Aug 02,2023 13:08
  •  జమ్మలమడుగు ఇసుక ఇతర నగరాలకు
  •  పిల్లల భవిష్యత్తుకు టిడిపికి ఓటేయండి
  •  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి జమ్మలమడుగు రూరల్‌ (కడప) : ప్రజలకు మేలు చేసే ఆలోచనల్లో జగన్‌ లేడని టిడిపి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక కోవెలకుంట రోడ్డు నుండి పాత బస్టాండ్‌ వరకు భూపేష్‌ రెడ్డితో కలిసి నారా చంద్రబాబు నాయుడు రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలు టిడిపి కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అంతకుముందు కోవెలకుంట రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో టిడిపి ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం12 గంటలకు రోడ్‌ షో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దబేరిని నంద్యాల జిల్లా నందికొట్కూరు నుంచి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వరకు 10 రోజులు 2500 కిలోమీటర్లు యుద్ధభేరి ఉంటుందన్నారు. జమ్మలమడుగులో భూపేష్‌ రెడ్డి రానున్న ఎన్నికల్లో టీడీపీని రెపరెపలాడిస్తాడన్నారు. భూపేష్‌ మీకోసం పనిచేస్తాడని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కోసం పని చేస్తాడని.. వచ్చే ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే చివరకు చికెన్‌ కోట్టులో కూడా వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. జమ్మలమడుగు టిడిపికి కంచుకోటని చేనేత కార్మికులు, అనేక వర్గాల వారు టిడిపి కోసం ఇక్కడ పనిచేశారన్నారు. తాను జమ్మలమడుగుకు సాగు నీరు ప్రాజెక్టుల కోసం రావడం జరిగిందన్నారు. జమ్మలమడుగు ఇసుక ఇతర నగరాలైన హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరుకు తరలిపోతుందని, అలాగే నాసిరకం మందులు అధిక ధరలకు అమ్మి వచ్చిన కలెక్షన్‌ అంతా తాడేపల్లికి పోతుందన్నారు. సీమ ప్రాజెక్టుల కోసం పన్నెండు వేల కోట్ల మేర పనులు చేస్తే జగన్‌ ముష్టి రెండు కోట్లే ఖర్చు చేశాడన్నారు. మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉందని 2024 ఎన్నికలలో మీ పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల కోసం మహాశక్తి కార్యక్రమం తీసుకువచ్చానని అందులో అమ్మకు వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు, ప్రతి ఆడ బిడ్డకు నెలకు 15 వందలు ఇస్తానని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2024లో భూపేష్‌ రెడ్డిని గెలిపించి జమ్మలమడుగు అభివృద్ధికి కారకులు కావాలన్నారు. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపిస్తానని, రైతుతో పాటు అందరినీ అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, శివ నాథ రెడ్డి, బిటెక్‌ రవి, సీఎం. సురేష్‌ నాయుడు, రామగోపాల్‌ రెడ్డి, టిడిపి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.