Jun 26,2022 13:49

బుడిబుడి నడకలప్పుడు తాతయ్య ఆసరాతో
ఈ చెలియలి కట్ట మీదికి చేరినప్పటి నుంచి,
ఇప్పటిదాకా ఈ కట్టలో ఏ మార్పు లేదు.
నిరంతర పరిణామ క్రమంలో
ఓడలు బళ్లు, బళ్లు ఓడ లైనా
చెక్కుచెదరలేదు చెలియలికట్ట.

పడమటి గాలులప్పుడు
కట్ట మీది రేణువులన్నీ సముద్రంలోకి జారిపోయినా
ఈ కట్ట నిరంతరం పునర్‌ ఉత్తాన అవుతూనే ఉంది.

సముద్రానికి ప్రకృతి ఏర్పరచిన హద్దుని
తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తూనే ఉంటాయి.
కడుపులో దాచుకున్న బడబానలాన్ని
ఎన్నిసార్లు బహిర్గతం చేసినా చెలియలి కట్ట దాటదే..!
తుఫాన్లతో అతలాకుతలమౌతున్నా చెక్కుచెదరదే..!
రొయ్యల చెరువులు చుట్టూ మొలిచినా
అస్తిత్వాన్ని మార్చుకోదే..!
తలుచుకుంటే సాగరానికీ చెలియలికట్ట హద్దే కాదు.
అయినా ప్రకృతి నియమాన్ని పాటిస్తుంది.
ఇలాంటి హద్దే మనిషికీ ఉంటే ఎంత బాగుండు.
తాడు బొంగరం లేకున్నా
ప్రకృతిని ఒడిసిపట్టి
గుప్పిట్లో బంధించాలి అనుకుంటాడు.
సహజ సంపదల్ని దోచేసి
సమతుల్యతను దెబ్బతీసి
మనుగడకే ఎసరు పెట్టుకుంటాడు.
అందుకే కాల ప్రవాహాలకు ఎదురు నిలిచే
ఈ చెలియలి కట్ట అంటే నాకెంతో ఇష్టం.
తరాలు మారినా
ఈ కట్ట ఇలాగే నిత్యనూతనం అవ్వాలని కోరుకుంటున్నా.

ఆవుల. వెంకటరమణ
94940 88110