Oct 08,2022 07:11

కారుచీకట్లు కమ్మేసినా..ఒక చిరుదీపం కొత్త వెలుగుదారి చూపుతుంది. వైఫల్యాలతో కుంగిపోతున్న మనిషిని వెన్ను చరిచి భరోసానిస్తే జయభేరి మోగిస్తాడు. అవార్డులు, రివార్డులు, ప్రోత్సహకాలు, ఫెలోషిప్‌లు మనిషికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. కాని కేంద్రంలోని మోడీ సర్కార్‌ శాస్త్రీయ దృక్ఫథంపై కత్తి కట్టినట్టు వ్యవహరిస్తోంది. శాస్త్ర పరిశోధనలు, అంతరిక్షం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, భూ విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ మంత్రిత్వశాఖల పరిధిలో శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు అందజేసే 300కు పైగా అవార్డులను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించడం దారుణం. వీటి స్థానంలో విజ్ఞాన రత్న అనే పేరుతో నోబెల్‌ తరహా పురస్కారమిస్తారట. చిన్నచిన్న ప్రయత్నాలను తట్టిలేపి బృహత్తర విజయాలకు ఊపిరిలూదే చిరు ప్రోత్సహాకాలను కాలదన్నేసి ఒకే ఒక బాహుబలి పురస్కారమిస్తామంటే ఎలా? ఒకే దేశం ఒకే పన్ను, ఒకే మతం, ఒకే భాష..ఇలా అంటూ ఇప్పుడు ఒకే పురస్కారం అని కేంద్రం చెబుతోంది. విద్యుత్‌, విద్య ఇలా అన్ని రంగాల్లోనూ కేంద్రీకరణ కత్తి వేలాడదీసిన మోడీ సర్కార్‌.. శాస్త్ర, పరిశోధక పురస్కారాలు కుదించడం వెనుకా పెద్ద కుట్రే దాగుందన్నది సత్యం.
         లౌకికవాదం, మానవత్వాల అభివృద్ధికి దోహదం చేసే శాస్త్రీయ దృక్ఫథాన్ని తార్కిక, సంస్కరణల స్ఫూర్తితో పెంపొందించడం ప్రతి పౌరుడి బాధ్యతగా మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అధికరణ 51ఎ(హెచ్‌) కింద 'శాస్త్రీయ దృక్ఫథా'న్ని రాజ్యాంగంలో పొందుపర్చారు. ప్రపంచంలో 'శాస్త్రీయ దృక్పథా'న్ని పౌరుల బాధ్యతగా నిర్దేశించిన తొలి రాజ్యాంగంగా ఖ్యాతినొందింది. భారత తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా 'శాస్త్రీయ దృక్ఫథం' ప్రాధాన్యత గురించి 1946 నుంచే నొక్కి చెబుతూ వచ్చారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) వంటి విద్యా సంస్థలు, కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్టిఫిక్‌ అండ్‌ ఇండిస్టీయల్‌ రీసెర్స్‌ (సిఎస్‌ఐఆర్‌) వంటి ప్రయోగశాలలు స్థాపించడానికి బీజాలు వేసింది స్వాతంత్రోద్యమ నాయకులకు ఉన్న ఈ శాస్త్రీయ ఆలోచనలే. ఇప్పుడు సంఫ్‌ు పరివార్‌ నేతృత్వంలో మూఢత్వ బాటలో పయనిస్తోన్న కేంద్రానికి కునుకు లేకుండా చేస్తున్నదీ ఈ ఆలోచనలే. అందుకనే శాస్త్ర, సాంకేతిక రంగాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ శాస్త్రీయ దృక్ఫథాన్నే లేకుండా చేయాలనే దుర్మార్గానికి ఒడిగట్టింది. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో అడుగుపెట్టిన నాటి నుంచి సైన్స్‌పై విషం కక్కుతూనేవుంది. మూఢత్వ జాడ్యంపై ధీరోచితంగా పోరుసల్ఫిన హేతువాదులు గౌరీ లంకేశ్‌, గోవింద్‌ పన్సారే, దబోల్కర్‌, కల్బుర్గి వంటి వారిని సంఫ్‌ు పరివార్‌ పొట్టనపెట్టుకుంది. తూటాలు మనుషుల ప్రాణాలు అయితే తీయగలిగాయి కానీ..వారు వదిలివెళ్లిన సూర్యతేజ సమ ప్రభలాంటి హేతువాద, శాస్త్రీయ ఆలోనలను ఇసుమంతైనా హరించలేకపోయాయి.
       ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకుంటున్న మేక్‌ ఇన్‌ ఇండియా, ఇ-మార్కెట్‌ పథకాలను సైతం ప్రభుత్వ రంగ పరిశోధనలను నీరుగార్చేందుకు బలవంతంగా రుద్దారు.. బడా కార్పొరేట్‌ కంపెనీలకు విదేశాల నుంచి నాణ్యమైన ముడి సరుకులను దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తూ..ప్రభుత్వ రంగంలోని పరిశోధన సంస్థలకు మాత్రం 'స్వదేశీ' ఆంక్షలు విధిస్తూవచ్చింది. కోవిడ్‌ సమయంలో సిఎస్‌ఐఆర్‌, ఎయిమ్స్‌ వంటి సంస్థలు తక్కువ వనరులతోనే అద్భుతమైన ఫలితాలను సాధిస్తే ఆ పరిశోధనల ఫలితాలను భారత్‌ బయోటెక్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు మోడీ సర్కార్‌ అప్పనంగా అప్పజెప్పింది. ఈ ఘనతంతా కార్పొరేట్‌ ఖాతాల్లో వేసి 'పద్మ' పురస్కారాలతో సత్కరించి కపటనీతి చాటుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఒకవైపు చీకొడుతున్నా..అయుర్వేదం ముసుగులో బాబా రాందేవ్‌ వంటి సనాతన కార్పొరేట్‌ గురువులు సాగిస్తున్న వ్యాపారాలకు మోడీ సర్కార్‌ సాగిలిపడి కోట్లాది రూపాయల రాయితీలు కుమ్మరించిందే తప్ప ప్రభుత్వ రంగ పరిశోధనలకు కనీస ప్రోత్సాహకాలు ఇవ్వలేకపోయింది. 1940-50లలో సుప్రసిద్ధ శాస్త్రవేత్త అయిన సిఎస్‌ఐఆర్‌ వ్యవస్థాపకులు శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పేరిట ప్రతి యేటా సెప్టెంబర్‌ 26న అందజేసే పురస్కారాన్ని కూడా మోడీ సర్కార్‌ ఈ దఫా ప్రకటించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం వద్ద కాసులు నిండుకొని కాదు ఈ అవార్డులు కుదిస్తున్నది. దీని వెనుక శాస్త్రీయ దృక్ఫథాన్ని అణిచేసే కుట్రే దాగుదున్నదని ఈ పరిణామాలన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. పరిశోధనలకు, శాస్త్ర విజ్ఞానానికి హానికరమైన కేంద్ర ప్రభుత్వ దుర్విధానాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. భారతదేశంలో అన్ని రంగాల్లో వున్న వైవిధ్యాన్ని నిలబెట్టుకోవాలి.