Jul 18,2023 07:13

జనాభా లెక్కలు అంటే కేవలం మనుషుల సంఖ్య, స్త్రీ పురుష నిష్పత్తి మాత్రమే కాదు. ఏ యే ప్రాంతాల్లో ఎంత జనసాంద్రత ఉన్నది? వారి జీవన విధానాలు ఎలా ఉన్నాయి? ఏయే వృత్తులలో ఎంతమంది నిర్దిష్టంగా ఉన్నారు? నిత్యం పెరుగుతున్న వలసల కారణంగా ఏ యే ప్రాంతాలు, రంగాలు ప్రభావితం అవుతున్నాయి? క్రమం తప్పని నిర్దిష్టమైన ఆదాయాలు కలిగిన జనాభా ఏ ప్రాంతంలో ఉన్నది? పూర్తిగా అసంఘటితమైన జనాభా ఎక్కడ ఉన్నది? వారి వెనుకబాటు తనానికి కారణాలేమిటి? వంటి అనేక అంశాలను ఒడిసిపట్టినప్పుడే కదా కావలసిన దిశా నిర్దేశం చేసుకోవడానికి వీలుంటుంది.

         అన్ని వనరుల్లో మానవ వనరు అత్యంత ప్రధానమైనది. దానిని క్రమబద్ధీకరించుకోవడం ఎంతో అవసరం. మానవ వనరుకు సంబంధించిన దశ, దిశ ఎప్పటికప్పుడు స్థిరీకరించు కోవాలంటే దానికి సంబంధించిన సమాచారం క్రమం తప్పని విధంగా సర్వ జనుల కనుసన్నల్లో ఉండాల్సిందే. ఓ దశాబ్దం క్రితం నుండి 'ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌' అనే భావన బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాతి నుండి సంవత్సరానికి ఒకసారో లేదా డాక్టర్ల సూచన మేరకో మెడికల్‌ టెస్టులన్నీ చేయించుకుని ఏవైనా రుగ్మతలు తలెత్తే సంకేతాలు కనపడితే సరైన చికిత్స తీసుకుంటున్నాం. తద్వారా ఆయు:ప్రమాణాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నార. ఇలా ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వారిలో 90 శాతం మంది అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాల నుండి బయట పడుతున్నారట! నిజానికి మోటార్‌ వెహికల్స్‌ సర్వీసింగ్‌కు సంబంధించినంత ఫాలోఅప్‌ మనుషుల ఆరోగ్యానికి లేదు. అలా ఒక క్రమబద్ధమైన పర్యవేక్షణ ఉంటే ఆయు:వృద్ధితో పాటు జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఇదే రకమైన అంశాన్ని దేశానికి వర్తింపజేస్తే ప్రతిఫలాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. కనీసం పదేళ్లకోసారైనా దేశ జనాభాకు సంబంధించిన గణాంకాలన్నీ సేకరించకపోతే భవిష్య ప్రణాళికలు, పథకాలు, విధానాలు, దిద్దుబాటు చర్యలు వంటివన్నీ ఎలా రూపొందించుకుంటాం? కానీ ఈ అంశంపై కేంద్ర పాలనాధికార వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తున్న సంకేతం కనిపిస్తున్నది. రిజిస్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తాజా ఉత్తర్వుల ప్రకారం 2024 జనవరి 1వ తేదీ వరకు అడ్మినిస్ట్రేటివ్‌ బౌండరీలన్నింటిని తటస్థీకరిస్తున్నట్లు (ఫ్రీజ్‌) ప్రకటించారు. దీంతో ఆ తేదీ వరకు ఏ రకమైన జనాభా లెక్కల ప్రక్రియ మొదలు కాదని అర్థమైంది. 2020లో జరగవలసిన జనాభా లెక్కలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేయబడ్డవి. అయితే ఇదే సమయంలో జనాభా లెక్కలు పూర్తి చేయవలసి ఉన్న అమెరికా, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలు ఆ పనిని ఇప్పటికే పూర్తిచేశాయి. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ 2022లో జనగణన పూర్తి చేసింది. 1979లో చివరిసారిగా జనాభా లెక్కలు నిర్వహించిన ఆఫ్ఘనిస్తాన్‌ లాంటి అస్తవ్యస్తమైన దేశం తప్ప చాలా దేశాలు ఆ ప్రక్రియను పూర్తి చేశాయి.
           భారత్‌ యువత ఎక్కువగా ఉన్న దేశమని చెప్పుకుంటున్నాం. కానీ అనేక స్వచ్ఛంద సంస్థల నివేదికల ద్వారా సమాజంలోని వివిధ అంశాలలో ఆందోళన కలిగించే వాస్తవాలు బయట పడుతున్నాయి. ఉదాహరణకు పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం, వయసుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు మించిన రోగాల బారినపడడం, నాణ్యమైన విద్యా ప్రమాణాలు గ్రామీణ భారతంలో పూర్తిగా పడిపోవడం, సంతానోత్పత్తి రేటు, వృద్ధాప్య సంరక్షణ వంటివన్నీ ఉన్నాయి. జనాభా లెక్కలు అంటే కేవలం మనుషుల సంఖ్య, స్త్రీ పురుష నిష్పత్తి మాత్రమే కాదు. ఏ యే ప్రాంతాల్లో ఎంత జనసాంద్రత ఉన్నది? వారి జీవన విధానాలు ఎలా ఉన్నాయి? ఏయే వృత్తులలో ఎంతమంది నిర్దిష్టంగా ఉన్నారు? నిత్యం పెరుగుతున్న వలసల కారణంగా ఏ యే ప్రాంతాలు, రంగాలు ప్రభావితం అవుతున్నాయి? క్రమం తప్పని నిర్దిష్టమైన ఆదాయాలు కలిగిన జనాభా ఏ ప్రాంతంలో ఉన్నది? పూర్తిగా అసంఘటితమైన జనాభా ఎక్కడ ఉన్నది? వారి వెనుకబాటుతనానికి కారణాలేమిటి? వంటి అనేక అంశాలను ఒడిసిపట్టినప్పుడే కదా కావలసిన దిశా నిర్దేశం చేసుకోవడానికి వీలుంటుంది. వృద్ధులు, వితంతువులు, అనాథలు, స్పెషల్‌ చిల్డ్రన్‌గా పిలువబడే వారి సమాచారం లేకుండా రాష్ట్రాలు సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుపరచలేవు. ఈ జనాభా లెక్కల సమాచారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు అనేక విభాగాలకు, సంస్థలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏయే ప్రాంతాలలో ఏ వయసు వారికి ఏ విధమైన వస్తు సేవల అవసరాలు ఎక్కడెక్కడ ఎంత మోతాదులో ఉన్నాయి? అనే అంశాలు ముందస్తుగానే తెలిస్తే కావలసిన విధంగా సంస్థలను నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పెట్టుబడి మాదిరిగా మానవ వనరు కూడా ఒక చోట స్థిరంగా ఉండటం లేదు. అంచేత కాకి లెక్కలు కాకుండా కచ్చితమైన వివరాలుంటే, పోలీసు వ్యవస్థకు కూడా చాలా వెసులుబాటు వుంటుంది.
         భారత దేశంలో జనాభా లెక్కలు 1881లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి నిరాఘాటంగా కొనసాగిన ఈ ప్రక్రియ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఆగిపోలేదు. అలాంటిది ఇప్పుడు తాత్సారం చేయబడుతున్నది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయింది, జనాభా లెక్కల సేకరణకు కావలసినంత యంత్రాంగం ఉన్నప్పటికీ కేంద్ర అధికార సంస్థలు వెనకడుగు వేయడానికి కేవలం రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. జనాభా లెక్కల గడువు ఏర్పడిన తర్వాత సేకరించవలసిన వివరాలపై వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వివరాలను గత 70 ఏళ్ల కిందట మాత్రమే నమోదు చేశారు. ఆ తర్వాతి కాలాలలో దానిని విస్మరించారు. అంచేత ఇప్పుడు వెనుకబడిన తరగతుల, వివిధ ప్రాంతాల, కులాలకు సంబంధించిన డేటా సేకరించాలని అనేక రాజకీయ పార్టీలు పట్టుబట్టాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన రిజర్వేషన్లు, నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. వీటిల్లో సమతుల్యత సాధించాలన్నా జనాభా లెక్కల వివరాలుండాలి. ''ఒకరు డిమాండ్‌ చేస్తే మేమెందుకు చేయాలి?'' అన్న ధోరణితో దానిని నిరాకరించడమే గాక జనాభా లెక్కల సేకరణని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇది చాలా తప్పు. ''ఈ దేశంలో కుల వ్యవస్థ ద్వారా నిర్మితమైన ఆర్థిక జరుగుబాటు ఉన్నది, అందుచేత వీలైనంత మేరకు సమాజంలో ఏ రకమైన అంతరాలు వున్నాయో తెలుసుకుంటే వాటికి పరిష్కారాలు కనుక్కోవడం సులభం'' అని మాజీ దౌత్యవేత్త, రచయిత పవన్‌ కుమార్‌ వర్మ అభిప్రాయపడ్డారు. భూమి, ఉత్పత్తి కారకాలు ఇప్పటికీ కొందరి చేతిలోనే బంధీ అయిన సందర్భంలో ఇలాంటి గణాంకాలు సేకరించడం వల్ల పరిపాలనకు సౌలభ్యం ఏర్పడుతుంది. కానీ ఇలాంటి లెక్కలు సేకరించిన తర్వాత బయటపడిన వాస్తవాలు రాజకీయంగా కొందరికి తిరోగమన ఫలితాలు ఇస్తాయేమోనన్న భయం పాలకులను వెంటాడుతున్నట్లుంది. ఆదివాసీలు, గిరిజనుల రాజకీయ ప్రభావం ఈ మధ్య కాలంలో పెరిగింది. వారికి సంబంధించిన వివరాల్లో మార్పులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయోనన్న భయమూ ఓ కారణమే! మన దేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని చెప్పుకుంటున్నారు పాలకులు. కాని అస్థిత్వ సమీకరణల ప్రజాస్వామ్యంగా ఏనాడో మార్చేశారు. ఎన్నికలకు ముందు రెండేళ్ల నుండే సమీకరణల ఆధారంగా పాలన సాగిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యమెలా అవుతుంది? లింగ, కుల, మత, ప్రాంతాల వారీగా ఎవరెవరి ఆర్థిక స్థోమతలేవో తెలిపే సాధనం ఈ జనగణన ప్రక్రియ. జనాభా లెక్కలు సేకరించకుండానే-ఫలానా మతం వారు బహు భార్యత్వాన్ని పాటిస్తూ వారి జనాభాను విపరీతంగా పెంచుకుంటున్నారు-అనే సంకేతాలిస్తూ, కొన్ని జాతులను, మతాలను మినహాయిస్తూనే ఉమ్మడి పౌర స్మృతి ప్రస్తావనను ముందుకు తేవడం విచారకరం. క్రమం తప్పని జనగణన చేయకపోవడం దేశానికి అపకారం తలపెట్టడంతో సమానం. కారణాలేవైనా దీనికి ఒడిగట్టడం నేరం.

- జి. తిరుపతయ్య,
సెల్‌ : 9951300016