Nov 03,2023 07:15

        రాష్ట్రానికి రాష్ట్రంగానే కరువు రక్కసి జడలు విప్పగా అన్నదాతల వ్యధ నింగినంటగా ప్రభుత్వానికి ఇవేమీ కనిపించట్లేదు వినిపించట్లేదనడానికి కరువు మండలాల ప్రకటనే నిదర్శనం. ఎన్నికలకు ముందు 'నేను విన్నాను నేను చూశాను' అనే నినాదాన్ని మారు మోగించిన నాయకుని పాలనలోనే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు అంతర్ధానమవడం విస్తుగొల్పే విషయం. సాగు లేక బీడు పడ్డ లక్షల ఎకరాలు, ఎండుతున్న పంటలు, నీటి నిల్వల్లేక అడుగంటిన ప్రాజెక్టులు, తేమ ఇంకిపోయి నెర్రెలిచ్చిన భూములు.. అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఇవే దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఆచితూచి ఏడు జిల్లాల్లోని 103 మండలాల్లో కరువును గుర్తించి మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రెండు మండలాలు మాత్రమే కోస్తాలోనివి. తతిమ్మా 101 మండలాలూ రాయలసీమలోనివి. ప్రకటించిన వాటిలోనూ తీవ్ర స్థాయి కరువు 80 మండలాలు, మధ్యస్త స్థాయి 23 మండలాలుగా వర్గీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్‌ ముగిసే సెప్టెంబర్‌ ఆఖరు నాటికి కనీసం 300 మండలాల్లో తీవ్ర దుర్భిక్షం ఉందని ప్రభుత్వ నివేదికలే తెలుపుతున్నాయి. మరి 103 మండలాలకే సర్కారు ఎందుకు పరిమితమైందో పెద్ద పజిల్‌. గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా ఇట్టే క్షణాల్లో రాష్ట్ర కేంద్రానికి చేరవేసే సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ, రైతు సమస్యలన్నింటికీ పరిష్కారంగా పేర్కొనే రైతు భరోసా కేంద్రాలు, రాష్ట్రంలో కరువు కబళింపుపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడం విచిత్రమే.
ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ఎల్‌నినో ముప్పు ఉందని లోకం కోడై కూసినా ప్రభుత్వానికి కరువు ధ్యాస లేదు. ముందస్తు సన్నద్ధతలో నెలకొన్న వైఫల్యం ఆ విషయాన్ని తేటతెల్లం చేసింది. జులైలో సరైన వానల్లేవు. ఆగస్టులో 55 శాతం వర్షపు లోటు ఏర్పడి అనావృష్టి ఛాయలు అలముకున్నాయి. ఈ సంకేతాలతోనైనా సర్కారు అప్రమత్తం కాలేదు. ఆఖరుకొచ్చేసరికి వ్యవసాయ పంటల సాధారణ సాగులో 24 లక్షల ఎకరాలు విత్తనం పడక బీడు పడ్డాయి. ఉద్యానవన పంటలు ఆరు లక్షల ఎకరాల్లో వేయలేదు. ఉత్తరోత్తరా 30 లక్షల ఎకరాల్లో సేద్యం లేకుండా పోయింది. వేరుశనగ, మొక్కజొన్న, ఆముదాలు, పత్తి, కందులు సహా వేసిన పంటలు ఎండి పోయాయి. వరి పొలాలు సైతం నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. సగానికి సగం దిగుబడుల క్షీణత ఉంది. అక్టోబర్‌లో అయితే కొన్ని దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని విధంగా 90 శాతం తక్కువ వర్షం నమోదైంది. దుర్భిక్షంపై మీడియా, పత్రికలు ఘోషిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. అడపాదడపా కురిసే సగటు వర్షాలను చూపించి కరువును కప్పెట్టేందుకు ఆఖరు వరకు ప్రయత్నించింది. ప్రతిపక్షాల, రైతుల ఆందోళనల, సాంకేతిక కారణాల దృష్ట్యా అరకొరగా హడావుడిగా కరువు మండలాలను ప్రకటించింది. ఈ ప్రహసనం కంటి తుడుపు చర్యగా తలపిస్తోంది.
         కరువు మండలాల గుర్తింపులో శాస్త్రీయత ఏకోశాన లేదు. ముఖ్యమంత్రి ఇలాక కడప జిల్లా తీవ్ర దుర్భిక్షంలో మగ్గుతుండగా ఇక్కడ ఒక్క మండలాన్నీ ప్రకటించకపోవడానికి కారణాలేమిటో ఒక పట్టాన అంతుబట్టదు. తిరుపతి జిల్లా ఆది నుంచీ వర్షాభావాన్ని ఎదుర్కొంటోంది. ఇక్కడా ఒక్క మండలమూ ప్రకటించలేదు. అనంతపురం తర్వాత దుర్భిక్ష జిల్లాగా ఉన్న ప్రకాశంలోనూ అంతే. రాష్ట్రంలోనే తక్కువ వర్షపాతం నమోదైన నెల్లూరునూ విస్మరించారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పల్నాడు...చెప్పుకుంటూ పోతే అన్ని మెట్ట ప్రాంతాల్లోనూ తీవ్ర అనావృష్టి తాండవిస్తోంది. తూతూ మంత్రంలా కాకుండా శాస్త్రీయ అంచనాలతో ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలి. కరువును తక్కువ చేసి మండలాలకు కోతలు పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం. అందుకే తొలి ప్రకటనపై పున:పరిశీలన చేయాలి. రాజకీయ కారణాలతో కరువు మండలాల ప్రకటనపై గిల్టీగా ఫీలవడం తగనిపని. అందువల్ల బాధితులు నష్టపోతారు. కరువు మండలాలు ప్రకటించడంతోనే సరిపోదు. సముచిత స్థాయిలో రైతులకు పంట నష్టపరిహారం, బీమా, పశుగ్రాసం, పశువులకు తాగునీరు, ప్రజలకు తాగునీరు, రైతు రుణాల వాయిదా, వడ్డీ మాఫీ, కొత్త రుణాలు, పండిన పంటలకు ధరలు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు వంటి అన్ని సహాయక చర్యలనూ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కేంద్రంపై ఒత్తిడి చేసి నిధులు రాబట్టాలి.