- సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం విమర్శ
- రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం
ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు చేసే విధానం అప్రస్వామికంగా ఉందని రాష్ట్రంలో ప్రజా సంఘాలును, ప్రజా ఆందోళనను పోలీసులతో అణిచివేస్తున్నారని దీనిని అఖిలపక్షం ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక బాల చెరువు కాస్మో పాలిటిన్ క్లబ్బులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును అదేవిధంగా ప్రజా ఉద్యమాలపై ఉక్కుమాదం మోపుతున్న వైఖరికి నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతిల నవీన్, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం చాలా దారుణమన్నారు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం సిబి సిఐడి పనిచేస్తుందని వారు విమర్శించారు. ప్రజా వేదిక కూల్చడం ద్వారా కక్ష సాధింపుతో జగన్ పాలన ప్రారంభమైందని విమర్శించారు. ప్రజాస్వామ్యతంగా ఎన్నికై నియంతల పరిపాలన చేస్తున్నారన్నారు. వైసీపీని ఓడించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. జగన్ లాంటి నియంతకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ కేసు ఎత్తివేసే వరకు ప్రజా ఆందోళన కొనసాగుతుందని దీనికి సహకరిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు నవీన్, కొండబాబు అభినందనలు తెలియజేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలు పతనమవుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన ప్రజా ఉద్యమం రావలసిన అవసరం ఉందని అందుకు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. జనసేన జిల్లా అధ్యక్షులు తోట సుధీర్ మాట్లాడుతూ పరిపాలన దక్షకుడు చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తప్పుపడుతుందని ఆయన అన్నారు. టిడిపి ఉద్యమానికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ మోడీ జగన్ ఇద్దరు తోడుదొంగలుగా ప్రజాస్వామ్య మానవ హక్కుల్ని హరిస్తున్నారన్నారు. సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేష బాబ్జి మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమాలపై అణిచివేత ధోరణి అవలంబించారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసే విధానం రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని బాబ్జి అన్నారు. ఆర్‌పిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దళిత గిరిజన బలహీన వర్గాల పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. టిడిపి చేసే ఉద్యమాలకు ఆర్బిఐ పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందన్నారు. జై భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుతో న్యాయ వ్యవస్థ పై కూడా నమ్మకం పోయేలా ఉందన్నారు. అన్యాయం ఎక్కువ కాలం నడవదని చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని మల్లికార్జున రావు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు కష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలోనే ప్రజాస్వామ్యం మంటకలిసి పోతుందని మోడీ అధికారుల ఉన్నంతవరకు ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఉండవని మోడీ జగన్ ఇద్దరు కలిపే చంద్రబాబును అరెస్ట్ చేశారని కష్ణమూర్తి తెలియజేశారు. చివరగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోక ల ప్రసాద్ వందన సమర్పణ చేశారు. ఇంకా ఈ సమావేశంలో 93 కులాల ఐక్యవేదిక నాయకులు మాకిరెడ్డి గణేష్ బాబు, దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు చోల్లంగి వేణుగోపాల్, ఆర్టిఐ జేఏసీ పప్పు దుర్గా రమేష్, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కే బోడకొండ, సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజ శేకర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, టిడిపి నగర అధ్యక్షులు వీరు, తుమ్మలపల్లి రమేష్, జనసేన నాయకులు సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు తాళ్లూరి రాజు, పిఎస్ నారాయణ, పప్పు ఆదినారాయణ, గదుల సాయిబాబా, పనీశ్వరావు తదితరులు ప్రసంగించారు.










