Nov 12,2023 08:53

చంద్రమోహన్‌ ... కాకతాళీయంగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన సహజ నటనతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గురుతుగా ఆయన నిలిచిపోతారు. కె.విశ్వనాథ్‌, బాపు వంటి దర్శకుల చిత్రాల్లో నటించిన ఆయన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. దాదాపుగా ఐదు దశాబ్ధాలపాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన దిగ్గజ హీరోగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు ఆయన జన్మించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తిచేసిన ఆయన అనంతరం కొంతకాలం ఏలూరులోని వ్యవసాయ కళాశాలలో పనిచేశారు.

11

                                                               రంగులరాట్నంతో సినీ ప్రస్థానం

సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాస్‌ (చెన్నై) వెళ్లారు. రంగులరాట్నం (1966) చిత్రంతో హీరోగా చంద్రమోహన్‌ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన చేసిన సుఖదు:ఖాలు, బాంధవ్యాలు చాలా పేరు తెచ్చిపెట్టాయి. 1978లో విడుదలైన పదహారేళ్ల వయసు చిత్రం అప్పట్లో సరికొత్త ట్రెండ్‌ను సెట్‌ చేసింది. ఆ తర్వాత హీరోగానే కాదు. సహ నటుడిగానూ, హాస్యనటుడిగానూ, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. చనిపోయే వరకూ వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. అప్పట్లో సినిమా ఇండిస్టీకి మంచి నటుడు దొరికాడనే చర్చ కూడా సాగింది. ఏ పాత్రలోనైనా అవలీలగా పోషించల గల నటుల్లో చంద్రమోహన్‌ ముందు వరుసలో ఉండేవారు. రంగుల రాట్నంలో చంద్రమోహన్‌ నటనను ఎన్టీఆర్‌, ఎస్వీర్‌ వంటి వారు కూడా ప్రశంసించారు.
           బాంధవ్యాళు సినిమాలో దాదాపుగా హీరో పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. పోషించిన ఏ పాత్రకైనా ప్రాణప్రతిష్ట చేస్తారనే నానుడి అప్పట్లో ఉండేది. 1980వ దశకంలో చిరంజీవి లాంటి హీరోలు వచ్చిన తర్వాత కూడా చంద్రమోహన్‌ హీరోగానే చేస్తూనే వచ్చారు. విశ్వనాథ్‌, బాపు లాంటి కొత్త తరహా ఆలోచనలతో ముందుకొచ్చిన దర్శకులు చంద్రమోహన్‌ని నటుటడిగా పెట్టి, ప్రయోగాలు చేశారు. విశ్వనాథ్‌, ఎస్వీ బాలసుబ్రహ్మణ్యంలతో బంధుత్వం కూడా ఉండటంతో వారు తీసిన అనేక చిత్రాల్లో అవకాశాలు వచ్చేవి. దర్శకుడి అంతరంగాన్ని ఎరిగి నటించే నటుడు అని పరిశ్రమలు పెద్దలు చంద్రమోహన్‌ గురించి చెబుతారు.
 

                                                           జోడీ కట్టిన హీరోయిన్లకు అగ్రస్థానం

చంద్రమోహన్‌ నరసన నటించే కొత్త హీరోయిన్‌ ఎవరైనా ఇండిస్టీలో పాతుకుపోతారనే సెంటిమెంట్‌ అప్పట్లో ఉండేది. హీరో పాత్రల నుంచి తండ్రి పాత్రలకు తేలిగ్గా బదిలీ అయిన చంద్రమోహన్‌ అక్కడ కూడా తనదైన శైలితో ప్రత్యేకత చాటారు. తనతో సహ కథానాయకుడిగా నటించిన చిరంజీవికి తండ్రిగా కూడా తన నట వైదుష్యాన్ని నిరూపించుకున్నారు. పదహారేళ్ల వయస్సు సినిమాలో చంద్రమోహన్‌- శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఆ తర్వాత నుంచి శ్రీదేవి కెరీర్‌ దూసుకుపోయింది. వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి తదితర స్టార్‌ హీరోల సినిమాల్లో శ్రీదేవి నటించింది. అదే ఏడాది జయసుధతో కలిసి ప్రాణం ఖరీదులో నటించగా ఆమె కూడా తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. పెళ్లిచూపులు సినిమాలో చంద్రమోహన్‌- విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత శోభన్‌బాబు,నాగేశ్వరరావు, చిరంజీవి లాంటి స్టార్‌ హీరోలతో అవకాశాలు దక్కాయి. విజయనిర్మల దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ, మోహన్‌బాబుతోను చంద్రమోహన్‌ నటించారు.

33

                                                                 900కుపైగా చిత్రాల్లో నటన

శుభోదయంలో పనిదొంగగా, బద్ధకానికి నిలువెద్దు నిదర్శనంగా కనిపించే పాత్రల్లో అద్భుత నటనకు మంచి పేరొచ్చింది. బంగారుపిచ్చుకలో చంద్రమోహన్‌ చేసిన బంగార్రాజు పాత్ర నేటికీ కుర్రకారును మెప్పిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి తొలిచిత్రం ప్రాణంఖరీదులో మూగ చెవిటి వాడిగా చంద్రమోహన్‌ నటన చిత్ర సీమలోనే సరికొత్త రికార్డులను నెలకొల్పింది. నటించిన 900 పై చిలుకు సినిమాల్లో 175 సినిమాల్లో హీరోగా నటించారు. వాటిలో 108 చిత్రాలు చంద్రమోహన్‌ ప్రతిభాపాటవాలకు గీటురాయిగా నిలిచాయి.