
ఈ వ్యయం వల్ల ప్రభుత్వానికే కాక ప్రజలకు ఆదాయ వృద్ధి జరుగుతుంది. ప్రజల వినిమయ శక్తి పెరిగి మార్కెట్‌లో సరుకులకు డిమాండ్ పెరిగి పారిశ్రామికీకరణ, సేవారంగం వృద్ధి అవుతుంది. అలాగే పెట్టుబడుల వ్యయ కల్పన వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వివిధ రూపాల్లో పెరుగుతాయి. ఉత్పత్తి, ఉత్పాదక శక్తి పెరుగుదలతోపాటు ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంత ప్రాధాన్యత గలిగిన ఈ వ్యయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ప్రస్తుతం ఈ పద్దు కింద ఖర్చుపెడుతున్న అరకొర నిధులు కూడా ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు చేయడంలేదు.
దేశంలో వివిధ రాష్ట్రాల బడ్జెట్ పెట్టుబడుల వ్యయాలపై అధ్యయనం చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్టును విడుదల చేసింది. మొత్తం 24 రాష్ట్రాల బడ్జెట్ పెట్టుబడుల వ్యయాలను పరిశీలించగా అందులో కర్ణాటక ప్రథమ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది. అంటే 23వ స్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల వ్యయంగా రూ.30680 కోట్లు కేటాయించి ఇందులో కేవలం రూ.6189 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
గతంతో పోలిస్తే బడ్జెట్ పెట్టుబడుల వ్యయం రాష్ట్రంలో తగ్గుతూ వస్తున్నది. బడ్జెట్‌లో కేటాయింపులే చాలా తక్కువ. కేటాయించినవి కూడా పూర్తిగా ఖర్చు చేయకుండా భారీ కోతలు విధిస్తున్నారు. 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టుబడుల వ్యయం కింద రూ.19,856 కోట్లు కేటాయించి 72.72 శాతం ఖర్చు చేశారు. 2019-20లో రూ.12242 కోట్లు కేటాయించి 37.90 శాతం, 2019-20లో రూ.18974 కోట్లు కేటాయించి 63 శాతం, 2021-22లో రూ.47583 కోట్లు కేటాయించి 52 శాతం, 2022-23లో రూ.3080 కోట్లు కేటాయించి 23 శాతం మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో మొత్తం రూ.2.79 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో మూలధన వ్యయ అంచనాగా రూ. 31061 కోట్లు కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్‌లో ఈ కేటాయింపులు కేవలం 11.12 శాతం మాత్రమే. ఇందులో సగం కూడా ఖర్చు చేస్తారనే గ్యారంటీ లేదు.
అభివృద్ధిలో ప్రభుత్వ పెట్టుబడులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్య, సామాజిక మౌళిక సదుపాయాలు, రహదార్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక ప్యాకేజీలు తదితర వాటిపై ప్రభుత్వం తన బడ్జెట్ ద్వారా చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు. ఈ వ్యయం వల్ల ప్రభుత్వానికే కాక ప్రజలకు ఆదాయ వృద్ధి జరుగుతుంది. ప్రజల వినిమయ శక్తి పెరిగి మార్కెట్‌లో సరుకులకు డిమాండ్ పెరిగి పారిశ్రామికీకరణ, సేవారంగం వృద్ధి అవుతుంది. అలాగే పెట్టుబడుల వ్యయ కల్పన వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వివిధ రూపాల్లో పెరుగుతాయి. ఉత్పత్తి, ఉత్పాదక శక్తి పెరుగుదలతోపాటు ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంత ప్రాధాన్యత గలిగిన ఈ వ్యయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ప్రస్తుతం ఈ పద్దు కింద ఖర్చుపెడుతున్న అరకొర నిధులు కూడా ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు చేయడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నదని ఊదరగొడుతున్నది. సంక్షేమ రాజ్యంగా నవరత్నాలను పదే పదే ముందుకు తెస్తున్నది. రాష్ట్ర స్ధూల ఉత్పత్తి పెరుగుదలను కూడా రాష్ట్రాభివృద్ధికి చిహ్నంగా చూపిస్తున్నది. రెండోవైపు ఏడాదికేడాది భారీగా అప్పులు తీస్తుకొస్తూ భారీ బడ్జెట్‌లను ప్రతిపాదిస్తున్నారు. బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం మాత్రం తిరోగమన దిశలో కొనసాగుతున్నది. ప్రజల ఆదాయాలు, జీవనోపాధులు పెరగకపోగా అంతరాలు పెరుగుతున్నాయి. ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గడంలేదు. చదువుకున్న యువతకు గౌరవప్రదమైన వేతనాలతో కూడిన ఉపాధి దొరకడంలేదు. ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు.
అభివృద్ధి అంటే తాత్కాలిక ఉపశమనం కలిగించే నవరత్నాలు చుట్టూ ప్రభుత్వం తిప్పుతున్నది. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్మరించి పాలన సాగిస్తున్నది. అభివృద్ధి- సంక్షేమం మధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నది.
దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి 975 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ నాలుగేళ్ళలో తీరప్రాంత అభివృద్ధికి, ఈప్రాంతంలో ఉండే మత్స్యకారుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మాటలకే పరిమితమయ్యింది. 3 వేల కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండిగ్, జెట్టీలు నిర్మిస్తామని ప్రకటించినా ఏ ఒక్కటీ పూర్తిచేయలేదు. ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా సముద్ర తీర అభివృద్ధి బహుముఖ చర్యలు ప్రణాళికా బద్ధంగా చేపట్టినట్లయితే ఈ నాలుగేళ్ళలో మత్య్సకారులకు అనేక ప్రయోజనాలు కలిగేవి. జీవనోపాధి, ఆదాయాలు పెరిగేవి. ఈ తరహా అభివృద్ధి కన్నా మొత్తం తీర ప్రాంతాన్ని బడా పెట్టుబడిదార్లకు ధారాదత్తం చేసే విధానాలను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో విశాఖలో నిర్మించిన గంగవరం పోర్టును కూడా అదానీ పరం చేసింది. అందులో ప్రభుత్వానికి ఉన్న వాటాను కూడా మోడీ ప్రభుత్వానికి లొంగిపోయి కారు చౌకగా అదానీకి అమ్మేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ క్రిష్ణపట్నం పోర్టుని కూడా అదానీ పరం చేసింది. ఇప్పుడు అదానీ చేతుల్లో వున్న గంగవరం, క్రిష్టపట్నం పోర్టులు ఆధునిక జైళ్ళుగా నడుస్తున్నాయి.
ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మూలపేట, కృష్ణా జిల్లాలో బందరు పోర్టులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో రామయపట్నంలో కూడా పోర్టును నిర్మిస్తున్నట్లు గతంలో ప్రకటన చేశారు. ఈ మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణం పూర్తి అయిన తరువాత వీటి కార్యకలాపాలు, నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని ప్రకటన చేసారు. ప్రభుత్వం కేవలం ఒక ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉంటుందని, ల్యాండ్‌లార్డ్ పోర్టులుగా ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ తరహా పోర్టుల వల్ల ప్రజలకు, ఆయా ప్రాంతాలకు ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా పెద్ద ఎత్తున శ్రమ దోపిడీ జరుగుతుంది. వాస్తవంగా ఈ మూడు పోర్టులను ప్రభుత్వమే రాష్ట్ర బడ్జెట్ నుండి, రుణాల ద్వారా నిధులు సమీకరించి నిర్మించి ప్రభుత్వమే నడిపితే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది.
దీర్ఘకాలంగా రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్య, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకపోవడం. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు ఇతర జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటానికి బడ్జెట్ నుండి నిధులు కేటాయించడంలేదు. ఒకవేళ కేటాయించినా వాటిని ఖర్చు చేయకుండా ఇతర కార్యకలాపాలకు దారి మళ్ళిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఒక కలగానే మిగిలిపోతున్నది. పోలవరం ప్రాజెక్టు కూడా ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితి. ఫలితంగా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు నీళ్ళు సదుపాయాలు లేక వ్యవసాయం దెబ్బ తింటున్నది. రైతాంగం సంక్షోభం నుండి బయట పడలేకపోతున్నారు.
రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ రంగం అత్యంత కీలకమైనది. ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల కల్పన పూర్తిగా స్తంభించి పోయింది. అనాదిగా పెండింగ్‌లోను, నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేయటానికి బడ్జెట్ నుండి నిధులు కేటాయించడటం లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్ సంస్థలను కేంద్ర బిజెపి సర్కార్ విద్యుత్ సంస్కరణలకు తలొగ్గి కార్పొరేట్ శక్తుల పరం చేయటానికి పూనుకుంది. కృష్ణపట్నం దగ్గరున్న దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయపూనుకున్నది. కొత్తగా ప్రభుత్వ పెట్టుబడులతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేయకూడదనే విధానం చేపట్టింది. ఇటీవల గ్రీన్ ఎనర్జీ పేర రాయలసీమ, ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు అదానీకి కట్టబెట్టారు. ఈ చర్యలు భవిష్యత్‌లో రాష్ట్రాభివృద్ధిపైన, ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపుతాయి.
రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమల్లో పంచదార పరిశ్రమ చాలా ముఖ్యమైనది. సహకార రంగంలో అనేక పరిశ్రమలు అనేక దశాబ్దాల క్రితమే స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమలను బలపర్చటానికి, విస్తరింపజేయటానికి ప్రభుత్వం బడ్జెట్ నుండి పెట్టుబడి వ్యయ కేటాయింపులు చాలా కాలం నుండి నిలిపేసింది. నష్టాల పేర వీటిని మూసివేసే చర్యలకు, ఈ సంస్థల కింది ఉన్న భూములను కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మే చర్యలకు ప్రభుత్వం తెరలేపింది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది చెరకు రైతులు అనేక విధాలుగా నష్టపోయారు.
రాష్ట్రంలో మరో ముఖ్యమైన వ్యవసాయ అనుబంధమైనది పాడి పరిశ్రమ. రాష్ట్రంలో అత్యధిక మంది గ్రామీణ ప్రజలు పాడి పరిశ్రమ మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనేక ఏళ్ళ క్రితం ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో శక్తివంతమైన సహకార వ్యవస్థను నెలకొల్పారు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఈ రంగంలో మంచి పురోగతి సాధించింది. గ్రామ-జిల్లా-రాష్ట్ర స్థాయి అనే మూడు దొంతరుల వ్యవస్ధీకృత సహకార రంగాన్ని అభివృద్ధి చేశారు. ఈ రంగంలో కూడా గత కొన్నేళ్ళ నుండి బడ్జెట్ నుండి పెట్టుబడి కేటాయింపులు జరపకపోగా అనేక డెయిరీలను మూసివేసింది. ఇటీవల ఈ రంగం మొత్తాన్ని బిజెపి ఒత్తిడితో గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థ పరం చేసింది. ఈ చర్యలు డెయిరీ రంగంలో సహకార వ్యవస్థ పూర్తిగా ధ్వంసమవ్వటానికి దారితీస్తాయి.
విద్య, వైద్య, సామాజిక రంగాల్లో కూడా పెట్టుబడుల వ్యయం తగినంతగా పెంచటంలేదు. కేవలం అమ్మ ఒడి, నాడు నేడులకే విద్యా రంగంలో ప్రభుత్వం పరిమితమయ్యింది. గత కొంత కాలంగా పాఠశాలల విలీనం, ప్రభుత్వ విద్యా రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంచే చర్యలకు ప్రభుత్వం పాల్పడుతున్నది. కొత్తగా విద్యా సంస్థల విస్తరణకు స్వస్తి పలికింది. కాలేజీలు, యూనివర్సిటీల్లో అవసరమైన భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించటం లేదు. విద్య కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నది.
వైద్యరంగంలో కూడా పెట్టుబడుల వ్యయం కోతకు గురౌతున్నది. ప్రణాళికాబద్దంగా ఆరోగ్య సదుపాయాలను ప్రజలకు అందించే చర్యలు చేపట్టటంలేదు. మెడికల్ కాలేజీల పేర ప్రాథమిక, ప్రాంతీయ, జిల్లా స్థాయి ఆసుపత్రులకు పెట్టుబడి నిధులు కేటాయించటంలేదు. ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ పేర ఈ రంగాన్ని నీరుగారుస్తున్నది.
ఇక వెనుకబడి ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రణాళికా బద్దంగా వివిధ రంగాల్లో ప్రజలకు రోడ్లు, మంచినీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా బడ్జెట్ నుండి పెట్టుబడి నిధులు కేటాయించటంలేదు. ఈ ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. చివరికి కేంద్ర రాష్ట్ర ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ల నిధులను కూడా పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయకుండా దారి మళ్ళిస్తోంది. విధులు-నిధులను వికేంద్రీకరించ కుండా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కాగితాలకే పరిమితం చేసింది. రాష్ట్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక లేకుండా, తగిన విధంగా బడ్జెట్ నుండి పెట్టుబడి నిధులు కేటాయించి ఖర్చు చేయకుండా కేవలం సంక్షేమ పథకాల ద్వారానే రాష్ట్రం సమగ్రాభివృద్ధి జరగడం అసాధ్యం. రాష్ట్ర ప్రభుత్వ దృక్పధం మారాలి.
(వ్యాసకర్త సెల్ : 9490098792)
డా|| బి.గంగారావు