'కారులో జోరుగా షికారు చేద్దమా... హాయి.. హాయిగా..!' అని పాటలు పాడుకుంటూ. ఈలలు వేసుకుంటూ ఝుమ్ అంటూ వెళ్లిపోతున్నారా.. ! అయితే కారు గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందండోరు.. అలా అయితే పది కాలాలపాటు కారులో హాయిగా ప్రయాణం చేయొచ్చు. ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు మనవైపు నుంచి జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.. ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..
- వాడకపోయినా టైర్లు మార్చాల్సిందేనా?
మనం కారును వాడినా, వాడకపోయినా, ఎక్కువ కిలోమీటర్లు తిరగకపోయినా మూడు, నాలుగేళ్లకు ఒకసారి టైర్లు మార్చుకోవాలి. అప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదాలు జరగవు. మనం కారుపై 10-20 కిలోమీటర్లు ప్రయాణం చేశామనుకోండి. సాధారణంగా టైరులో ఉండే గాలి పరమాణువుల పీడనం 30 నుంచి 35కు పెరుగుతుంది. ఆ పెరుగుదలను టైర్ తట్టుకోగలగాలి. అయితే కొత్త టైర్లలా మూడు నాలుగేళ్లు వాడేసిన టైర్లు ఆ పీడన పెరుగుదలను తీసుకోలేవు. అది మనం గుర్తించలేం. అలాంటి సమయంలో 80 కిలోమీటర్ల స్పీడ్ దాటిన తర్వాత పాత టైర్లు పేలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు అలా పేలిపోయిందో సాధారణంగా గుర్తించలేం. కానీ కారణం మాత్రం టైర్లు పాతబడి పోవడమే.
- హాజర్డ్ బటన్ ఎప్పుడు ఆన్ చేయాలి?
ఏ కారులోనైనా హాజర్డ్ (త్రికోణాకారపు) బటననేది కామన్‌గా ఉంటుంది. దీనిని ప్రమాదకరమైన పరిస్థితులు, పంక్చర్లు అయినప్పుడు అత్యవసరంగా రోడ్డు పక్కన ఆపాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. కానీ చాలా మంది కూడళ్లలో ఆపినప్పుడు కూడా దీన్ని వాడేస్తుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు హాజర్డ్ బటన్ వాడితే దాని ప్రాధాన్యం పోతుంది. హాజర్డ్ బటన్ వల్ల కారుకున్న నాలుగు లైట్లు ఆన్ అయ్యి బ్లింక్ అవుతూ ఉంటాయి. దీంతో ఎవరైనా మన కారును చూస్తే మనం ప్రమాదంలో ఉన్నామని గుర్తిస్తారు. దీనిని అత్యంత ముఖ్యమైన సమయాల్లో మాత్రమే వాడాలి.
- ఎయిర్ బ్యాగ్ ఉంటే సీట్ బెల్ట్ అవసరం లేదా?
ఎయిర్ బ్యాగ్‌ను సెకండరీ రెసిస్టెంట్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) అంటాం. ఫస్ట్ రెసిస్టెంట్ సిస్టం సీటు బెల్ట్. ప్రమాదం జరిగినప్పుడు మనం స్టీరింగ్ మీద పడతాం. ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే, అది బాంబుతో సమానం. అది మనకు మరింత ప్రమాదాన్ని తెస్తుంది. అదే సీటు బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా మనం సీటుకు ఆనుకునే ఉంటాం. అప్పుడు ఎయిర్ బ్యాగ్ మన మీదకు ఓపెన్ అవుతూ మెల్లగా వస్తుంది. దాని వలన రక్షణ కలుగుతుంది.
- పర్ఫ్యూమ్ ఉపయోగించవచ్చా?
పర్ఫ్యూమ్స్‌లో ఆల్కహాల్ కొద్ది మోతాదులో అయినా ఉంటుంది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు లోపల ఆక్సిజన్ కాస్త తక్కువే ఉంటుంది. ఆ ఆక్సిజన్‌కు ఈ పర్ఫ్యూమ్‌లోని ఆల్కహాల్ కలిసి రసాయన చర్య పొందితే, కారు లోపల శ్వాస ఇబ్బందులున్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పైగా కారులో అన్నీ ఎలక్ట్రిక్ భాగాలే ఉంటాయి. అగ్నిప్రమాదం జరిగితే పర్ఫ్యూమ్ దానిని మరింత పెంచుతుంది. అందుకే పర్ఫ్యూమ్ వాడకుండా ఉంటేనే మంచిది.
- ఫాగ్ ఏర్పడితే..
చల్లని సమయాల్లో, వర్షం పడినప్పుడు వాతావరణంలో మార్పులు అకస్మాత్తుగా వస్తాయి. అలాంటి సమయాల్లో కారులో ఉన్న ఉష్ణోగ్రతలకు, బయట ఉష్ణోగ్రతలకు మధ్య తేడా వల్ల విండో షీల్డ్ మీద, వెనుక అద్దం మీద ఫాగ్ ఏర్పడుతుంది. దానిని పోగొట్టాలంటే కారులో ఏసీ కొద్దిసేపు ఆన్‌లో ఉంచాలి. అలా చేస్తే ఫాగ్ తొందరగా తొలగిపోతుంది. అలాంటి వాతావరణంలో డ్రైవింగ్‌లో ఉంటే విండో గ్లాసెస్‌ను ఒకట్రెండు ఇంచులు కిందకు దించి వెళ్లగలిగితే ఫాగ్ ఏర్పడదు.
- గమ్యం చేరుకోగానే ఆపకూడదా..
ఒక 50 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేసిన తర్వాత కారును ఆపాల్సి వస్తే వెంటనే ఆపకూడదు. తప్పనిసరిగా రెండు నుంచి మూడు నిముషాలు ఇంజిన్ ఆన్‌లోనే ఉంచి, ఆ తర్వాత ఆపాలి. ఎందుకంటే ఆ సమయంలో కూడా
కారులోని ఉష్ణోగ్రతల కారణంగా లోపలున్న టర్బో ఛార్జర్స్, ఇతర పరికరాలు అన్ని కూడా ఒక్కసారిగా సాధారణ స్థితికి రాలేవు. అందుకే అవి సాధారణ స్థితికి రావడానికి కాస్త సమయం ఇచ్చి, అప్పుడు కారు ఇంజిన్ ఆపాలి. అప్పుడే ఇంజిన్‌లోని ఆయిల్స్ కూడా సాధారణ స్థితికి వచ్చి లూబ్రికేషన్ బాగా జరుగుతుంది.
- కారు ఎత్తు మారుతుందా?
కారులో ఎక్కే వారి సంఖ్యను బట్టి కారు ఎత్తులో స్వల్ప మార్పు వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఆ మార్పు ప్రకారం కారు లైట్ అడ్జెస్ట్ చేసుకోడానికి లెవెలర్ ఉంటుంది. ఆ లెవెలర్ అడ్జెస్ట్‌మెంట్ ఏంటంటే నలుగురు ఎక్కినప్పుడు హైబీం లైట్ ఓవర్ ల్యాప్ అయిపోయి, పైకి వెళ్లిపోతుంది. దీనిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ దీనిని అడ్జెస్ట్ చేసుకోడానికి లెవెలర్ వాడాలి. ఇది డ్రైవింగ్ చేస్తున్న వారికి ఎంత ముఖ్యమో, ఎదురుగా వస్తున్న వారికి కూడా అంతే ముఖ్యం. వారి కళ్లలో లైట్ పడకుండా, రోడ్డుపై లైట్ బౌన్స్ అయ్యేలా చేస్తుంది. ఈ లెవలర్ వల్ల ఇద్దరికీ మేలు జరుగుతుంది.
- హీట్ తగ్గించాలంటే..
ఎండలో పార్కు చేసిన కారులో హీట్ పెరుగుతుంది. కారు తీసే ముందు 'క్రాస్ విండోస్' ఓపెన్ చేయాలి. అంటే ముందువైపు లెఫ్ట్ డోర్ ఓపెన్ చేసి, వెనుక వైపు రైట్ డోర్ ఓపెన్ చేసి కాసేపు ఉంచితే... లోపలున్న వేడంతా వెళ్లిపోతుంది. ఈ టెక్నిక్ చాలా బాగా పని చేస్తుంది. అలాగే కారు స్టార్ట్ చేసే ముందు అద్దాలు దించి, కనీసం అర కిలోమీటరు డ్రైవ్ చేసి ఈలోపు బ్లోవర్ ఆన్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న వేడి బయటకు వెళ్లిపోతుంది. దాని తర్వాత ఏసీ వేసుకుంటే తొందరగా కూలింగ్ అవుతుంది. బ్లోయర్ ఆన్ చేసుకుని కొద్దిసేపటి తర్వాత ఏసీ ఆన్ చేయడమన్నది సరైన విధానం.
- డౌన్ రోడ్లపై కారును న్యూట్రల్ చేయొచ్చా?
ఎక్కడైనా డౌన్ రోడ్లు రాగానే ద్విచక్ర వాహనదారులు పెట్రోల్ పొదుపు చేయడం కోసం బండి ఇంజిన్‌ను ఆఫ్ చేస్తారు. కానీ కారుకు అలా చేయకూడదు. ఎందుకంటే కారును డౌన్ రోడ్లపై న్యూట్రల్ చేస్తే బండిపై మొత్తం నియంత్రణ కోల్పోతాం. డ్రైవింగ్‌లో ఎంత అనుభవం ఉన్నా కూడా అలా చేయడం తప్పు నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే గేర్ మార్చేటప్పుడు గేరుతో పాటు ఆటోమేటిక్ బ్రేకింగ్ కూడా జరిగేటట్లు ఏర్పాటు ఉంటుంది. ఘాట్ రోడ్లపై లేదా బాగా డౌన్ ఉన్న రోడ్లపై జర్నీ చేసేటప్పుడు ఈ సిస్టమ్ వలన కారు కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. అదే న్యూట్రల్ చేశామనుకోండి, బ్రేక్ కూడా పని చేయదు. అది ప్రమాదానికి దారి తీస్తుంది.
ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఎంచక్కా కారులో హాయిగా ప్రయాణం చేయొచ్చు మరి..