Sep 18,2022 07:02

హైదరాబాద్‌ను కోల్పోయినందున విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన విద్యావకాశాల లక్ష్యంతో కేంద్ర విద్యా సంస్థలు నెలకొల్పాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించారు. చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేసి తీరతామని కేంద్ర బిజెపి హామీ ఇచ్చింది. ఎనిమిదేళ్లుగా తానే అధికారంలో ఉండి కూడా విద్యా సంస్థల ఏర్పాటును విస్మరించింది. అరకొర నిధులతో, అద్దె భవనాల్లో, చాలీచాలని వసతులతో కాలం వెళ్లదీసే దుర్గతి పట్టించింది. పూర్తి స్థాయి వసతులతో శాశ్వత భవన నిర్మాణాలు ఎన్నటికి అందుబాటులోకి వస్తాయో చెప్పడం కష్టం.
ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో విభజన చట్టం షెడ్యూలు 11లో కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సుమారు 11 సంస్థల ఏర్పాటుకు అప్పటి పార్లమెంటు ఆమోదించింది. దీనికిగాను రూ. 11,672 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కానీ 2022 ఆర్థిక సంవత్సరం మొదలయ్యే నాటికి వచ్చింది రూ.1600 కోట్లు మాత్రమే. అంటే 2014లో విభజన చట్టం రాగా, ఎనిమిదేళ్లలో రూ.1600 కోట్లు వెచ్చించారు. ఏడాదికి సుమారుగా రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది. ఆ ప్రకారం మొత్తం రూ.11,672 కోట్లు రావాలంటే 58 సంవత్సరాలు పడుతుంది.
అద్దె భవనాల్లో కాలక్షేపం
ఇప్పటికి పది సంస్థలు ప్రారంభించారు. ఒకటీ రెండు మినహా మిగిలినవన్నీ అద్దె భవనాలు, లేదా స్థానిక యూనివర్శిటీ ప్రాంగణాల్లో తాత్కాలికంగా ఏర్పాటయ్యాయి. వీటన్నిటికీ కలిపి పలు విడతల్లో రూ.1600 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది కేంద్రం. ఆ నిధులు కాస్తా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల చుట్టూ ప్రహరీగోడలు కట్టడం, ప్రైవేటు భవనాలకు అద్దెలు కట్టడం, సిబ్బంది జీతభత్యాలు, తాత్కాలిక ఖర్చులకు సరిపోయాయి. ప్రారంభించిన పది సంస్థల్లోనూ ఇప్పటికీ పూర్తిస్థాయిలో సిబ్బందినిగానీ, ఉద్యోగులనుగానీ, ఫ్యాకల్టీలనుగానీ నియమించలేదు. అనంతపురం సెంట్రల్‌ యూనివర్శిటీ కనీస సదుపాయాలకు దూరంగా ఉంది. వెనుకబడ్డ ప్రాంతాన్ని ప్రాధాన్యతగా తీసుకొని, ఏర్పాటు చేయాల్సిన ఈ సంస్థను అలా వదిలేసింది. మంగళగిరిలో ప్రారంభించిన ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) లో ఇంతవరకు ఇన్‌పేషెంట్‌ విభాగం లేదు. విజయనగరంలో ప్రారంభించిన గిరిజన యూనివర్శిటీకి వసతులుగానీ, భవనాలుగానీ ఏర్పాటు చేయలేదు. తాడేపల్లిగూడెం ఎన్‌ఐటి పరిస్థితీ అంతే. ఇవన్నీ 2023 నాటికి పూర్తిస్థాయిలో సొంత భవనాలు, సిబ్బందితో అందుబాటులోకి రావాల్సి ఉంది. మొత్తం విద్యాసంస్థల్లో ఐఐటి తిరుపతి, ఐఐటిడిఎంకి సొంత భవనాలు సమకూర్చుకుంది. అదీ పూర్తిస్థాయిలో కాదు ఐఐఎం విశాఖపట్నంలో తాత్కాలిక భవనాల్లో నడుస్తోంది. ఐఐటిల్లో అయితే తరగతి గదులు, హాస్టళ్ల సమస్య తీవ్రంగా ఉంది. పెట్రోలియం యూనివర్శిటీని కూడా ఆంధ్రా యూనివర్శిటీ భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. గుంటూరులో లాంలోని వ్యవసాయ యూనివర్శిటీకి నిధులు నామమాత్రంగా కేటాయించింది. విజయవాడలో ఏర్పాటు చేయదలుచుకున్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నూజివీడు ఐఐఐటిలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. యువత భవితకు ఉపయోగపడే దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెతను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాసంస్థల విషయంలో బిజెపి ప్రభుత్వం అక్షర సత్యం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రాన్ని నిలదీసి, విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాల్సి ఉండగా, లేఖలు రాసి చేతులు దులుపుకుంటోంది.
నెలకొల్పాల్సిన సంస్థలివే
11వ షెడ్యూల్లో పేర్కొన్న విద్యాసంస్థల్లో తిరుపతి ఐఐటి (3150 కోట్లు) ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (ఐఐఎస్‌ఇఆర్‌)-1613 కోట్లు) విశాఖపట్నంలో ఐఐఎం (691.58 కోట్లు), ఎన్‌ఐటి తాడేపల్లిగూడెం (460.50 కోట్లు), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైనింగ్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ఐఐటిడిఎం), కర్నూలు (747.77 కోట్లు), అనంతపురం సెంట్రల్‌ యూనివర్శిటీ (400 కోట్లు), విజయనగరంలో గిరిజన యూనివర్శిటీ (400 కోట్లు), గుంటూరు వ్యవసాయ యూనివర్శిటీ (1504కోట్లు), మంగళగిరి ఎయిమ్స్‌ (1618 కోట్లు), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, విజయవాడ (70.87 కోట్లు), విశాఖపట్నం పెట్రోలియం యూనివర్శిటీ (665 కోట్లు) ఉన్నాయి.

వల్లభనేని సురేష్‌