Apr 02,2023 07:49

అవినీతిలో మునిగి
దోసుక తినుడు నేర్సినోడు
మన బతుకుల గురించెట్లా
ఆలోచన చేస్తడు...

చుట్టూరా పహరాలతో
గడీల ముళ్లు కట్టుకున్నోడు
మన క్షేమం గురించెట్లా
ఆరాట పడ్తడు...

గుండె మీద కాలేసి తొక్కుతూ
అరిస్తే సంపుతాననేటోడు
మన హక్కుల గురించెట్లా
బాధ్యత పడ్తడు...

భ్రమలు భయాలు వీడుదాం
ఇంకా ఇంకా మనమే మారుదం
చెల్లా చెదురైన ప్రాణాలం
ఒక్క గూటికి చేరుదాం...

చరిత్ర పాఠాల్లోని అమరుల
త్యాగాల మళ్ల యాది జేసుకొని
ఆ ధైర్యాల్ని ఆహ్వానిద్దాం
మార్కుల కొరకు పోగేసిన
అక్షరాల సమాజ మార్పుకు
సరికొత్త సాళ్లుగా దిద్దుదాం

సావనీయకు ప్రాణాన్ని
బ్రతుకు కొరకే పోరాటం
పోరాడేందుకే బ్రతుకు
'చెర' మాట యాది జేసుకో
'యువతరమా.. దేశానికి
కండ్లు నీవే కాళ్లు నీవే'

అమృతరాజ్‌
95050 94032