Sep 20,2023 22:18

న్యూఢిల్లీ: భారత్‌-కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరు దేశాలు తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సలహాలు జారీ చేశాయి. కెనడాలోని భారత పౌరులు, విద్యార్థులు, అక్కడకు ప్రయాణించాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని బుధవారం భారత ప్రభుత్వం తన పౌరులను హెచ్చరించింది. భారత్‌లో ఉంటున్న కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని ట్రూడో ప్రభుత్వం సలహా జారీ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. 'కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ అండతో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తమ ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇండియా వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకిస్తున్న భారత ప్రజలను, మన దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాలంలో బెదిరింపులు వస్తున్నాయి. అందువల్ల అలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లద్దని కోరుతున్నాం' అని కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. 'కెనడాలోని భారత పౌరులను సంరక్షించేందుకు అక్కడి అధికారులతో భారత హైకమిషన్‌/కాన్సులేట్‌ జనరల్‌ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. అయినా.. ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్టా భారత పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెనడాలోని భారత పౌరులు ఒట్టావాలోని హైకమిషన్‌ లేదా టరంటో, వాంకోవర్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వద్ద తమ పేర్లను నమోదు చేసుకోండి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు మిమ్మల్ని వేగంగా సంప్రదించేందుకు వీలవుతుంది' అని తెలిపింది. ఖలిస్థానీ నాయకుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి.