ప్రజాశక్తి - సూళ్లూరుపేట : చంద్రయాన్-3 చంద్రుని చెంతకు చేరుకొని జాబిలి చుట్టూ లూనార్ కక్ష్యలో తిరుగుతూ ఉంది. చంద్రునికి 174 కిలోమీటర్ల సమీప కక్ష్య నుండి 1,437 కిలోమీటర్ల దూరపు కక్ష్యలో తిరిగి రెండవ రౌండ్‌ను పూర్తి చేసింది. ఇలా మరో నాలుగు సార్లు తిరిగిన తరువాత చంద్రునిపై ల్యాండ్ అవుతుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటకు చంద్రయాన్-3 మిషన్ చంద్రుని చుట్టూ తిరిగే రెండవ రౌండ్‌ను విజయవంతముగా పూర్తి చేసింది. ఇక చంద్రుని కక్ష్యలో మూడవ రౌండ్ ను ప్రారంభించి, ఈ నెల 14 తేదీ ఉదయం 11:30 నుండి 12:30 గంటల మధ్యన మూడవ రౌండ్‌ను పూర్తి చేస్తుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి జులై 14 చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం విదితమే.










