Apr 21,2023 07:34

పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కారణంగా పదేపదే ఏర్పడిన ప్రపంచ మాంద్యం సాధారణ ప్రజల జీవితాల్లో అస్థిరతను సృష్టించింది. ఉదారవాద ఆర్థిక చట్రంలో ఎవరికి ఉద్యోగం పోతుందో, జీతం ఎప్పుడు తగ్గుతుందో, రిటైర్మెంట్‌ తర్వాత పింఛను వస్తుందో లేదో.. లాంటి అనేక అంశాలతో ప్రయివేటు ఉద్యోగులే కాదు. ప్రభుత్వోద్యోగులు కూడా అల్లాడుతున్నారు. మార్క్స్‌ ప్రకారం, పెట్టుబడిదారీ విధానం ఇలాంటి సంక్షోభంలో మళ్లీ మళ్లీ పడుతుంటుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ వామపక్షాలే ఏకైక మార్గం.

        ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మాంద్యంలో ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో మూడు నాలుగు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధిక నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, బ్యాంకుల దివాళా, విలీనాలతో దాదాపు అన్ని దేశాలలో ఆర్థిక వృద్ధి నిలిచిపోయింది. ఇటీవల దివాలా తీసిన క్రెడిట్‌ సూయిస్‌ బ్యాంకును యుబిఎస్‌ బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంది. ప్రపంచం మరో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నది.
       పెట్టుబడిదారీ దేశమైన అమెరికా 2007-08 ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, దివాలా తీసిన బ్యాంకులను రక్షించడానికి ప్రభుత్వ ఖజానాను ఉపయోగించింది. ఆ సమయంలో లేమన్‌ బ్రదర్స్‌ వంటి ఆర్థిక సంస్థలు అమెరికాలో దివాళా తీశాయి. పోటీ మార్కెట్‌ను చేరుకోవడానికి, వడ్డీ రేటును తగ్గించడం ద్వారా గృహాలను కొనుగోలు చేయడానికి రుణాలిచ్చే విధానాన్ని చేపట్టారు. కానీ ఆ తర్వాత సెంట్రల్‌ బ్యాంక్‌ (ఫెడ్‌) వడ్డీ రేట్లను పెంచినప్పుడు, రుణగ్రహీతలు తిరిగి చెల్లించలేనందున ఆ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అన్నీ దివాలా తీశాయి. ప్రభుత్వ సహాయంతో పెట్టుబడి మూలధనం ఆదా చేయబడింది. ఆ విధంగా ఆర్థిక మాంద్య ఛాయలను ఎదుర్కొంది.
తాజాగా మళ్లీ బ్యాంకులు కుప్పకూలడం మొదలైంది. 167 ఏళ్ల స్విస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిస్‌ దివాలా తీసింది. ఆ బ్యాంక్‌ ప్రత్యర్థి అయిన యుబిఎస్‌ ఆ దివాలా తీసిన బ్యాంకును కొనుగోలు చేయవలసి వచ్చింది. దీనికి చెల్లించింది 300 కోట్ల యు.ఎస్‌ డాలర్ల కంటే ఎక్కువ. అయితే, క్రెడిట్‌ సూయిస్‌కి అందుకు అనేక రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. వాస్తవానికి, ఈ బ్యాంకుల కష్టాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. పెట్టుబడిదారులు తమ వాటాలను విక్రయించడానికి పోటీ పడటంతో స్టాక్‌ మార్కెట్‌ పతనమైంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా వుంది. కాబట్టి దివాలా తీయకుండా నిరోధించడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే బాధ్యత ప్రభుత్వ ఖజానా చేపడుతుందన్నమాట.
        2008 మాంద్యాన్ని అధిగమించక ముందే ప్రపంచం మొత్తం కోవిడ్‌ బారిన పడింది. ఒక హెచ్చరికగా, ప్రపంచం మొత్తం గృహ నిర్బంధంలోకి వెళ్లింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ స్తంభించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో (2020-21) అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు (వృద్ధి పరంగా) ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావాలను మనం ఇంకా చవిచూస్తూనే ఉన్నాం. ఖర్చు తగ్గింపు, వేతన కోతలు, పెరిగిన పని గంటలు మొదలైన వాటితో పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాల బాటలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నది. ప్రయివేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, ఆర్థిక సంస్థలు, బహుళజాతి ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయని ప్రతిరోజూ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. సహజంగానే, ప్రభుత్వం లేదా ఇతర మార్గాల ద్వారా ఉపాధిని పొందలేని ఈ కాలంలో, నిరుద్యోగిత రేటు పెరుగుతూనే ఉంది.
ఇందుకు భారత్‌ మినహాయింపు కాదు. వివిధ సంస్థలలో పనిచేస్తున్న అనేక మంది కోవిడ్‌ అనంతర కాలంలో ఉద్యోగాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు...తాము పని చేస్తున్న ప్రాంతాల నుంచి స్వంత ఊళ్లకు తిరిగి రావాల్సి వచ్చింది. తిండి కూడా తినకుండా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చింది. వారి దుస్థితిని తెలిపే ఈ విషాద చిత్రం మన స్మృతి పథంలో నిలిచిపోయింది. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించబడినప్పుడు వలస కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారు ఇంటికి తిరిగి రావడానికి తమ కుటుంబంతో కలిసి కాలినడకన వందల వేల కిలోమీటర్లు వెళ్లారు. చాలామంది తిరిగి రాలేదు. కొందరు రోడ్డు, రైలు మార్గంలో మృతి చెందారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని తాజా గణాంకాలు చెప్తున్నాయి. కోవిడ్‌ రాకముందు రాత్రికి రాత్రి చేపట్టిన పెద్ద నోట్ల రద్దు విధానం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ముఖ్యంగా అసంఘటిత రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎందుకంటే నగదుతో ఎక్కువగా పని ఇక్కడే జరుగుతుంది. ఉద్యోగావకాశాలు కూడా ఇక్కడే ఎక్కువ. దీంతో ప్రజలు ఉపాధి కోల్పోయారు. దీనికి జిఎస్‌టి విధానం అమలు కూడా తోడైంది. ఈ జిఎస్‌టి అమలు, పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎదురైన జంట షాక్‌లు మన ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి.
        కానీ ఆశ్చర్యంగా మార్కెట్‌లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. నిరుద్యోగం తీవ్రరూపం దాల్చింది. ప్రజల దగ్గర డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితిలో నిత్యావసర వస్తువులతో సహా అన్నింటి ధరలు ఎలా, ఎందుకు పెరిగాయన్నది ఆర్థికవేత్తలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. అర్థశాస్త్రం ప్రకారం ధరలు...సరఫరా, డిమాండ్‌ సమతుల్యత ద్వారా నిర్ణయించబడతాయి. నిరుద్యోగం కారణంగా డిమాండ్‌ తగ్గడమేగాని, పెరిగే అవకాశమే లేదు. డిమాండ్‌ పెరిగింది కాబట్టి సరుకుల ధరలు పెరిగాయని చెప్పలేము. సరఫరా తగ్గిందని అనలేము. కోవిడ్‌ అనంతర కాలంలో సప్లరు చైన్‌కు అవాంతరాలున్నా అవి చాలా నామమాత్రమేనని చెప్పాలి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలాన్ని సృష్టించింది. ముఖ్యంగా చమురు సరఫరా, ధర ఈ రెండూ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు హేతువులే. అయితే, పెట్టుబడిదారీ యజమానులు కూడా కోవిడ్‌ పరిస్థితి కారణంగా నష్టాలను భర్తీ చేయడానికి ధరలను పెంచేశారు. తద్వారా లాభాలను పోగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ రెపో రేటును పెంచే ద్రవ్య విధానాన్ని తీసుకుంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఇతర వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ఈ రేటు పెరిగినప్పుడు, వాణిజ్య బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచుతాయి. పెట్టుబడిదారులు అధిక వడ్డీ రేట్లకు రుణం తీసుకోవడానికి ఇష్టపడరు. డిమాండ్‌ తగ్గుతుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ఈ మార్గం మరొక ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, వడ్డీ రేట్లు మొదట పెరిగేకొద్దీ, ఇంతకు ముందు తక్కువ వడ్డీని చెల్లించిన వారు ఇప్పుడు బ్యాంకుకు ఎక్కువ డబ్బును వడ్డీగా చెల్లించవలసి ఉంటుంది. చాలామంది అధిక వడ్డీరేట్లను భరించలేరు. దాంతో, బ్యాంకు లేదా బ్యాంకులు డబ్బు తిరిగి చెల్లించే అవకాశం తక్కువగా ఉంటుంది. బ్యాంకులు సంక్షోభంలో పడతాయి. 2008లో లేమన్‌ బ్రదర్స్‌ విషయంలో ఇదే జరిగింది. క్రెడిట్‌ సూయిస్‌ రూపంలో అదే ఇప్పుడు పునరావృతమైంది. వడ్డీ రేటు మరోసారి పెరిగితే విదేశీ పెట్టుబడులు కూడా తగ్గుతాయి. కాబట్టి దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు ఇద్దరూ పెట్టుబడులు పెట్టడానికి నిరుత్సాహపడితే, ఆర్థిక వృద్ధి దెబ్బ తింటుంది. రెపో రేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్య విధానాన్ని అవలంబిస్తున్నాయి. కాబట్టి నయా ఉదారవాద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర విష వలయంలో ఉందని చెప్పవచ్చు.
        పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కారణంగా పదేపదే ఏర్పడిన ప్రపంచ మాంద్యం సాధారణ ప్రజల జీవితాల్లో అస్థిరతను సృష్టించింది. ఉదారవాద ఆర్థిక చట్రంలో ఎవరికి ఉద్యోగం పోతుందో, జీతం ఎప్పుడు తగ్గుతుందో, రిటైర్మెంట్‌ తర్వాత పింఛను వస్తుందో లేదో.. లాంటి అనేక అంశాలతో ప్రయివేటు ఉద్యోగులే కాదు. ప్రభుత్వోద్యోగులు కూడా అల్లాడుతున్నారు. ఈ సమయంలో, పెట్టుబడిదారీ దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు తమ కంపెనీలను రక్షించుకోవడానికి, పెన్షన్లను కాపాడుకోవడానికి, ఉద్యోగాలకు హామీ పొందడానికి ఉద్యమ బాట పట్టారు. లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రత్యామ్నాయ వామపక్ష రాజకీయాలు పుంజుకుంటున్నాయి. భారతదేశంలో రైతులు తమ డిమాండ్ల కోసం మళ్లీ లాంగ్‌ మార్చ్‌ చేశారు. కార్మికులు తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు. బ్యాంకు-ఇన్సూరెన్స్‌ కార్మికులు జీతాలు, ఇతర ప్రయోజనాల కోసం ఆందోళన చేస్తున్నారు. టెలికాం కంపెనీని కాపాడుకునేందుకు కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఉద్యోగాల కోసం యువత వీధుల్లోకి వస్తున్నారు. మార్క్స్‌ ప్రకారం, పెట్టుబడిదారీ విధానం ఇలాంటి సంక్షోభంలో మళ్లీ మళ్లీ పడుతుంటుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ వామపక్షాలే ఏకైక మార్గం.
 

/'గణశక్తి' సంపాదకీయం/