Jun 19,2022 07:01

'నేటి జీవితపు ఉష్ణోగ్రతని కొలవడానికి ధర్మామీటరు ధనం. ఈ లోకంలో అన్నీ అమ్ముడుపోతూనే వున్నాయి. చదువు, సౌందర్యం, కళ, సాహిత్యం, శాస్త్రం, శ్రమ..అన్నీ. ప్రయాణం, పెళ్లి, యుద్ధం...ఏది చేయాలన్నా డబ్బే ప్రధానం' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఇందులో ఇప్పుడు క్రీడలను కూడా చేర్చాలి. ముఖ్యంగా క్రికెట్‌. తెల్లని దుస్తులతో జెంటిల్మెన్‌ గేమ్‌గా చెప్పుకునే క్రికెట్‌.. ఇప్పుడు అతి పెద్ద వ్యాపార క్రీడగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే...ఇదొక జెంటిల్మెన్‌ బిజినెస్‌. నిర్వాహకులకు కాసుల పంట పండిస్తోన్న ఆధునిక క్రీడ ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌. ఇది పుట్టిందే డబ్బు కోసం. దేశ దేశాల నుండి ఆటగాళ్లను రప్పించి... సంతలో మాదిరి వేలం వేసి, వారితో ఎడతెరిపి లేని క్రికెట్‌ ఆడించడం డబ్బు కోసమే. ఇది సాంప్రదాయ క్రికెట్‌కు ఆధునిక రూపం. 'నీరయితే నిమ్నానికి ప్రవహిస్తుంది. కానీ ధనం మాత్రం ఉన్నత క్షేత్రాలకి తప్ప ఇంకో చోటికి పారదు' అని మహాకవి అన్నట్లుగా...కళ్లు చెదిరే రీతిలో వేల కోట్ల రూపాయలు బిసిసిఐ ఖజానాకు చేరుతోంది. డిజిటల్‌, టీవీ ప్రసార హక్కుల కోసం ప్రముఖ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. గత ఐదేళ్లలో జరిగిన ఒక్కో ఐపీఎల్‌ మ్యాచ్‌ విలువ రూ.54.5 కోట్లు. రాబోయే ఐదు సీజన్లకు ఒక్కో మ్యాచ్‌ విలువ రూ.118 కోట్లు. అంటే... ఒక ఓవర్‌ (ఆరు బంతులు) విలువ రూ.2.95 కోట్లు కాగా, ఒక్కో బంతి విలువ ఏకంగా సుమారు రూ.50 లక్షలు. ఈ లెక్కన చూస్తే...క్రికెట్‌పై డబ్బు ప్రభావం ఏ మేరకు వుందో అర్థం చేసుకోవచ్చు.
     మన దేశంలో క్రికెట్‌ గురించి తెలిసినంతగా మిగతా ఆటల గురించి తెలియదు. మన దేశీయ క్రీడల గురించి అసలే తెలియదు. ఎవరు ఎన్ని సెంచరీలు చేశారు...ఎన్ని వికెట్లు తీశారో టకటకా చెప్పే యువకులు...మన దేశీయ క్రీడ హాకీ గురించి గానీ, దేశవాళీ క్రీడల గురించి గానీ అడిగితే నోరెళ్లబెడతారు. మన దేశంలో క్రికెట్‌ అంతగా వేళ్లూనుకుపోయింది. పల్లెటూళ్లలో సైతం క్రికెట్‌కు వున్న క్రేజ్‌... మిగతా ఆటలకు లేదంటే అతిశయోక్తి కాదు. టెస్టులు, వన్డేలతో మెల్లగా సాగుతున్న క్రికెట్‌ లోకి ఐపీఎల్‌ ఒక సునామీలా వచ్చింది. అప్పటికే డబ్బున్నవారి ఆటగా వెలుగొందే క్రికెట్‌ను వ్యాపార క్రీడగా మార్చేసింది. చివరకు ఐపీఎల్‌ ప్రసార హక్కుల వేలం సైతం ఒక సంచలనంగా మారింది. ఐపీఎల్‌ అంటే నిన్నా మొన్నటి వరకు పరుగుల వరద. ఫోర్లు, సిక్సుల సునామీ. ఈ సీజన్‌ నుంచి ఫోర్లు, సిక్సులతోపాటు కాసుల వరద కూడా. అమెరికా లోని నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌)ను అత్యంత ఖరీదైన ఆటగా చెబుతుంటారు. దాని ఒక్కో మ్యాచ్‌ విలువ రూ.133 కోట్లు. రాబోయే ఐదేళ్లకు రూ.48,390 కోట్ల ఆదాయాన్ని పొందనున్న ఐపీఎల్‌-16 ప్రతి మ్యాచ్‌ రూ.118 కోట్లు. దీంతో ఐపీఎల్‌ ఖరీదైన రెండో అతి పెద్ద క్రీడగా, కలర్‌ఫుల్‌ ఈవెంట్‌గా మారిపోయింది. కోవిడ్‌ మూలంగా గత రెండేళ్లుగా అన్ని రంగాలూ కుదేలయ్యాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయి. కానీ, ఐపీఎల్‌కు మాత్రం కరోనా అడ్డుకట్ట వేయలేకపోయింది. ప్రేక్షకులను స్టేడియంల లోకి అనుమతించకపోయినా... టీవీల్లో వీక్షించారు. దేశవ్యాప్తంగా సినిమా, ఓటీటీలు చతికిలబడితే, ఐపీఎల్‌ లాభాలతో దూసుకుపోయింది. ఒకప్పుడు స్వదేశానికే పరిమితమయ్యే ఆటగాళ్లు...ఒక్క సీజన్‌ ఐపీఎల్‌ ఆడితే చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 'డబ్బు గడించేవారికి ఆకలి దప్పులుండవ్‌' అంటాడు బుచ్చిబాబు. ఒక్కో వేలంలో ప్రతి ఆటగాడు గతంలో ఎన్నడూ లేనంత డబ్బును పొందుతున్నాడు. క్రికెట్‌ దేవుడి దగ్గర్నుంచి రంజీ ప్లేయర్‌ వరకూ ఐపీఎల్‌ ధన యజ్ఞంలో మునిగి తేలుతుంటే... కేంద్ర ప్రభుత్వం, మంత్రులు సైతం ఇందులో భాగస్వాములౌతున్నారు. ఈ జెంటిల్మెన్‌ గేమ్‌... రాబోయే రోజుల్లో అన్ని ఆటలనూ శాసించే పరిస్థితి రావొచ్చు.
     యువత వేలంవెర్రితో ఆటగాళ్లకు అందలం పడుతుంటే...బంతి విసరడం ఎలాగా, తిప్పడం ఎలాగా, దాన్ని బాదడం ఎలాగా... ఇత్యాది ఆలోచనలలో ఆటగాళ్లను ముంచేసి, వారినొక మర మనుషులుగా, డబ్బు ఉత్పత్తి చేసే యంత్రాలుగా మార్చివేసింది ఐపిఎల్‌. యువత కూడా మిగతా ఆటల కంటే కాసుల పంట పండించే క్రికెట్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో మిగతా దేశవాళీ క్రీడలన్నీ ఈ వ్యాపార క్రీడ క్రీనీడ లోకి నెట్టబడుతున్నాయి. దేశానికి బంగారు పతకాలు తెచ్చిపెట్టి, దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలనధిష్టింపజేసిన క్రీడలు, క్రీడాకారులు మసకబారిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం దేశ ప్రతిష్టను పెంచే పతకాల కంటే...ఐపీఎల్‌ ధన యజ్ఞం వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మిగతా క్రీడాకారుల్లో నైరాశ్యం అలముకుంటుంది. దేశవాళీ క్రీడలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడవచ్చు.