Sep 10,2023 11:48

ఏడుస్తున్నానని ఎత్తుకుని
చందమామని చూపించింది అమ్మ
కాసేపు చూస్తూ మైమరిచాను
మళ్లీ రెట్టించి ఏడుస్తూ అదే కావాలన్నాను.
చందమామను తెచ్చిస్తానని
వాగ్దానం చేసింది అమ్మ.
పాలు తాగించేటప్పుడు..
బువ్వ తినిపించేటప్పుడు..
నిద్రపుచ్చేటప్పుడు..
ఉయ్యాల ఊపుతూ పాడేటప్పుడు..
కథలు చెప్పేటప్పుడు..
అన్నీ చందమామ గురించే చెప్పేది అమ్మ..

బడికి పంపాక..
పాఠ్య పుస్తకంలో చందమామని చూశాను
ఇదిగిదిగో చందమామ అన్నాను
ఆనందంగా..
అమ్మ మురిసిపోతూ..
అందుకున్నావు చందమామని అంది..
చందమామలో మచ్చలేమిటని అడిగాను..
అవ్వ చెట్టుకింద గారెలు వండుతోంది..
అని కథ చెప్పింది..
మరికొంచెం పెద్దయ్యాక అడిగాను..
లేడి పరిగెత్తుతోంది అని మరో కథ చెప్పింది..
చంద్రునికి ఎన్ని మచ్చలో అనుకున్నాను..

మరికాస్త పెద్దయ్యాక..
ఇప్పుడు చంద్రయాన్‌ 3 వెళ్లడం..
విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ గురించి వినడం..
భలే ఆనందం వేసింది..
నిజంగా చందమామని
నేనే అందుకున్నంత సంబరం కలిగింది.
ప్రపంచం అంతా నా దేశంవైపు చూస్తోంది.
ఆనందం అంబరాన్నే తాకింది..

అయితే.. ఇప్పుడు..
చంద్రునిపై మరో మచ్చ..
అది కథ కాదు.. కలత చెందేది..
చందమామ అందరిదీ కదా..
ఇప్పుడు నా బిడ్డకి నేను చెప్పే కథ
నాకే కన్నీరు తెప్పిస్తోంది.
చంద్రునిపై ఈ మచ్చ పడకూడదు.
చంద్రుని చూస్తూ పండు వెన్నెలలో నేను..
ప్రపంచానికి ఎలాంటి 'మచ్చా' లేకుండా
సమంగా పంచుతోంది..
ఇప్పుడు ఆ మచ్చ తుడిపేయాలి..
 

శాంతిశ్రీ
8333818985