లు ప్రకటించారు.

  • మార్పులు ఇలా...

ఎలోన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి ఒక్కొక్కటిగా అనేక మార్పులు చేశాడు. ట్విట్టర్‌ చాలా కాలంగా నష్టాల్లో నడుస్తున్నందున ఆదాయాన్ని ఆర్జించడం మొదటి నుండి ఎలాన్‌ మస్క్‌ లక్ష్యాలలో ఒకటి. నష్టాలను తగ్గించుకోవడానికి, మస్క్‌ మొదటిగా సిబ్బందిని తొలగించాడు. ఏడాది క్రితం ట్విట్టర్‌లో పనిచేసే వారి సంఖ్యలో నేడు సగం మంది మిగిలారు. అంతేకాదు.. ఆదాయం కోసం ట్విట్టర్‌ పక్షి లోగోను వేలం వేసింది. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్‌ పేరు మార్చారు. ట్విట్టర్‌ ఇకనుంచి 'ఎక్స్‌' గా పిలువబడుతుంది.
ఎలోన్‌ మస్క్‌ యజమాని అయిన తర్వాత జరిగిన మార్పులను ఒకసారి పరిశీలిస్తే.. మొదటగా బ్లూ టిక్‌ రుసుము ఆధారితంగా చేయడం ద్వారా అతిపెద్ద మార్పు చేశాడు. బ్లూ టిక్‌లు ఉన్న వినియోగదారులు రోజుకు 6000 పోస్ట్‌లను చూడగలరు లేదా చదవగలరు. అయితే బ్లూ టిక్‌లు లేని వారికి ఈ పరిమితి 600 పోస్ట్‌ల వరకూ మాత్రమే ఉంటుందని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. పెద్ద ఎత్తున డేటా చౌర్యం, సిస్టమ్‌లో అవకతవకలు జరగకుండా నిరోధించడానికి ఇది తాత్కాలిక ఏర్పాటు అని ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. దీంతో వినియోగదారులు ట్విట్టర్‌ నుండి జారుకోవడం ప్రారంభించారు.

  • అన్నీ ఒకేచోట..

సోషల్‌ మీడియా, పేమెంట్స్‌ వంటి అన్నిరకాల సేవలు ఒకే యాప్‌లో లభ్యమయ్యే విధంగా ఒక యాప్‌ను తీసుకురావడమే తన లక్ష్యమని ఎలాన్‌ మస్క్‌ అనేక సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయనను ఇందుకు పురిగొల్పినది మాత్రం చైనా 'వీచాట్‌' యాప్‌. చైనాలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన టెన్‌సెంట్‌కు చెందిన 'వీచాట్‌' యాప్‌ మాదిరిగా అన్నీ ఒకేచోట లభ్యమయ్యే ఒక యాప్‌ను రూపొందించాలన్నది మస్క్‌ కోరిక. దాదాపు 100 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులున్న 'వీచాట్‌' యాప్‌లో - సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌, క్యాబ్‌ సేవల వరకూ అన్నిరకాల సేవలను పొందే అవకాశం వుంది. అందుకే ఆ యాప్‌ను 'యాప్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌' గా అంటారు. ఇలా అన్ని సేవలు ఒకేచోట ఉండేవిధంగా 'ఎక్స్‌' యాప్‌ను రూపొందించాలన్న తన సంకల్పం ట్విట్టర్‌ కొనుగోలుతో మరింత వేగవంతమైందని ఎలాన్‌ మస్క్‌ గత అక్టోబర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

  • బ్లూ టిక్స్‌..

ఇప్పుడు ట్విట్టర్‌లో కేవలం ఇద్దరికి మాత్రమే బ్లూ టిక్‌ వుంటుంది. ఒకరు- బ్లూటిక్‌ కోసం సభ్యత్వం పొందినవారు. రెండు- ఒక మిలియన్‌ కంటే ఎక్కువమంది ఫాలోవర్స్‌ వున్నవారు. వీరితో పాటు బూడిద రంగు చెక్‌మార్క్‌ ప్రభుత్వ లేదా అధికారిక ఖాతా అని సూచిస్తుంది. గ్రే చెక్‌మార్క్‌ జాతీయ స్థాయి ఏజెన్సీలకు ఇవ్వబడుతుంది. వీరేకాకుండా.. ఈ చెక్‌ మార్క్‌ దేశాధినేత, విదేశీ అధికారిక ప్రతినిధి, అగ్ర దౌత్య నాయకుడు, క్యాబినెట్‌ సభ్యులు (జాతీయ స్థాయి), సంస్థాగత ఖాతాలు, ఉన్నత అధికారులు, అధికారిక ప్రతినిధిలకు కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ క్రమంలో ట్విట్టర్‌ పేరును 'ఎక్స్‌'గా మార్చడంతో మొదలుపెట్టి.. రానున్న రోజుల్లో తన బ్రాండింగ్‌ అంతా 'ఎక్స్‌' కార్పొరేషన్‌ ద్వారానే నిర్వహించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.