Oct 07,2023 21:41

జైపూర్‌ : రాజస్థాన్‌లోనూ కులగణన నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ ప్రకటించారు. జైపూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ వార్‌రూమ్‌లో రాజస్థాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (ఆర్‌పిసిసి) కోర్‌ కమిటీ కులగణన అంశంపై చర్చించింది. ఈ సమావేశంలో గెహ్లాట్‌తో పాటు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్జి సుఖ్‌జిందర్‌ రాంధావా, ఆర్‌పిసిసి అధ్యక్షులు గోవింద్‌ సింగ్‌ దోతస్రా, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం శుక్రవారం సాయంత్రం గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడారు. బీహార్‌ ప్రభుత్వం చేపట్టిన విధంగానే రాజస్థాన్‌ ప్రభుత్వం కులగణన నిర్వహిస్తుందని తెలిపారు. ఏ కులాల జనాభా ఎంత ఉందో తెలుసుకుంటే వారి కోసం మనం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలో తెలుసుకోవచ్చునని చెప్పారు. కులాల వారీగా పథకాలు సిద్ధం చేయడం ప్రభుత్వాలకు మరింత సులభతరమవుతుందని గెహ్లాట్‌ తెలిపారు.