
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:స్కిల్ కేసుకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు గురువారం అస్వస్థతకు గురయ్యారు. రెండ్రోజుల క్రితం డిహైడ్రేషన్‌కు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం విధితమే. తాజాగా చర్మ సంబంధిత అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉక్కపోత, ఎండవేడిమి కారణంగా అలర్జీతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చర్మవ్యాధి వైద్య నిపుణులను పంపించాలని రాజమహేంద్రవరం జిజిహెచ్ సూపరింటెండెంట్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ లేఖ ద్వారా అభ్యర్ధించారు. అత్యవసరంగా పంపించాలని కోరడంతో ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌ను, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను జిజిహెచ్ అధికారులు కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు స్కిన్ అలర్జీ వచ్చినట్లు వైద్యులు సత్యనారాయణ, సునీత తెలిపారు. కొన్ని మెడిసిన్స్, లోషన్స్ వాడాలని సూచించినట్లు తెలిపారు. చంద్రబాబు అస్వస్థత నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లోనూ, కుటుంబ సభ్యులలోనూ ఆందోళన నెలకొంది.