
ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అందరినీ రెగ్యులరైజ్ చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో 2014 జూన్ 2 నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన 10,177 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంగా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం రెగ్యులర్ కావడానికి అవకాశమున్న ఉద్యోగులు 6,665 మంది మాత్రమే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఇంత మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పలేదు. అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కానీ దీనికి భిన్నంగా ప్రభుత్వం ప్రకటన చేయడం 3 లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగు ఉద్యోగులను మోసగించడమే.
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా, మానిఫెస్టోలో, ప్రజా సంకల్ప యాత్రలో హామీలిచ్చింది. కాని ఈ హామీలను నేటికీ అమలు చెయ్యలేదు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యుత్, ఆర్‌టిసి, టూరిజం, హౌసింగ్ వంటి 26 ప్రభుత్వరంగ సంస్థలు, మున్సిపల్, పంచాయితీ వంటి స్థానిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ, వెలుగు తదితర ప్రభుత్వ పథకాలు, యూనివర్శిటీలు, టిటిడి వంటి ధార్మిక సంస్థలలో మూడు లక్షలకు పైగా ఉద్యోగులు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నారు. వీరే కాక పై శాఖలు, సంస్థలలో 3 దశాబ్దాల నుండి ఎన్‌ఎంఆర్, డైలీ వేజ్, కంటింజెంట్, టైమ్ స్కేల్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా ఏ నాటికైనా తాము రెగ్యులర్ అవుతామన్న ఆశతో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అందరినీ రెగ్యులరైజ్ చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో 2014 జూన్ 2 నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన 10,177 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంగా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం రెగ్యులర్ కావడానికి అవకాశమున్న ఉద్యోగులు 6,665 మంది మాత్రమే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఇంత మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పలేదు. అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కానీ దీనికి భిన్నంగా ప్రభుత్వం ప్రకటన చేయడం 3 లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగు ఉద్యోగులను మోసగించడమే. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి గురిచేస్తున్నది. ఇచ్చిన హామీల ప్రకారం అందర్నీ రెగ్యులరైజ్ చేయాలి. 'మాట తప్పను - మడమ తిప్పను' అనే మాటలను అందర్నీ రెగ్యులరైజ్ చేయడం ద్వారానే సి.ఎం జగన్‌మోహన్ రెడ్డి రుజువు చేసుకోవాలి.
సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో తక్కువ వేతనాలతో జీవో 5, 7 లను విడుదల చేసింది. గత పిఆర్‌సి లోని కనీస వేతనం రూ.20 వేలు కాగా కేవలం రూ.15 వేలతో జీవో 7 విడుదల చేసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను దగా చేసింది. నేషనల్ హెల్త్ మిషన్, సమగ్రశిక్ష, ఉపాధి హామీ, వెలుగు, 102, 104, 108, ఏపి సాక్స్, ఎన్‌టిఇపి, మెప్మా, ఐసిడిఎస్ వంటి ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు అమలు చేయాల్సిన మినిమమ్ టైమ్ స్కేలు నేటికీ అమలు చెయ్యలేదు.
ప్రభుత్వ విధానాల వల్ల పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంటు చార్జీలు, రవాణా చార్జీలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థితి ఉన్నది. వీటి పరిష్కారానికై అందరూ కలిసి ప్రభుత్వంపై ఐక్యంగా ఒత్తిడి తేవాలి.
అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్.యం.ఆర్ డైలీ వేజ్, కంటింజెంట్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులనే పేరిట రాష్ట్ర ప్రభుత్వ పథకాలేవీ వర్తింపచేయడం లేదు. వీరికి ప్రభుత్వ పథకాలను అమలు చేయడం కష్ట సాధ్యమేనంటూ ముఖ్యమంత్రి సెలవివ్వడం అన్యాయం.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కొత్తగా వచ్చారని, ఏడాదే అయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉమ్మడి రాష్ట్రం నాటి నుండి విధులు నిర్వహస్తున్నారు. ప్రజలకు సేవలందిస్తున్నారన్న వాస్తవాన్ని మంత్రిర్యులు తెలుసుకోవడం మంచిది. తెలంగాణలో ఎవ్వరూ రెగ్యులర్ కాలేదంటున్న మంత్రి వ్యాఖ్యలు వాస్తవం కాదు. తెలంగాణలో 2014 జూన్ 2 నాటికి పనిచేస్తున్న వారిని (5,544 మందిని) రెగ్యులర్ చేశారు. వీరితో పాటు విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఆర్టిజన్స్‌గా రెగ్యులర్ చేశారు. ఈ విధంగా మంత్రివర్యులే మాట్లాడటం ఆయన స్థాయికి తగినది కాదు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి వాస్తవ సమస్యలను అర్ధం చేసుకోలేదు. ఇప్పటికైనా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సమస్యలపై వారి జెఎసి నాయకత్వంతోనే చర్చలు జరిపే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాలి. సమస్యల పరిష్కారానికై ఇప్పటికే వారి జెఎసి పోరుబాట పట్టింది. ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కింది సమస్యలు పరిష్కరించాలి.
1. డిసెంబర్ 31, 2022 నాటికి పని చేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. 2. ఉద్యోగికి 3-5 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలి. 3. టెమ్ స్కేల్, డైలీ వేజ్, కంటింజెంట్ తదితర క్యాడర్ల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. 4. పార్ట్ టైమ్, గెస్ట్ వ్యవస్థను ఫుల్ టైమ్‌గా మార్చాలి. 5. అందరికీ సమాన పనికి సమాన వేతనం, సౌకర్యాలు అమలు చేయాలి. ఒకే క్యాడర్-ఒకే వేతనాన్ని అమలు చెయ్యాలి. 6. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 7. పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. 8. రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. 9. సాధారణ సెలవలు, అనారోగ్య సెలవులు, మెడికల్ లీవ్‌లు ఇవ్వాలి. 10. ఇపిఎఫ్, ఇఎస్‌ఐ లను కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైమ్, వివిధ స్కీమ్‌లలో అమలు చెయ్యాలి.
ఈ సమస్యల పరిష్కారానికై పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్ టైమ్, గెస్ట్ తదితర క్యాటగిరి ఉద్యోగులు ఐక్య ఆందోళనలు నిర్వహించాలని జెఎసి నిర్ణయించింది.
/వ్యాసకర్త ఎ.పి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ జెఎసి చైర్మన్ /
ఎ.వి. నాగేశ్వరరావు