Jul 21,2023 08:37

బీజింగ్‌ : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, దౌత్య రాయబారి హెన్రీ కిసింజర్‌ను గురువారం నాడిక్కడ కలుసుకున్నారు. కిసింజర్‌ ఇటీవలే వందో పుట్టిన రోజు జరుపుకున్నారని అంటూ ఇన్నేళ్లలో వంద సార్లకు పైగా ఆయన చైనాలో పర్యటించారని జిన్‌పింగ్‌ గుర్తు చేసుకున్నారు. ఈ రెండు వందలు కలిసి ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించాయని వ్యాఖ్యానించారు. ''52ఏళ్ల క్రితం చైనా నేతలు మావో జెడాంగ్‌, ప్రధాని చౌ ఎన్‌ లై, అమెరికా నేతలు రిచర్డ్‌నిక్సన్‌, డాక్టర్‌ కిసింజర్‌ తమదైన అసాధారణ వ్యూహాత్మక దార్శనికతతో ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకున్నారని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు ఆప్పుడే పునరుద్ధరించబడ్డాయని ఆయన తెలిపారు. ఆనాటి నిర్ణయం ఇరు దేశాలకు ప్రయోజనాలు చేకూర్చిందని, ప్రపంచగతినే మార్చేసిందని అన్నారు. స్నేహ సంబంధాలకు చైనా ప్రజలు ఎప్పుడూ విలువ ఇస్తారన్నారు. ''మా పాత మిత్రులను మేం ఎన్నటికీ మరిచిపోం, అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాల వృద్ధికి కృషి చేసిన మీ విలువైన చారిత్రక సేవలను కూడా మరిచిపోలేం.'' అని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచం చాలా వేగంగా మార్పు చెందుతోందని అన్నారు. అంతర్జాతీయంగా చాలా మార్పులు వస్తున్నాయన్నారు. చైనా, అమెరికాలు మళ్లీ క్రాస్‌ రోడ్‌లో నిలుచున్నాయన్నారు. ఈ తరుణంలో మళ్లీ ఇరు పక్షాలు మరో చారిత్రక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు.