Nov 27,2022 10:35

కొత్త ఎప్పుడూ ఒక వింతే. చూడగానే హాయిగా అనిపించే పచ్చని మొక్కలు, వాటి పువ్వులు, కాయల విషయంలో అయితే మరీ విశేషం. ప్రతిప్రాణి జీవనానికీ అవసరమైన ప్రాణ వాయువును అందించేది మొక్కలని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సువిశాల జగత్తులో మనం చూడగలిగే మొక్కలు చాలా తక్కువనే చెప్పవచ్చు. మనకు తెలియని ప్రదేశాలలో, ఇతర దేశాలలో పెరిగే మొక్కల గురించి తెలుసుకోవాలని మనకూ ఉత్కంఠగానే ఉంటుంది. అలా ఇతర దేశాలకు చెందిన విభిన్న రకాల మొక్కలు మన దేశంలోని కడియం నర్సరీలలో కనువిందు చేస్తున్నాయి. మరి ఆ సరికొత్త మొక్కల గురించి తెలుసుకుందామా..!
పెన్సిల్‌ కాక్టస్‌..

1


దీని శాస్త్రీయ నామం యుఫోర్బియా తిరుకాలీ. దీనిలో మొక్కకు సాధారణంగా ఉండే ఆకులు, పువ్వులు లాంటి భాగాలేమీ కనిపించవు. ఆకుపచ్చని పుల్లల్లాంటి వాటితో కొమ్మలు, ప్రతి కొమ్మలతో పెరుగుతుంది. ఇది గల్ఫ్‌ దేశాలలో పెరిగే ఎడారి మొక్క. నీటి వనరు పెద్దగా అవసరం లేకుండానే పెరుగుతుంది. దీనిని స్టిక్‌ కాక్టస్‌ అని కూడా పిలుస్తారు. ఇండోర్‌ ప్లాంట్‌గా మనకు ఇష్టమైన ప్రదేశంలో అలంకరణకు పెంచుకోవచ్చు.
సాల్వియా బ్లూ..

1111111111111111111


దీని శాస్త్రీయ నామం సాల్వియా ఫారినేసియా. జపాన్‌, ఉత్తర అమెరికాకు చెందిన మొక్క ఇది. దీని ఆకులు అండాకారంలో ఉంటాయి. పువ్వులు 15 నుంచి 30 సెం.మీ. పొడవు ఉండి, పుష్ప గుచ్ఛం మాదిరి పూస్తుంది. నీలం, ఊదా, తెలుపు రంగులతో పూల రకాలున్నాయి. మనదేశ వాతావరణంలో చలికాలంలో పూలు పూస్తుంది. అలంకరణ కోసం కుండీల్లో పెంచుకునే మొక్క.
హిఫోర్బియా థాయ్..

gardeen


సాధారణంగా హిఫోర్బియా అనేది ముళ్ళ మొక్క. కాండమంతా ముళ్ళు విస్తరించి ఉంటాయి. కానీ ఈ హిఫోర్బియా థారుకి ముళ్ళు కనిపించవు. ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. పుప్పొడి పసుపు రంగులో ఉండి, ఎర్రటి ద్విదళ రేఖలతో పువ్వు చాలా అందంగా ఉంటుంది. కుండీల్లో పెంచుకునే సౌలభ్యమున్న, థాయిలాండ్‌కు చెందిన మొక్క.
తరూనియా ఫోర్నియేరి..

gardeen 9


శీతా కాలంలో రంగు రంగుల పువ్వులతో అలరించే అద్భుతమైన పూలమొక్క ఇది. అనేక రంగులతో గరాటు ఆకారంలో ఉన్న పూలు పూస్తుంది తరూనియా ఫోర్నియేరి. ఇందులో తెలుపు, ఎరుపు, పింకు, నీలం, పసుపు మరెన్నో రంగుల్లో పూలు పూసే వివిధ రకాలున్నాయి. వీటిని బోర్డర్‌ ప్లాంట్స్‌గా ఇంటి చుట్టూ అలంకరణ కోసం పెంచుకుంటారు. ఏ రకం నేలైనా ఈ మొక్కకు అనుకూలమే. కుండీల్లోనూ పెరుగుతాయి.
టుడే టుమారో ప్లాంట్‌..

gardeen


బ్రున్‌ఫెల్సియా పాసిఫ్లోరా దీని శాస్త్రీయ నామం. తెలుపు, వయొలెట్‌ రెండు రంగుల్లోనూ పూలు ఒకే మొక్కకు పూస్తాయి. ఒకే మొక్కకు ఒకదాని పక్కన ఒకటి రెండు వేర్వేరు రంగుల్లో పూలు పూయడమే ఈ మొక్క ప్రత్యేకత. అమెరికా దేశపు మొక్క ఇది.
డైసియా బ్లూ..

blue


దీని శాస్త్రీయ నామం దీని పూలు చామంతి పువ్వుల్లా ఉంటాయి. ఇందులో చాలా రంగుల పూలు పూసే రకాలు ఉన్నాయి. నీలి రంగు పూసేవి కాస్త ప్రత్యేక ఆకర్షణతో ఉంటాయి. మొక్క నుంచి కోసిన తరువాత కూడా కొన్నిరోజులు తాజాగానే ఉంటాయి. అందుకని వీటిని ఎక్కువగా డెకరేషన్‌కి ఉపయోగిస్తారు. కుండీల్లోనూ పెంచుకునే సౌలభ్యమున్న మొక్క.
అమెజాన్‌ బ్లూ..

gardeen 9


అఖిటేరియా అజూరియా దీని శాస్త్రీయ నామం. దక్షిణ అమెరికా దీని పుట్టిల్లు. ఎక్కువగా బ్రెజిల్‌, అమెజాన్‌ అడవుల్లో పెరుగుతాయి. దీని పువ్వులు నీలం రంగులో ఉండి, రెండు పెదవులు తెరిచినట్టు ఉంటాయి. అందుకే దీనిని లిప్స్‌ ఫ్లవర్‌ ప్లాంట్‌ అని కూడా అంటారు. ఏడాదంతా చెదురుమదురుగా పూలు పూసినా శీతాకాలంలో ఎక్కువగానే పూస్తుంది.

 

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506