
ఎలమర్రూ ! ఎలమర్రూ! ఓ తెలుగు గ్రామం/ అదేమిటి నీ పేరు గుండెల్లో బాణం /మా కళ్లల్లో కారం! నీ పేగుల్లో గాలం! / ఇదేమిటి ఎలమర్రూ నీ పేరే ద్రోహం! /ప్రమాదం, అపాయం, పేరులేని ఘోరం ...అంటూ 1951 డిసెంబర్‌లో సరోజినీదేవి సోదరుడు విజయవాడ తొలి పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కాకముందే హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయ రాసి మహాకవి శ్రీశ్రీ తర్జుమా చేసిన గేయం ప్రారంభ చరణాలివి.
1949 జులై 14న కృష్ణా జిల్లా ఎలమర్రు లోనూ, 16వ తేదీన కాటూరు గ్రామంలోనూ సభ్య సమాజం తల దించుకునేట్లుగా పళినియప్పన్ నాయకత్వం లోని పోలీసు దళాలు చేసిన రాక్షస కృత్యాల గూర్చి విని ప్రపంచమంతా నివ్వెరపోయింది.
16వ తేది తెల్లవారుజామున ఐదారు వందల మంది పోలీసులు కాటూరు గ్రామాన్ని చుట్టుముట్టారు. కనిపించిన ప్రతి మగవాణ్ణీ పట్టుకొని, తన్నుకుంటూ వీధులవెంట నడిపించి ఒక ప్రదేశానికి చేర్చారు. అంతకుముందు రాత్రి వర్షం కురిసి బజారులన్నీ బురదమయంగా వున్నాయి. ఇలా 2 వేలకు పైగా మగవాళ్ళని చేర్చి వాళ్లను మూడు సమూహాలుగా విభజించి అందులో 350 మందిని వందల సంఖ్యలో వున్న పోలీసులు కర్రలతో బాదారు. ఈ బాదుడు ఎంత తీవ్రంగా వుందంటే వాళ్ళ దగ్గరున్న లాఠీలు కాక రెండు బళ్ల ములుగర్రలు విరిగిపోయాయి. ఆ బాదుడుకు స్పృహ తప్పి పడిపోతున్న వారిని దిగంబరులుగా చేశారు. సిగ్గుతో మర్యాదను కాపాడుకోవటానికి ప్రయత్నించిన వారిని చేతులు విరిగిందాకా కొట్టారు.
వాళ్లను వరుసలుగా నిలబెట్టి వారి వెనుక ఆడవాళ్లను (తల్లుల్ని, పిల్లల్ని) తీసుకొచ్చి నిలబెట్టారు. మిగిలిన జనాన్ని కూడా కొట్టి వారి వెనుక నిలబెట్టారు. ఈ దిగంబరుల ఊరేగింపు మూడు గంటలసేపు గ్రామమంతా తిప్పుతూ సాగించారు. ఈ సమయమంతా చేతులు పైకెత్తించి ఒక్కర్ని కూడా చేతులు దించనివ్వలేదు. ''పోలీసులకు జై'' ''గాంధీకి జై'' అని అనమని కొట్టి అనిపించారు. చివరకు ఊరి మధ్య వున్న గాంధీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మధ్యాహ్నం 3 గంటలకు వదిలేశారు. ఎలమర్రులో కూడా కుడి ఎడంగా ఇలాగే జరిగింది.
ఈ అమానుష కాండ సాక్షాత్తు కాంగ్రెసు ప్రభుత్వం టంగుటూరి ప్రకాశం గారి ముఖ్యమంత్రిత్వం లోనే జరిగింది. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభలో ఈ దుశ్చర్యని ఖండిస్తూ సంపాదకీయం రాయటమే గాక ''ఈ దౌర్జన్యాలు జరిగి వుండకపోవచ్చు. ఇది కమ్యూనిస్టుల దుష్ప్రచారం కావచ్చ''న్న మంత్రి మాధవమీనన్ చెప్పిన విషయం సరికాదని...తమ కార్యాలయానికి ఈ భోగట్టా తెలిపిన వారందరూ కాంగ్రెసువాదులే అని...ఆ గ్రామంకెళ్లి విచారించిన మీదటనే అలా రాశారని నార్ల రాశారు. ఈ చర్యల ఫలితం కమ్యూనిస్టుల్ని అణచివేయటానికి తోడ్పడకపోగా కాంగ్రెసు సంస్థపై జుగుప్స పుట్టిస్తుందని ఆయన వాపోయారు. కాంగ్రెసు ప్రభుత్వంపై భక్తి పెరగకపోగా బ్రిటీష్ రాజ్యమే మెరుగనే భావన ప్రజలకు కలగవచ్చని కూడా ఆయన హెచ్చరించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోవకపోవచ్చు. కాని ప్రాణాన్ని మించిన మానాన్ని చాలామంది స్త్రీ పురుషులు కోల్పోవాల్సి వచ్చింది. కమ్యూనిస్టు వ్యతిరేకులంగా, కాంగ్రెసు సమర్ధకులుగా మేము ఈ విచారణ కోరుతున్నామన్నారు.
హింస వల్ల, పీడ వల్ల, హీనహేయ మాయ వల్ల/ ఖైదు వల్ల, కత్తి వల్ల, హత్యా సత్యాల వల్ల/గ్రామానికి గ్రామానికి గాయం చేయటం వల్ల /గ్రామీణుల మానాలను ఘాతం చేయటం వల్ల / నిరంకుశుల పరిపాలన నేల రాలటం తథ్యం/నరాంతకుల దురాగతం/ పరాస్తమవటం సత్యం/ తిరుగులేని ఈ సత్యం చరిత్ర చెప్పే పాఠం.
- చెరుకూరి సత్యనారాయణ