-జైలు నుండి విడుదల
-కార్యకర్తల ఘన స్వాగతం
-రాజమహేంద్రవరం నుండి అమరావతికి రోడ్డుమార్గంలో ప్రయాణం
-మద్యంకేసులో 28 వరకు అరెస్ట్ చేయం : సిఐడి
ప్రజాశక్తి-యంత్రాంగం:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్‌ను ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావు మంగళవారం తీర్పు ఇచ్చారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. బాబు కుటుంబసభ్యులు లోకేష్, బ్రహ్మణీ, బాలకృష్ణలతో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు ఆయనకు జైలు వద్ద స్వాగతం పలికారు. కార్యకర్తల నుద్దేశించి కొద్దిసేపు మాట్లాడిన అనంతరం చంద్రబాబు రాజమహేంద్రవరం నుండి అమరావతికి రోడ్డుమార్గంలో ప్రయాణమైనారు. అంతకుముందు చంద్రబాబు అనారోగ్య పరిస్థితులను దఅష్టిలో పెట్టుకుని మద్యంతర బెయిల్‌ను షరతులతో మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్వర్వుల్లో ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 27వ తేది వరకు బెయిల్ అమలులో ఉంటుందని, 28వ తేది లంగిపోవాలని పేర్కొన్నారు. ప్రధాన బెయిల్ పిటిషన్‌పై 10వ తేదీన విచారణ చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కాబట్టి ఆయన వెంట ఇద్దరు సిఐడి డిఎస్‌పిలు ఉండేందుకు అనుమతించాలంటూ సిఐడి చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. బెయిల్ గడువు ముగిసే 28 వ తేది వరకు మద్యం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ధర్మాసనానికి సిఐడి తెలిపింది.
- షరతులివి...
బెయిల్ ఉత్తర్వుల్లో ఐదు షరతులను పేర్కొన్న ధర్మాసనం, సిఐడి దాఖలు చేసిన మెమోను పరిశీలించిన అనంతరం మరికొన్ని షరతులను చేర్చింది. తొలుత పేర్కొన్న షరతుల ప్రకారం కేసు విచారణ చేస్తున్న విజయవాడ
ఎసిబి కోర్టులో లక్ష రూపాయల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలి. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవచ్చు. సరెండర్ అయ్యే సమయంలో చికిత్సతో పాటు ఆస్పత్రి వివరాలను
జైలు సూపరింటెడెంట్‌కు సీల్డ్ కవర్‌లో సమర్పించాలి. ఆ కవర్‌ను జైలు సూపరింటెండెంట్ ఏసీబీ కోర్టుకు నివేదించాలి. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసు విచారణను ప్రభావితం చేసే ఎటువంటి పనులను చేయకూడదు. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎదుట లంగిపోవాలని 16 పేజీల ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. మరికొన్ని షరతులు చేర్చాలంటూ సిఐడి మెమో దాఖలు చేయడంతో ఉత్తర్వుల జారీ అనంతరం సిఐడి మెమో దాఖలు చేయడంతో మెమోపై విచారణ బుధవారం చేపడతామని, అప్పటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడకూడదని, ర్యాలీల్లో పాల్గ్నకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని పేర్కొంటూ విడిగా మరో ఆదేశాలను జారీచేసింది. హైకోర్టు ఆదేశాలు విడుదల కాగానే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టిడిపి పొలిట్‌బూ చెరో లక్ష రూపాయల పూచీకత్తును ఎసిబి కోర్టుకు సమర్పించారు.
- ఆరోగ్య సమస్యల కారణంగానే...
ఆరోగ్య సమస్యల కారణంగానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిఐడి చేసిన వాదనలను ఆయన తోసిపుచ్చారు. 'గత జూన్ 21 నుంచి ఆరు నెలల్లోగా కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలని చంద్రబాబు వైద్యులు సిఫార్సు చేశారు. ఆపరేషన్ కోసమే బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. ఆయన వయసును కూడా పరిగణనలోకి తీసుకున్నాం, వఅద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు సహజం. దీనికి మెడికల్ బోర్డు ఎదుట హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సిఐడి చేసిన వాదన
ఆమోదయోగ్యంగా లేదు. ఇదే సమయంలో స్కిల్ కేసులో సిఐడి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యం బెయిల్‌కు అడ్డంకికాదు.
సుప్రీంకోర్టు తీర్పు చెప్పే వరకు బెయిల్ పిటిషన్‌ను విచారించవద్దని సిఐడి వాదించడం సబబు కాదు.
నిందితులపై నేరారోపణల తీవ్రత కంటే వాళ్ల ఆరోగ్యం ముఖ్యం. దర్యాప్తులో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలో మాత్రమే బాబు ఉన్నారు. పిటిషనర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు బెయిల్ మంజూరుకు యోగ్యులు. బెయిల్ మంజూరు చేసినప్పటికీ న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకునే ఆస్కారం ఏమాత్రం లేదు. సీఎంగా చేశారు. విపక్ష నేతగా ఉన్నారు, ప్రజలతో గట్టి సంబంధాలు ఉన్న వ్యక్తి . దేశం విడిచి పారిపోతారనేందుకు అస్కారమే లేదు. అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతే 4 వారాలపాటు బెయిల్ మంజూరు చేస్తున్నాం.' అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
- మద్యం కేసులో....
మద్యం కేసులో నిందితుడిగా ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును నవంబరు 28 వరకు అరెస్టు చేయబోమని హైకోర్టుకు సిఐడి హామీ ఇచ్చింది. చంద్రబాబును మూడో నిందితుడిగా చేర్చుతూ సిఐడి నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ స్కిల్ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మద్యం కేసులో అరెస్టు చేయాలనే కుట్రలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ వాదనను సిఐడి తరఫున ఎజి తోసిపుచ్చారు. దీంతో విచారణను నవంబరు 21కి హైకోర్టు వాయిదా వేసింది.










