- డివల్యూషన్స్ పెంపు పేరిట 10 పథకాల్లో కోత
- పిఎఫ్‌ఎంఎస్‌లో డి-మ్యాపింగ్‌కు రాష్ట్ర నిర్ణయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో అమలు చేయాల్సిన అనేక పథకాలకు కేంద్రం మోకాలడ్డుతోంది. గత రెండేళ్లుగా 10 కీలక పథకాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ పథకాల అమలు రాష్ట్రంలో ఆగిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయా పథకాలను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పిఎఫ్‌ఎంఎస్) నుంచి డీ-మ్యాపింగ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. దేశ వ్యాప్తంగా అనేక పథకాలను కేంద్రం కొంత వాటా నిధులను భరిస్తూ అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత వాటా నిధులను భరించాల్సి ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పది పథకాలు దాదాపుగా నిలిచిపోయాయి. కేంద్రం నుంచి 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఈ పథకాలు ఒక్క పైసా కూడా రాలేదని ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిల్లో సర్వే పథకాలు, నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పంచాయితీరాజ్ రోడ్ల నిర్మాణం, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయసహాయం, జాతీయ గ్రామీణ లైవ్లీహుడ్ మిషన్ పథకంలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, అరగన్వాడీ భవనాల నిర్మాణం, అరగన్వాడీ సేవా శిక్షణ, కౌమారదశలో ఉన్న బాలికలకు పథకం, జాతీయ ఉపాథి హామీ పథకం కింద అంగన్వాడీ భవనాల నిర్మాణం ఉన్నాయి. ఇందులో గ్రామాల్లో రోడ్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఈ పథకాలకు నిధులు రాకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రాష్ట్రాల నుంచి వసూలు చేసే కేంద్ర పన్నుల్లో వాటాగా 31 శాతం వరకు నిధులను అన్ని రాష్ట్రాలకు పంపకాలు చేసేవారు.గత కొన్నేళ్లుగా ఈ వాటా మొత్తాన్ని 42 శాతానికి కేంద్రం పెంచుతూ, అనేక పథకాల్లో కోతలు పెడుతోంది. ఈ కోవలోనే పది పథకాలకు నిధులు రావడం లేదు. పెరిగిన వాటా నిధుల లాభం కన్నా పథకాల్లో కోతల వల్ల కలిగే నష్టమే అధికంగా ఉంటోందని ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పథకాలకు నిధులు రాకపోవడంతో వాటికి కేంద్ర పరిధిలోని పిఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం తొలగించాలని యోచిస్తున్నారు.










