- విశాఖ స్టీల్ అమ్మకానికి అత్యుత్సాహం
- కడప స్టీల్‌కి మొండిచేయి
కేంద్రంలోని బిజెపి సర్కార్... కార్పొరేట్ల కోసం ప్రభుత్వ రంగంపై పగబట్టిన ప్రత్యర్థిలా కత్తి దూస్తోంది. నిత్యం వంచనలకు పాల్పడుతోంది. తెలుగు ప్రజలు తమ హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ను ప్రయివేటీకరించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. మరోవైపు విభజన చట్టంలో పేర్కొన్న కడపలో సమీకృత ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చర్యలపై నిరుత్సాహపర్చే పన్నాగం పన్నుతోంది. ఇది వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమకు బిజెపి తలపెట్టిన ద్రోహం.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ కుట్రలు కొనసాగుతుండగా.. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పట్టు సడలించకుండా కార్మికులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో మోడీ సర్కార్ దొంగ చాటున విశాఖ స్టీల్‌ను దెబ్బతీసేందుకు దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలోని రైల్‌వీల్ పరిశ్రమలో విశాఖ స్టీల్ చేత రూ.1500 కోట్లు బలవంతంగా పెట్టుబడులు పెట్టించిన మోడీ సర్కార్ ఇప్పుడు 400 'వందే భారత్' రైళ్ల చక్రాల కోసం చైనా కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో స్టీల్ ధరలు టన్ను రూ.45 వేలు నుంచి రూ.90 వేలకు పెరిగాయి. ఈ కాలంలో ఉత్పత్తి పెంచుకోనీయకుండా మోడీ సర్కార్ ఆంక్షలు విధించి విశాఖ స్టీల్ లాభాలకు గండి కొట్టింది. విశాఖ స్టీల్‌లో కొన్ని విభాగాలను పని చేయకుండా ఆంక్షలు విధించి ప్రయివేటీకరణ దిశగా కుయుక్తులు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం దాదాపు 20 నెలలుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు విధానాల్ని అడ్డుకోవటానికి కార్మికుల ముందున్న మార్గం ఒక్కటే. అది సమైక్య పోరాటాలతో ప్రభుత్వరంగ సంస్థలను రక్షించుకోవడం.
అనుకూలత లేదా ?
ఆరు నెలల్లోనే సెయిల్ నివేదిక సమర్పించాల్సివున్నా మోడీ సర్కార్ మీనమేషాలు లెక్కించింది. ఆఖరుకు 2018 డిసెంబరు 17న కడప స్టీలు ప్రాజెక్టుకు అనుకూలత లేదంటూ సెయిల్ నివేదిక ఇచ్చింది. అదే సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాలేదంటూ కప్పదాట్లకు పాల్పడిన కేంద్రం అనుకూలం లేదన్న పేరుతో ఆదిలోనే మోకాలడ్డింది. వాస్తవానికి కడపలో ప్రైవేటు రంగంలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు 2007లోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల సమీపంలో బ్రహ్మణి స్టీల్ పేరిట శంకుస్థాపన చేశారు. తదనంతర పరిణామాల్లో ఆ శిలాఫలకం కూడా కనుమరుగైంది. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన పదవీకాలం ముగిసే సయయంలో... 2018లో మరోచోట శంకుస్థాపన చేశారు. 2019 డిసెంబరు 13న జమ్మలమడుగు సమీపంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. కేంద్రం కట్టకపోయినా తాను కడతానన్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ, ఆచరణలో ఏమాత్రం పురోగతి లేదు. విశాఖ స్టీల్ ప్రభుత్వరంగంలో ఉన్నందున ఆ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందింది. అభివృద్ధిపరంగా, ఉద్యోగ, ఉపాధి పరంగా వెనకబడ్డ రాయలసీమలో ప్రభుత్వరంగంలో స్టీల్ ప్లాంట్ ఆ ప్రాంత యువత ఆకాంక్ష. ప్రస్తుతం కడప స్టీల్ ప్రాజెక్టు పరిస్థితి ఏంటంటే వైఎస్‌ఆర్ స్టీల్ కార్పొరేషన్ ప్రకారం.. 'ప్రాజెక్ట్ అండర్ కన్‌ట్రక్షన్'.. అంటే నిర్మాణంలో ఉన్నది! కడప ఉక్కుపై డొంక తిరుగుడు కడప స్టీలు విషయంలోనూ కేంద్రం తొండాట ఆడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రగతికి, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - 2014లో హామీ ఇచ్చారు. కడప స్టీలుకు సంబంధించి ఈ చట్టంలోని పార్ట్ 10లోని సెక్షన్ 93, దాంతో పాటు 13వ షెడ్యూలులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే కడప స్టీలు పరిశ్రమ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టమవుతుంది. ఈ చట్టంలో పార్ట్ 10 (మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ఆర్థిక చర్యలు)లో సెక్షన్ 93లో ఇలా ఉంది. 'విభజిత రాష్ట్రాల ప్రగతికి, అభివృద్ధికి చర్యలు : అప్పాయింటెడ్ డే (ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ) నుంచి 10 సంవత్సరాల కాలంలో విభజిత రాష్ట్రాల ప్రగతికి, సుస్థిర అభివృద్ధికి 13వ షెడ్యూలులో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అవసరమైన చర్యలన్నిటినీ చేపడుతుంది.'' 13వ షెడ్యూలులో మౌలిక సదుపాయాల విభాగంలో 3వ అంశంలో ఇలా పేర్కొన్నారు : ''ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లాలో సమీకృత ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 6 నెలల్లోగా సెయిల్ పరిశీలించాలి''.
బి. అమరనారాయణ










