Oct 16,2022 07:51

'చేమాకు పై నీటిబొట్టు' అన్నట్టు వినలేదు గానీ తామరాకు పైన నీటిబొట్టు ఎలా నిలబడదో చేమాకు పైనా నీటి చుక్క నిలవదు. అంత నునుపుగా చమక్కులీనుతూ ఉంటుంది లేత చేమాకు. హృదయాకారంలో ఉండి, తామరాకును పోలి ఉంటుంది. దీని శాస్త్రీయ నామం కొలకేసియా ఎస్కులెంటా. దీనిలో ఎ,సి విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌-ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ట్రై గ్లిజరైడ్స్‌ను విచ్ఛిన్నం చేసి, కొలెస్ట్రాల్‌ను నిరోధించే కారకాలున్నాయి చేమాకులో. కాన్సర్‌ కారకాలనూ అడ్డుకుంటుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న చేమాకును రుచుల రూపంలో చవిచూద్దామా!
పొట్లాలు

potlam

కావలసిన పదార్థాలు: శనగపిండి-1/4 కేజీ, ఉల్లిపాయలు-మీడియం సైజువి 2, పచ్చిమిర్చి-2, నూనె-వేయించడానికి సరిపోయినంత, కరివేపాకు-2 రెబ్బలు, ఉప్పు-తగినంత, కారం-1/2 స్పూను, పసుపు-1/4 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌-స్పూను, ధనియాల పొడి-స్పూను, జీరా పొడి-1/2 స్పూను
తయారీ: నూనె కాక పైన చెప్పిన పదార్థాలన్నింటినీ నీటితో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. శుభ్రంగా కడిగిన చేమాకు మధ్యలో పిండిని తట్టినట్లుగా అని, ఆకును నాలుగువైపులా పిండి మీదకి మడిచి.. ఊడిపోకుండా దారంతో కానీ, చేమాకు కాడల నుండి తీసిన పీచులతో కానీ కట్టి, ముడి వేయాలి. పాన్‌పై రెండు స్పూన్ల నూనె వేడి చేసి, ఈ పొట్లాలను రెండువైపులా తిప్పుతూ రంగు మారే వరకూ వేయించుకోవాలి. (ఇలాగే కాకుండా డీప్‌ ఫ్రై కూడా చేసుకోవచ్చు)
పకోడీ

pakodi


కావలసిన పదార్థాలు: శనగపిండి-1/4 కేజీ, చేమాకులు-5, ఉల్లిపాయలు-మీడియం సైజువి 2, పచ్చిమిర్చి-2, నూనె-వేయించడానికి సరిపోయినంత, కరివేపాకు-2 రెబ్బలు, ఉప్పు-తగినంత, కారం-1/2 స్పూను, పసుపు-1/4 స్పూను, వంటసోడా-చిటికెడు, జీర-1/2 స్పూను
తయారీ: శనగపిండి, చిన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చి, సన్నగా, నిలువుగా కట్‌ చేసిన ఉల్లిపాయలు, చీలికలుగా కట్‌ చేసిన చేమాకు, కరివేపాకు-2 రెబ్బలు, ఉప్పు-తగినంత, కారం-1/2 స్పూను, పసుపు-1/4 స్పూను, వంటసోడా-చిటికెడు, జీర-1/2 స్పూను అన్నింటినీ అవసరమైతే నీటిని చల్లుకుంటూ పకోడీ వేయడానికి వీలుగా కలుపుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి, ఈ పిండిని పకోడీలా వేసుకొని తిప్పుతూ గోల్డెన్‌ కలర్‌ వచ్చే వరకూ వేయించుకోవాలి.
పప్పు

pappu

కావలసినపదార్థాలు: కందిపప్పు-కప్పు, చేమాకు (లేతవి)-5,6 టమోటాలు-2, ఉల్లిపాయ, పచ్చిమిర్చి-4, కరివేపాకు-2 రెబ్బలు, ఉప్పు-తగినంత, కారం-స్పూను, పసుపు-1/4 స్పూను
తయారీ : కందిపప్పు శుభ్రం చేసుకుని ఉడికించాలి. మీడియంగా ఉడికిన పప్పులో తరిగిన చేమాకు, టమోటా, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు, కారం వేసి మరికొంచెం నీరుపోసి ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తరువాత ఉప్పు వేసి మెదిపి, పోపు పెట్టుకోవాలి.
(కుక్కర్‌లో అయితే ఉప్పును మినహాయించి మిగిలిన అన్ని పదార్థాలను ఒక్కసారే ఉడికించుకుని.. ఉప్పు కలిపి మెదిపి, పోపు పెట్టుకోవాలి.)
కూర..

kura


కావలసిన పదార్థాలు : చేమ ఆకులు-6, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-4, నూనె-4 స్పూన్లు, కరివేపాకు-2 రెబ్బలు, ఉప్పు-తగినంత, కారం-స్పూను, పసుపు-1/4 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌-స్పూను
తయారీ: బాండీలో నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేగిన తరువాత ఉల్లి తరుగు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు దోరగా వేయించాలి. పసుపు, అల్లంవెల్ల్లుల్లి పేస్ట్‌ వేసి 2ని. పాటు వేయించి తరిగిన ఆకు, ఉప్పు, కారం వేసి అంతా కలిసేలా తిప్పి మూతపెట్టి ఉడికించాలి. బాగా మెత్తగా ఉడికిన తరువాత స్టౌ ఆఫ్‌ చేసి, వేరే గిన్నెలోకి మార్చుకోవాలి.